తాగునీటి కోసం ఆందోళన
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: తాగునీటి కోసం మహిళలు నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన సంఘటన శుక్రవారం జరిగింది. చోళవరం యూనియాన్‌లోని ఆరణి నగర పంచాయతీ ఉంది. పంచాయతీ పరిధిలోని 3వ వార్డు పెరుమాళ్ కుప్పంలో 200 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రత్యేక పంపుసెట్ లేదు. అందువల్ల ఆరణి మోటార్ నుంచే నేరుగా పైపులైన్ ద్యారా తాగునీటి సరఫరా చేస్తున్నారు. అయితే నెల రోజుల నుంచి ఈ గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. పంచాయతీ ఈవోకి గ్రామస్తులు విన్నవించారు.
కానీ స్పందన లేదు. మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలో తిరునాళ్ల సందర్భంగా నీళ్లు సరఫరా చేయాలని గ్రామస్తు లు అధికారులకు ముందుగా విజ్ఞప్తి చేశారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగ్రహించిన మహిళలు శుక్రవారం ఉదయం ఖాళీ బిందెలతో ఆరణి నగర పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్యారం వద్ద బైఠాయించారు. నెల రోజులు నుంచి తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఉదయం 10.45 గంటల నుంచి రెండు గంటలపాటు ధర్నా చేసివా ఈవో సంఘటన స్థలానికి రాలేదు.
కార్యాలయంలో ఉన్న పంచాయతీ అధ్యక్షుడు వెంకటేశన్‌తో గ్రామ మహిళలు వాగ్వివాదానికి దిగా రు.విషయం తెలుసుకున్న ఆరణి ఎస్‌ఐలు సుబ్రమణి, పరంధామన్ వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. పోలీసుల ఫోన్‌తో వచ్చిన ఈవో ఈ రోజు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చాడు. గ్రామస్తులు రెండురోజుల్లో నీరు ఇవ్వక పోతే పెరియపాలెం రోడ్డుపై ధర్నా చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.