Minister Harish Raob
-
‘కల్వకుర్తి’ చివరి పంపు రెడీ
సాక్షి, హైదరాబాద్: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్–3లో ఐదో పంపు వెట్ రన్ విజయవంతమైంది. లిఫ్ట్–3లో ఇప్పటికే నాలుగు పంపులు పని చేస్తుండగా, ఐదో పంప్ వెట్ రన్‌ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం పూర్తి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో మూడు లిఫ్టులున్నాయి. లిఫ్ట్–1, లిఫ్ట్–2లో మూడేసి చొప్పున పంపులు ఇప్పటికే పని చేస్తున్నాయి. ఒక్కో పంపు 800 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయగలదు. కల్వకుర్తి కింది 0.35 టీఎంసీల సామర్థ్యం గల ఎల్లూరు రిజర్వాయర్, 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్లను లిఫ్ట్–1 పంపులతో నింపుతున్నారు. లిఫ్ట్–2 ద్వారా 2.14 టీఎంసీల సామర్థ్యమున్న జొన్నల బోగడ రిజర్వాయర్ నిండుతోంది. ఇక లిఫ్ట్–3 ద్వారా 0.98 టీఎంసీల గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నిండుతోంది. కానీ, ఐదో పంపు సిద్ధం కాకపోవడం వల్ల పూర్తి సామర్థ్యం మేరకు నీటి ఎత్తిపోత జరగడం లేదు. ఇప్పుడు ఐదో పంపు రన్ విజయవంతమైనందున పూర్తిగా నీటిని వినియోగించుకోవచ్చు. వర్షాలు బాగా కురుస్తుండటంతో శ్రీశైలం నుంచి అవసరమైన మేర నీరు తీసుకునే అవకాశం ఏర్పడింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింది 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు ప్రాజెక్టు పరిధిలోని సుమారు 500 చెరువులను నింపాలని అధికారులు ప్రణాళిక రచించారు. లిఫ్ట్–3 ఐదో పంపు రన్ విజయవంతంగా నిర్వహించిన ఇంజనీర్లను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. -
‘మిషన్’ చిలక్కొట్టుడుపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పనుల్లో అవినీతి, నాణ్యత లోపం, అధికారుల అలసత్వం గురించి ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘చెరువు పనుల్లో చిలక్కొట్టుడు’కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పత్రికలో ప్రచురించిన అన్ని అంశాలపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో సమగ్ర విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మైనర్ ఇరిగేషన్ విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్లు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ వెల్లడించారు. మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నాణ్యత పరిశీలనకు పటిష్ట యంత్రాంగాన్ని నియమించామని తెలిపారు. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించడం లేదని, అవినీతి, బాధ్యతా రాహిత్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. గతంలోనే విధుల్లో అలసత్వం, అవకతవకలకు పాల్పడిన ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని స్పష్టం చేశారు. రూ. 350 కోట్లు విడుదల.. మిషన్ కాకతీయ పథకం పనులకు సంబంధించి భారీగా పేరుకుపోయిన బిల్లులకు ప్రభుత్వం ఎట్టకేలకు మోక్షం కలిగించింది. రూ.350 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.220 కోట్లతో రూ.20 లక్షలకన్నా తక్కువగా ఉన్న 4వేల చెరువుల బిల్లుల చెల్లింపు ప్రక్రియను అధికారులు ఆదివారం నుంచే ప్రారంభించారు. మిగతా చెరువుల బిల్లులు సైతం త్వరలోనే చెల్లిస్తామని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
దేవాదులకు మరో రూ.170కోట్లు
పీఎంకేఎస్‌వై కింద విడుదల చేసిన కేంద్రం ఫలించిన మంత్రి హరీశ్‌రావు చొరవ సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మూడు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.226.67 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఇందులో చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు రూ.170 కోట్లు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి రూ.54 కోట్లు, మత్తడి వాగు ప్రాజెక్టుకు రూ.2.67 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సాయంతో దేవాదులకు కేంద్రం చేసిన సాయం రూ.1,787.14కోట్లకు చేరగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏకంగా రూ.647కోట్లు విడుదల కావడం గమనార్హం. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 15,720.42 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.9,306.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించారు. 2016 మొదట్లో హరీశ్ రావుని పీఎంకేఎస్‌వై కమిటీలో సభ్యుడిగా చేర్చడంతో నిధుల వేట పుంజుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర సాయం కింద రూ.1,108 కోట్లు, నాబార్డ్ రుణం ద్వారా రూ.7,955 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016-17లోనే కేంద్ర సాయం కింద రూ.1,108కోట్ల మేర ఇస్తామని తెలుపగా, అందులో తొలి విడతగా రూ.226.67కోట్లు విడుదల చేసింది. దేవాదులకు బ్రహ్మరథం.. గోదావరి జలాలను వినియోగించుకుంటూ 2.48 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని ఇచ్చేందుకు నిర్ణయించిన దేవాదుల ప్రాజెక్టును 2006లో ఏఐబీపీలో చేర్చారు. దీని తొలి అంచనా రూ.6,016కోట్లు కాగా, 2009-10లో రూ.9,427 కోట్లకు సవరిం చారు. అనంతరం 20శాతం ఎస్కలేషన్‌ను కలిపి రూ.9,840.85కోట్లుగా వ్యయాన్ని తేల్చారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25, 75 నిష్పత్తిన భరించాలి. ఈ మొత్తం వ్యయంలో కేంద్ర సాయం రూ.2,460.02 కోట్లు అందాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1,787.14కోట్ల సాయం అందింది. ఇందులో తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు 8 ఏళ్లలో రూ.1,139.26 కోట్లు విడుదల కాగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.647.88 కోట్లు విడుదలయ్యాయి. ఇక పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడైన ఈ ఏడాదిలోనే ఏకంగా రూ.470.50 కోట్లు విడుదలయ్యాయి. దేవాదుల ప్రాజెక్టు కోసం మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇప్పటివరకు 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా భూమిని సేకరించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది పూర్తవగానే పూర్తి నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. కాగా ప్రాజెక్టులకు కేంద్ర నిధుల విడుదలపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్ర మంత్రి ఉమాభారతికి కృతజ్ఞతలు తెలిపారు.