సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై జీఎస్టీ పన్ను తగ్గించటంతో రాష్ట్రానికి దాదాపు రూ.2 వేల కోట్లు ఆదా అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. 75 శాతం కార్మికులు, లేదా కూలీ పనితో ముడిపడి ఉన్న నిర్మాణ పనులన్నింటికీ జీఎస్టీని 5 శాతానికి తగ్గించిన నేపథ్యంలో.. మిషన్ కాకతీయ చెర్వుల పునరుద్ధరణ, మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల మట్టి పనులన్నింటికీ ఉపశమనం లభిస్తుందని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోంది. ముందుగా వేసుకున్న నష్టంతో పోలిస్తే కనీసం రూ.2,000 కోట్లు ఆదా అవుతుందని లెక్కలేసుకుంటోంది.
ముందు నుంచీ ఒత్తిడి..
ప్రజోపయోగ నిర్మాణ పనులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని జీఎస్టీ అమలుకు ముందు నుంచే కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. జులై ఒకటిన జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు నిర్మాణ పనులపై 18 శాతం పన్ను విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో ఇతర రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.12,200 కోట్ల మేరకు భారం పడుతుందని సీఎం కేసీఆర్.. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖలు కూడా రాశారు. దీంతో ఢిల్లీలో ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో.. నిర్మాణ పనులౖపై జీఎస్టీని 12 శాతం స్లాబ్‌లో చేర్చింది. అందుకూ ఒప్పుకోని రాష్ట్ర ప్రభుత్వం.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, భగీరథ, గృహ నిర్మాణం, రోడ్డు పనులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మరోమారు విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలో ప్రజోపయోగ పనులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తూ.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తన వాదన వినిపించిన మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి వల్లే ప్రజోపయోగ పనులపై జీఎస్టీని 5 శాతానికి తగ్గిస్తున్నట్టు జైట్లీ ప్రకటించారని సీఎంకు ఈటల తెలిపారు. తెలంగాణ అభిప్రాయాలను బలంగా వినిపించి పన్ను భారం పడకుండా తగ్గించేందుకు కృషి చేసిన ఈటలను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్‌లో అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment