మట్టి దోపిడీ.. రూ.500 కోట్లు
చెరువుల్లో గోతులు తవ్వి అమ్ముకున్నారు
తవ్విన మట్టికి {పభుత్వ డబ్బు కాజేశారు
చెరువుకు కనీసంగా రూ.40 లక్షలు స్వాహా
నీరు-చెట్టు పథకంలో లెక్కలేని అవినీతి
చెరువుల్లో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. కూలీల ద్వారా మట్టి తీయించామంటూ బిల్లులు చేసుకొని కోట్లు గడించారు. అటు ప్రభుత్వ ధనం దోపిడీ చేయడంతో పాటు వ్యాపారులు, పరిశ్రమలకు అమ్ముకోగా వచ్చిన డబ్బును దాచుకున్నారు. ఒక్క ఏడాదిలో గ్రామ స్థాయి చోటా కాంట్రాక్టర్లు కోట్లు గడించారు. ఇదంతా ప్రభుత్వం గ్రామాల్లోని కార్యకర్తలకు దోచిపెట్టింది.
విజయవాడ : నీరు-చెట్టు కార్యక్రమంలో కూలీల ద్వారా తవ్వించిన మట్టిని నిబంధనల ప్రకారం ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి. లేదా రైతుల్లో అడిగిన వారికి ఇవ్వాలి. చెరువుల్లోని ఒండ్రు మట్టిని రైతుల పొలాల్లోకి తోలుకునేందుకు కొంతమేరకు అనుమతులు ఉన్నాయి. అయితే ఆ పనులు వారే చేసుకోవాలి. ఇవన్నీ నీరు-చెట్టులో జరగలేదు. కంచికచర్ల మండలం గండేపల్లి సుబ్బరాజు చెరువులో జరిగిన అవినీతిని పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఈ చెరువులో మట్టి తవ్వినందుకు రూ.44.14 లక్షలు ప్రభుత్వం బిల్లుల రూపంలో ఇచ్చింది. టీడీపీ నాయకులు అమ్ముకున్న మట్టికి సుమారు రూ.50 లక్షలు వచ్చింది. ఇలా లెక్క వేస్తే పనులు జరిగిన 650 చెరువుల్లో సుమారు రూ.500 కోట్లు దోచేశారని ఆరోపణలు వస్తున్నాయి.
మంత్రి మండలంలో దోపిడీ...
గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కంచికచర్ల మండలం గండేపల్లి సుబ్బరాజు చెరువులో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమాన్ని పరిశీలిస్తే కాంట్రాక్టర్లు ఎలా దోచుకున్నారో అర్థమవుతుంది. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సొంత మండలం కంచికచర్ల కావడం గమనార్హం. కాంట్రాక్టర్ మందడపు వెంకటకృష్ణ అలియాస్ రాఘవయ్య గత ఏడాది ఏప్రిల్ 18 నుంచి 22 వరకు చేపల చెరువులకు, మే 4 నుంచి 9 వరకు సెంటినీ కంపెనీకి, ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు కీసరలోని గ్రానైట్ క్వారీల గుంతలు పూడ్చేందుకు మట్టిని తోలారు. ఇందుకు ప్రత్యేకంగా డబ్బులు తీసుకున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 వంతున వసూలు చేశారు. మట్టిని తీసేందుకు జేసీబీ, పొక్లెయిన్లు ఉపయోగించారు. ఈ చెరువు మట్టిని తవ్వేందుకు గ్రామసభ నిర్వహించలేదు. మొదట కావడం వల్ల క్యూబిక్ మీటరుకు రూ.29 వంతున రూ.44.14 లక్షలు మట్టిని తోలినందుకు బిల్లులు ప్రభుత్వం చెల్లించింది. ప్రభుత్వ ధనంతో పాటు మట్టిని ప్రైవేట్ వారికి అమ్ముకున్న డబ్బు కలిపి సుమారు కోటి రూపాయలు పైగా వసూలైనట్లు తెలుస్తోంది. ఈ చెరువు 67.97 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు కింద ఆయకట్టు 72.65 ఎకరాలు ఉంది. ప్రభుత్వ మెమో 10444/సీఏపీ/2014 (31-3-2015) ప్రకారం వంద ఎకరాల కంటే తక్కువ ఆయకట్టు చెరువు అయితే ఎన్‌ఆర్‌ఈజీఎస్ పద్ధతుల్లో పనులు చేపట్టాలి. జేసీబీలు, పొక్లెయిన్లు పెట్టి చేశారు. ఈ చెరువులో జరిగిన అవినీతి వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో తహసీల్దార్‌కు, కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు.
650 చెరువుల్లో దోచుకున్నారు...
జిల్లాలో 924 చెరువులు ఉన్నాయి. వీటిలో 235 మైనర్ చెరువులు. గత వేసవి నుంచి ఇప్పటివరకు 650 చెరువులను నీరు-చెట్టు కింద పూడిక తీసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రూ.5 కోట్ల నిధులను కలెక్టర్ వద్ద ఉంచారు. పశ్చిమకృష్ణాలోని కట్టలేరు ఆయకట్టు పరిధిలో 239 చెరువులు, బుడమేరు పరిధిలో 356, తమ్మిలేరు, రామిలేరు పరిధిలో 180 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో మట్టి తవ్వకాలు, మట్టి అక్రమ విక్రయాల ద్వారా సుమారు రూ.500 కోట్లు టీడీపీ చోటా కాంట్రాక్టర్లు, నాయకులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అంతులేని మట్టి వ్యాపారం... : క్యూబిక్ మీటరు మట్టి తవ్వినందుకు పొక్లెయిన్‌కు గతంలో రూ.29 ఉండగా ఇప్పుడది రూ.34కు చేరింది. చెరువుల నుంచి మట్టిని తరలిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ట్రాక్టర్ మట్టిని రూ.300 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు. నీరు-చెట్టు పథకం పేరు చెప్పి మట్టి వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు.
అనుమతులు లేవు... : మచిలీపట్నం నియోజకవర్గంలో రుద్రవరం, చిన్నాపురం, వెంకట దుర్గాంబపురం, తుమ్మలపాలెం, పల్లె తుమ్మలపాలెం, బుద్దాలపాలెం పంచాయతీల్లో నీరు-చెట్టు కింద చెరువు పూడికతీత పనులు జరిగాయి. అంచనాలు రూపొందించకుండా, అనుమతులు లేకుండా పనులు చేయటం గమనార్హం. జిల్లాలోని అధికార పార్టీ కీలక ప్రజాప్రతినిధి, మరో టీడీపీ నేత కనుసన్నల్లో ఈ వ్యవహారం మొత్తం నడిచింది.
లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి అవుట్
మైలవరంలోని చంద్రాల చెరువులో 83 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారు. టీడీపీకి చెందిన నాయకులు ఒక ట్రాక్టర్ మట్టిని రూ.500 చొప్పున ఇటుక బట్టీలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకున్నారు. చెరువులో నుంచి తీసిన మట్టిని పొలాలకు మళ్లిం చాల్సి ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. చంద్రగూడెం చెరువు, వెల్వడం, పొందుగల ఎర్ర చెరువుల నుంచి భారీ స్థాయిలో మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు.
చల్లపల్లి ఎంపీపీ యార్లగడ్డ సోమశేఖరప్రసాద్ (లంకబాబు), వైస్ ఎంపీపీ బోలెం నాగమణిల మధ్య లక్ష్మీపురం పంచాయతీలో చెరువు పూడికతీత పనుల విషయంలో విభేదాలు వచ్చాయి. ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎంపీడీవో కార్యాలయం వద్ద దుర్భాషలాడుకున్నారు. వివాదం ముదరటంతో టీడీపీ నాయకులు సర్ది చెప్పారు. దీంతో లక్ష్మీపురం చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.300 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలోనూ మట్టి విక్రయాలు తీవ్రస్థాయిలో జరిగాయి. ఇక్కడ మంత్రి అనుచరులు, స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు అక్రమ మట్టి వ్యాపారంలో భాగస్వాములయ్యారు.