pumpset
-
పంపుసెట్లకు మీటర్లపై కేంద్రం యూటర్న్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలన్న షరతుల విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. వ్యవసాయ మీటర్లకు కాకుండా దశల వారీగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు (డీటీ) అన్నింటికీ మీటర్లు బిగించాలని తాజాగా స్పష్టం చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడంపై తెలంగాణ సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిం చాయి. దీంతో ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందని ట్రాన్స్‌కో ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ తదితర అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తం 1.6 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 25 లక్షలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు లేకపోవడంతో వీటికి సరఫరా చేస్తున్న విద్యుత్‌కు స్పష్టమైన లెక్కలు లేవు. రాష్ట్రానికి సరఫరా చేస్తున్న మొత్తం విద్యుత్‌లో 32–35 శాతం వరకు వ్యవసాయానికి సరఫరా అవుతోందని రాష్ట్ర విద్యుత్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.5,940 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా కోసం రూ.4,060 కోట్లు కలిపి డిస్కంలకు రూ.10 వేల కోట్ల సబ్సిడీలను ప్రస్తుత ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రైవేటీకరణ దిశగా.. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన కేంద్రం.. సంబంధిత విద్యుత్ సవరణ బిల్లు–2021ను ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తే వ్యవసాయం సహా ప్రతి వినియోగదారుడు వాడే విద్యుత్‌కు కచ్చితమైన లెక్కలు తీసి సంబంధిత ప్రభుత్వ డిస్కంలు/ ప్రైవేటు కంపెనీలు బిల్లులు జారీ చేయాల్సి ఉంటుంది. కరోనా ఉద్దీపన ప్యాకేజీ కింద ప్రకటించిన ఆత్మ నిర్భర్ రుణాలకు అర్హత సాధించాలంటే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని అప్పట్లో కేంద్రం షరతులు విధించింది. తెలంగాణ డిస్కంలకు రూ.12,600 కోట్ల రుణాల్లో తొలి విడతగా రూ.6,300 కోట్లను గతేడాది జూలైలో విడుదల చేయగా, రెండో విడతగా చెల్లించాల్సిన రూ.6,300 కోట్ల రుణాలను ఈ షరతులకు అంగీకరించకపోవడంతో కేంద్రం నిలుపుదల చేసింది. తాజాగా కేంద్రం వెనక్కి తగ్గి వ్యవసాయ కనెక్షన్లకు బదులు రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించాలని స్పష్టతనిచ్చింది. దీంతో త్వరలో రాష్ట్ర డిస్కంలకు రావాల్సిన రెండో విడత రుణాలు విడుదల కావొచ్చని ట్రాన్స్‌కో అధికారవర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. సీఎం పరిశీలనలో ప్రతిపాదనలు.. రాష్ట్రంలో 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కేంద్రం సూచన మేరకు వీటికి మీటర్లు బిగించే ప్రతిపాదనలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్నాయి. త్వరలో వీటిపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దశల వారీగా ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలు సానుకూలతతో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగిస్తే దారి పరిధిలోని వినియోగదారులు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్‌కు సంబంధించిన గణాంకాలు లభిస్తాయి. ఏ ట్రాన్స్ఫార్మర్ పరిధిలో ఎంత విద్యుత్ సరఫరా అవుతోంది? అందులో ఎంత మేర విద్యుత్‌కు బిల్లింగ్ జరుగుతోంది? ఎంత మేరకు విద్యుత్ నష్టం/ చౌర్యం అవుతోంది? వంటి కీలక సమాచారం దొరుకుతుంది. రాష్ట్రంలో దాదాపు అన్ని వ్యవసాయ కనెక్షన్లకు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటికి మీటర్లు బిగిస్తే వీటి పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు వినియోగిస్తున్న మొత్తం విద్యుత్ గణాంకాలు తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వ్యవసాయానికి ఏ మేరకు విద్యుత్ సరఫరా అవుతుందో, ఆ మేరకు విద్యుత్ రాయితీలను రా>ష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడానికి ఈ లెక్కలు ఉపయోగపడనున్నాయి. పూర్తి స్థాయిలో సబ్సిడీలు వస్తే డిస్కంలు నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోని 7.9 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించడానికి రూ.1,600 కోట్ల వ్యయం కానుందని ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఒక్కో మీటర్‌కు రూ.2 వేలు వ్యయం కానుందని అధికారులు పేర్కొంటున్నారు. మీటర్ల ఖర్చులో కొంత భాగాన్ని కేంద్రం భరించే అవకాశాలున్నాయి. -
‘కల్వకుర్తి’ చివరి పంపు రెడీ
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–3లో ఐదో పంపు వెట్ రన్ విజయవంతమైంది. లిఫ్ట్–3లో ఇప్పటికే నాలుగు పంపులు పని చేస్తుండగా, ఐదో పంప్ వెట్ రన్‌ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు లిఫ్టులున్నాయి. లిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు. లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది. కానీ, ఐదో పంపు సిద్ధం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటి ఎత్తిపోత జరగడం లేదు. ఇప్పుడు ఐదో పంపు రన్ విజయవంతమైనందున పూర్తిగా నీటిని వినియోగించుకోవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింది 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సుమారు 500 చెరువులను నింపాలని అధికారులు ప్రణాళిక రచించారు. లిఫ్ట్–3 ఐదో పంపు రన్ విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. -
తొమ్మిది గంటలే !
మోర్తాడ్/బాల్కొండ : కాకతీయ కాలువకు ఇరువైపులా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన ఫీడర్లకు 24 గంటలకు బదులు తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేయా లని ఎన్పీడీసీఎల్ అధికారులు నిర్ణయించారు. భారీ నీటిపారుదల శాఖ అధికారులు, విద్యుత్ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు రెండు రోజుల నుంచి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు పగటి పూట తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్ అందిస్తున్నారు. రబీ సీజను కోసం శ్రీరాంసాగర్ ప్రాజె క్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు నీటి సరఫరా కొనసాగుతోంది. అయితే కాకతీయ కాలువ పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీటిని అందించుకోవడానికి రైతులు కాలువకు పంపుసెట్లను అమర్చుకున్నారు. గతంలో షిఫ్టింగ్ విధానంలో వ్యవసాయానికి రోజు తొమ్మిది గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసేవారు. అలాంటి సమయంలో విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కాకతీయ కాలువ నుంచి రైతులు నీటిని పంట పొలాలకు తరలించేవారు. ఇప్పుడు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా కొనసాగుతుండటంతో పంపుసెట్లు నిరంతరం పని చేస్తున్నాయి. కాలువకు దగ్గర ఉన్న పంట పొలాలకే కాకుండా దూరంగా ఉన్న పంట పొలాలకు కూడా పైప్‌లైన్‌ను వేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దీంతో ఎక్కువ నీరు స్థానికంగానే వినియోగం అవుతోంది. ఇటీవల నాలుగు టీఎంసీల నీటిని కాకతీయ కాలువ ద్వారా విడుదల చేస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఒక్కటే టీఎంసీ నీరు చేరినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీరు చేరే సరికి పరిమాణం తగ్గిపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం కాకతీయ కాలువపై కొందరు రైతులు పంపుసెట్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా నీటిని సరఫరా చేసుకోవడమే కారణం అని గుర్తించిన అధికారులు 24 గంటల విద్యుత్‌కు బ్రేక్ వేయాలని భావించారు. కాలువ వెంట రైతులు ఏర్పాటు చేసుకున్న పంపుసెట్లను తొలగిస్తే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. పంపుసెట్లను తొలగించడం కంటే విద్యుత్ సరఫరాను నియంత్రించడమే మేలు అని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. విద్యుత్ అధికారులతో చర్చించారు. జిల్లాలోని మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతాంగం కాకతీయ కాలువపై జీవీసీ–1 పరిధిలో సుమారు 2300 పంపుసెట్లను ఏర్పాటు చేసుకుని రైతులు నీటిని సరఫరా చేసుకుంటున్నారు. దాదాపు 20 విద్యుత్ ఫీడర్ల నుం చి విద్యుత్ సరఫరా అవుతోంది.ఈ ఫీడర్ల ద్వారా సరఫరా అయ్యే విద్యుత్‌ను అధికారులు కుదించారు. ప్రస్తుత యాసంగిలో కాకతీయ ద్వార ఎల్ఎండీ వర కు 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని అధి కారులు ప్రకటించారు. కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగిన అన్ని రోజుల పాటు తొమ్మిది గంటలు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేయనున్నారు. రైతులు అంగీకారం తెలపడం విశేషం. పంపు సెట్లు ఎందుకు... కాకతీయ కాలువకు పంపు సెట్లను అమర్చుకునే అవకాశం రైతులకు ఎందుకు ఇచ్చారంటే... కాలువ నిర్మాణంలో ఆయా గ్రామాలకు చెందిన చెరువులు రెండు వైపులా చీలి పోయాయి. దీంతో ఆయకట్టుకు నీటి వనరుల సౌకర్యం లేకుండా పోయింది. అంతే కాకుం డా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి లిప్టులను నిర్మిస్తుంది. ఇక్కడ ఎలాంటి లిప్టులు అవసరం లేకుండానే రైతులు స్వచ్ఛందంగా పంపు సెట్లు నిర్మించుకుని ఆయకట్టుకు నీటి సరఫరా చేసుకుంటున్నారు. పంపు సెట్లకు నిరంతరం నీటి సరఫరా కోసం కాకతీయ కాలువ ద్వార నిరంతరం లీకేజీ నీటి సరఫరా చేయాలని గతంలో ప్రత్యేక జీవో కోసం రైతులు ధర్నాలు చేశారు. అప్పటి పాలకులు ప్రత్యేక కృషి చేశారు. 50 క్యూసెక్కుల నీరు నిరంతరం నీటి సరఫరా చేయడానికి జీవో కూడ జారీ అయినట్లు అప్పటి పాలకులు ప్రచారం సైతం చేశారు. అధికారుల ఆదేశాల మేరకే .. కాకతీయ కాలువ వెంట ఉన్న ఫీడర్లకు రోజుకు తొమ్మిది గంటల పాటు మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. అధికారుల ఆదేశాలను పాటించి విద్యుత్ సరఫరా కుదించాం. రైతులు కూడా సహకరిస్తున్నారు. – బాబా శ్రీనివాస్, ఏఈ, ఎన్పీడీసీఎల్ ఏర్గట్ల సెక్షన్ -
తాగునీటి కోసం ఆందోళన
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: తాగునీటి కోసం మహిళలు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటన శుక్రవారం జరిగింది. చోళవరం యూనియాన్‌లోని ఆరణి నగర పంచాయతీ ఉంది. పంచాయతీ పరిధిలోని 3వ వార్డు పెరుమాళ్ కుప్పంలో 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రత్యేక పంపుసెట్ లేదు. అందువల్ల ఆరణి మోటార్ నుంచే నేరుగా పైపులైన్ ద్యారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. అయితే నెల రోజుల నుంచి ఈ గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఈవోకి గ్రామస్తులు విన్నవించారు. కానీ స్పందన లేదు. మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా నీళ్లు సరఫరా చేయాలని గ్రామస్తు లు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగ్రహించిన మహిళలు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆరణి నగర పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్యారం వద్ద బైఠాయించారు. నెల రోజులు నుంచి తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉదయం 10.45 గంటల నుంచి రెండు గంటలపాటు ధర్నా చేసివా ఈవో సంఘటన స్థలానికి రాలేదు. కార్యాలయంలో ఉన్న పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశన్‌తో గ్రామ మహిళలు వాగ్వివాదానికి దిగా రు.విషయం తెలుసుకున్న ఆరణి ఎస్ఐలు సుబ్రమణి, పరంధామన్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. పోలీసుల ఫోన్‌తో వచ్చిన ఈవో ఈ రోజు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. గ్రామస్తులు రెండురోజుల్లో నీరు ఇవ్వక పోతే పెరియపాలెం రోడ్డుపై ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.