సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పనుల్లో అవినీతి, నాణ్యత లోపం, అధికారుల అలసత్వం గురించి ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘చెరువు పనుల్లో చిలక్కొట్టుడు’కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పత్రికలో ప్రచురించిన అన్ని అంశాలపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో సమగ్ర విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మైనర్ ఇరిగేషన్ విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్లు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ వెల్లడించారు.
మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నాణ్యత పరిశీలనకు పటిష్ట యంత్రాంగాన్ని నియమించామని తెలిపారు. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించడం లేదని, అవినీతి, బాధ్యతా రాహిత్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. గతంలోనే విధుల్లో అలసత్వం, అవకతవకలకు పాల్పడిన ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని స్పష్టం చేశారు.
రూ. 350 కోట్లు విడుదల..
మిషన్ కాకతీయ పథకం పనులకు సంబంధించి భారీగా పేరుకుపోయిన బిల్లులకు ప్రభుత్వం ఎట్టకేలకు మోక్షం కలిగించింది. రూ.350 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.220 కోట్లతో రూ.20 లక్షలకన్నా తక్కువగా ఉన్న 4వేల చెరువుల బిల్లుల చెల్లింపు ప్రక్రియను అధికారులు ఆదివారం నుంచే ప్రారంభించారు. మిగతా చెరువుల బిల్లులు సైతం త్వరలోనే చెల్లిస్తామని నీటి పారుదల వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment