హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్‌కు పోరాటం కొత్త కాదని.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే అంతిమంగా మనకు ముఖ్యమని బీఆర్‌ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ అంశంపై మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన పార్టీ నేతలతో భేటీ జరిపారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్లే చేశారాయన. ‘‘నన్ను, నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు. నీ కన్నా హేమాహేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకుంది’’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
‘‘కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. డ్యాంకు సున్నం వేయాలన్నా కూడా బోర్డు అనుమతి తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలివి లేదు. సీఎం రేవంత్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదు. ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెలియదు. కేంద్రం పెత్తనం వస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మన ప్రభుత్వం ఉండగా ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ అవగాహన లేకే అప్పగింతకు ఒప్పుకున్నారు.
.. బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకోవడం పైనే ఇక మన పోరాటం. నల్గొండలో భారీ బహిరంగ సభతో ఉద్యమం ఉధృతం చేద్దాం’’ అని పిలుపు ఇచ్చారు. 13వ తేదీన నల్గొండ లో కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ‘‘నల్లగొండ సభకు నల్లగొండతో పాటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలి.
.. ఇప్పుడున్న పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడంతో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్లు కేంద్రం ఆధీనంలోకి వెళితే తెలంగాణ నష్టపోతుంది. ప్రజలకు ఈ విషయాన్ని వివరించి చెప్పాలి. కాంగ్రెస్ నేతలకు అవగాహన లేక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా నల్లగొండ లో సభ జరిగి తీరుతుంది అని కేసీఆర్ బీఆర్‌ఎస్ నేతలతో స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై హాట్ కామెంట్స్
ఇక ఈ భేటీలో కేఆర్‌ఎంబీ వివాదంతో పాటు కాంగ్రెస్ ఆరోపణలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్లు చేశారు. ‘‘కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చిన 10 ఏళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్ట్ లు మాకు అప్పగించాలని లేదంటే మేమే నోటిఫై చేస్తామని నన్ను బెదిరించారు. కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో.. నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా.. తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని ఆనాడే చెప్పా.
.. నన్ను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీని కొత్త సీఎం ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు. నీ కంటే హేమా హేమీలనే ఎదుర్కొన్న చరిత్ర మాకున్నది. రాష్ట్రాన్ని పదేళ్లు పదిలంగా కాపాడుకున్నాం. దాన్ని పరాయి వాళ్ల పాలు చేస్తున్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఏనాడూ వెనక్కి పోడు.. ఉడుత బెదిరింపులకు భయపడను. ముందు ముందు ఏందో చూద్దాం...తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment