దేవాదులకు మరో రూ.170కోట్లు | central government Release Another Rs 170 crores to devadula project | Sakshi
Sakshi News home page

దేవాదులకు మరో రూ.170కోట్లు

Published Fri, Dec 9 2016 3:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

దేవాదులకు మరో రూ.170కోట్లు - Sakshi

దేవాదులకు మరో రూ.170కోట్లు

పీఎంకేఎస్‌వై కింద విడుదల చేసిన కేంద్రం
  ఫలించిన మంత్రి హరీశ్‌రావు చొరవ

 
 సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్‌వై) కింద రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన మూడు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.226.67 కోట్లు విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఇందులో చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు రూ.170 కోట్లు, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి రూ.54 కోట్లు, మత్తడి వాగు ప్రాజెక్టుకు రూ.2.67 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సాయంతో దేవాదులకు కేంద్రం చేసిన సాయం రూ.1,787.14కోట్లకు చేరగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏకంగా రూ.647కోట్లు విడుదల కావడం గమనార్హం. పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కొమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ-2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించిన విషయం తెలిసిందే.
 
  ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లు అవసరం ఉండగా.. ఇప్పటికే 15,720.42 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.9,306.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం తెలంగాణ నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు పలుమార్లు కేంద్రాన్ని సంప్రదించారు. 2016 మొదట్లో హరీశ్ రావుని పీఎంకేఎస్‌వై కమిటీలో సభ్యుడిగా చేర్చడంతో నిధుల వేట పుంజుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర సాయం కింద రూ.1,108 కోట్లు, నాబార్డ్ రుణం ద్వారా రూ.7,955 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించింది. ఇందులో 2016-17లోనే కేంద్ర సాయం కింద రూ.1,108కోట్ల మేర ఇస్తామని తెలుపగా, అందులో తొలి విడతగా రూ.226.67కోట్లు విడుదల చేసింది.
 
 దేవాదులకు బ్రహ్మరథం..
 గోదావరి జలాలను వినియోగించుకుంటూ 2.48 హెక్టార్ల ఆయకట్టుకు నీటిని ఇచ్చేందుకు నిర్ణయించిన దేవాదుల ప్రాజెక్టును 2006లో ఏఐబీపీలో చేర్చారు. దీని తొలి అంచనా రూ.6,016కోట్లు కాగా, 2009-10లో రూ.9,427 కోట్లకు సవరిం చారు. అనంతరం 20శాతం ఎస్కలేషన్‌ను కలిపి రూ.9,840.85కోట్లుగా వ్యయాన్ని తేల్చారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25, 75 నిష్పత్తిన భరించాలి. ఈ మొత్తం వ్యయంలో కేంద్ర సాయం రూ.2,460.02 కోట్లు అందాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1,787.14కోట్ల సాయం అందింది. ఇందులో తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు 8 ఏళ్లలో రూ.1,139.26 కోట్లు విడుదల కాగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత రూ.647.88 కోట్లు విడుదలయ్యాయి.
 
 ఇక పీఎంకేఎస్‌వై కమిటీలో మంత్రి హరీశ్‌రావు సభ్యుడైన ఈ ఏడాదిలోనే ఏకంగా రూ.470.50 కోట్లు విడుదలయ్యాయి. దేవాదుల ప్రాజెక్టు కోసం మొత్తంగా 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా, ఇప్పటివరకు 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా భూమిని సేకరించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది పూర్తవగానే పూర్తి నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. కాగా ప్రాజెక్టులకు కేంద్ర నిధుల విడుదలపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్ర మంత్రి ఉమాభారతికి కృతజ్ఞతలు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement