mission kakatiya project
-
సాధారణ ఎన్నికలకు ముందే ‘మిషన్’
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పనులన్నింటినీ వచ్చే సాధారణ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద ఎకరాలకు మించి ఆయకట్టు ఉన్న సుమారు 30 వేల చెరువులను వచ్చే జనవరికల్లా పూర్తి చేసి గరిష్ట ఆయకట్టుకు నీరిచ్చేలా ప్రణాళిక వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువులకుగాను ఇప్పటికే దాదాపు 18 వేల చెరువుల్లో పూడికతీత పూర్తి అయింది. 17,859 చెరువుల్లో ముగిసిన పనులు గోదావరి, కృష్ణా బేసిన్లో చిన్న నీటివనరుల కింద ఉన్న 265 టీఎంసీలను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా 46,531 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు నాలుగు విడతలుగా 28,645 చెరువుల పునరుద్ధరణకు అనుమతులు లభించాయి. అన్ని విడతల్లో కలిపి 17,859 చెరువుల్లో పనులు పూర్తయ్యాయి. మరో 6,203 చెరువుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ పనులను సెప్టెంబర్‌కల్లా పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఇటీవల అధికారులను ఆదేశించారు. నాలుగో విడతలో మొత్తంగా 5,541 చెరువులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 3,437 చెరువుల్లో పూడికతీత పూర్తయింది. మిగిలిన చెరువుల్లో పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నాలుగు విడతలు కాకుండా మిగిలిన చెరువులన్నీ తక్కువ ఆయకట్టు ఉన్నవే. ఇందులోనూ ఏవైనా ప్రధానమైనవి ఉంటే వాటిని ఐదో విడత కింద సెప్టెంబర్‌లో జనవరికల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 వేల చెరువుల్లో పనులను ఎన్నికలకు ముందే పూర్తి చేసి వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనుకుంటున్నట్లు నీటిపారుదల వర్గాలు పేర్కొన్నాయి. అన్ని చెరువుల్లోనూ పనులు పూర్తయితే గరిష్టంగా 20–22 లక్షల ఎకరాల సాగు సాధ్యమని చిన్న నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. -
‘మిషన్’ చిలక్కొట్టుడుపై విచారణ
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పనుల్లో అవినీతి, నాణ్యత లోపం, అధికారుల అలసత్వం గురించి ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘చెరువు పనుల్లో చిలక్కొట్టుడు’కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పత్రికలో ప్రచురించిన అన్ని అంశాలపై క్వాలిటీ కంట్రోల్ అధికారులతో సమగ్ర విచారణ జరిపేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మైనర్ ఇరిగేషన్ విభాగం అధికారులకు ఆదేశాలిచ్చారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్లు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ సురేశ్‌కుమార్ వెల్లడించారు. మిషన్ కాకతీయ పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, నాణ్యత పరిశీలనకు పటిష్ట యంత్రాంగాన్ని నియమించామని తెలిపారు. పనుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించడం లేదని, అవినీతి, బాధ్యతా రాహిత్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. గతంలోనే విధుల్లో అలసత్వం, అవకతవకలకు పాల్పడిన ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని స్పష్టం చేశారు. రూ. 350 కోట్లు విడుదల.. మిషన్ కాకతీయ పథకం పనులకు సంబంధించి భారీగా పేరుకుపోయిన బిల్లులకు ప్రభుత్వం ఎట్టకేలకు మోక్షం కలిగించింది. రూ.350 కోట్ల మేర నిధులు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.220 కోట్లతో రూ.20 లక్షలకన్నా తక్కువగా ఉన్న 4వేల చెరువుల బిల్లుల చెల్లింపు ప్రక్రియను అధికారులు ఆదివారం నుంచే ప్రారంభించారు. మిగతా చెరువుల బిల్లులు సైతం త్వరలోనే చెల్లిస్తామని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
రూ.2 వేల కోట్ల ‘జీఎస్టీ’ ఆదా!
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై జీఎస్టీ పన్ను తగ్గించటంతో రాష్ట్రానికి దాదాపు రూ.2 వేల కోట్లు ఆదా అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 75 శాతం కార్మికులు, లేదా కూలీ పనితో ముడిపడి ఉన్న నిర్మాణ పనులన్నింటికీ జీఎస్టీని 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో.. మిషన్ కాకతీయ చెర్వుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల మట్టి పనులన్నింటికీ ఉపశమనం లభిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ముందుగా వేసుకున్న నష్టంతో పోలిస్తే కనీసం రూ.2,000 కోట్లు ఆదా అవుతుందని లెక్కలేసుకుంటోంది. ముందు నుంచీ ఒత్తిడి.. ప్రజోపయోగ నిర్మాణ పనులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని జీఎస్టీ అమలుకు ముందు నుంచే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. జులై ఒకటిన జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు నిర్మాణ పనులపై 18 శాతం పన్ను విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో ఇతర రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.12,200 కోట్ల మేరకు భారం పడుతుందని సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు కూడా రాశారు. దీంతో ఢిల్లీలో ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. నిర్మాణ పనులౖపై జీఎస్టీని 12 శాతం స్లాబ్‌లో చేర్చింది. అందుకూ ఒప్పుకోని రాష్ట్ర ప్రభుత్వం.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, భగీరథ, గృహ నిర్మాణం, రోడ్డు పనులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మరోమారు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రజోపయోగ పనులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తన వాదన వినిపించిన మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి వల్లే ప్రజోపయోగ పనులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించారని సీఎంకు ఈటల తెలిపారు. తెలంగాణ అభిప్రాయాలను బలంగా వినిపించి పన్ను భారం పడకుండా తగ్గించేందుకు కృషి చేసిన ఈటలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో అభినందనలు తెలిపారు. -
ఆదిలాబాద్‌లో అద్భుత ఫలితాలు: హరీశ్
హైదరాబాద్ : తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం మిషన్ కాకతీయ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ కాకతీయ ఫేజ్-1, ఫేజ్-2పై పనుల తీరు, ఫలితాలపై సమీక్ష చేశారు. డిసెంబర్‌లోగా మిషన్ కాకతీయ-3 ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన... అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మిషన్ కాకతీయతో ఆదిలాబాద్ జిల్లాలో అద్భుత ఫలితాలు వచ్చాయని, లక్ష ఎకరాల అదనంగా సాగు నీరు అందించడం ఓ చరిత్రగా అభివర్ణించారు. అలాగే మిషన్ కాకతీయ ప్రాజెక్ట్ మూడోదశ పనులకు వర్షాభావ ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.