సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న షరతుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ మీటర్లకు కాకుండా దశల వారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు (డీటీ) అన్నింటికీ మీటర్లు బిగించాలని తాజాగా స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది.
రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తం 1.6 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో వీటికి సరఫరా చేస్తున్న విద్యుత్‌కు స్పష్టమైన లెక్కలు లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 32–35 శాతం వరకు వ్యవసాయానికి సరఫరా అవుతోందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.5,940 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రూ.4,060 కోట్లు కలిపి డిస్కంలకు రూ.10 వేల కోట్ల సబ్సిడీలను ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ప్రైవేటీకరణ దిశగా..
విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేంద్రం.. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లు–2021ను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వ్యవసాయం సహా ప్రతి వినియోగదారుడు వాడే విద్యుత్‌కు కచ్చితమైన లెక్కలు తీసి సంబంధిత ప్రభుత్వ డిస్కంలు/ ప్రైవేటు కంపెనీలు బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించిన ఆత్మ నిర్భర్ రుణాలకు అర్హత సాధించాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని అప్పట్లో కేంద్రం షరతులు విధించింది. తెలంగాణ డిస్కంలకు రూ.12,600 కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.6,300 కోట్లను గతేడాది జూలైలో విడుదల చేయగా, రెండో విడతగా చెల్లించాల్సిన రూ.6,300 కోట్ల రుణాలను ఈ షరతులకు అంగీకరించకపోవడంతో కేంద్రం నిలుపుదల చేసింది. తాజాగా కేంద్రం వెనక్కి తగ్గి వ్యవసాయ కనెక్షన్లకు బదులు రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించాలని స్పష్టతనిచ్చింది. దీంతో త్వరలో రాష్ట్ర డిస్కంలకు రావాల్సిన రెండో విడత రుణాలు విడుదల కావొచ్చని ట్రాన్స్‌కో అధికారవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
సీఎం పరిశీలనలో ప్రతిపాదనలు..
రాష్ట్రంలో 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. కేంద్రం సూచన మేరకు వీటికి మీటర్లు బిగించే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వీటిపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దశల వారీగా ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సానుకూలతతో ఉన్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగిస్తే దారి పరిధిలోని వినియోగదారులు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌కు సంబంధించిన గణాంకాలు లభిస్తాయి. ఏ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతోంది? అందులో ఎంత మేర విద్యుత్‌కు బిల్లింగ్ జరుగుతోంది? ఎంత మేరకు విద్యుత్ నష్టం/ చౌర్యం అవుతోంది? వంటి కీలక సమాచారం దొరుకుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటికి మీటర్లు బిగిస్తే వీటి పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ గణాంకాలు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వ్యవసాయానికి ఏ మేరకు విద్యుత్ సరఫరా అవుతుందో, ఆ మేరకు విద్యుత్ రాయితీలను రా>ష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడానికి ఈ లెక్కలు ఉపయోగపడనున్నాయి. పూర్తి స్థాయిలో సబ్సిడీలు వస్తే డిస్కంలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి రూ.1,600 కోట్ల వ్యయం కానుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఒక్కో మీటర్‌కు రూ.2 వేలు వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. మీటర్ల ఖర్చులో కొంత భాగాన్ని కేంద్రం భరించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment