సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–3లో ఐదో పంపు వెట్ రన్ విజయవంతమైంది. లిఫ్ట్–3లో ఇప్పటికే నాలుగు పంపులు పని చేస్తుండగా, ఐదో పంప్ వెట్ రన్‌ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు లిఫ్టులున్నాయి. లిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్‌లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు.
లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది. కానీ, ఐదో పంపు సిద్ధం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటి ఎత్తిపోత జరగడం లేదు. ఇప్పుడు ఐదో పంపు రన్ విజయవంతమైనందున పూర్తిగా నీటిని వినియోగించుకోవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింది 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సుమారు 500 చెరువులను నింపాలని అధికారులు ప్రణాళిక రచించారు. లిఫ్ట్–3 ఐదో పంపు రన్ విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment