‘సెస్'లో చేతివాటం! | 'Seslo-handed! | Sakshi
Sakshi News home page

‘సెస్'లో చేతివాటం!

Published Mon, Sep 22 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

‘సెస్'లో చేతివాటం!

‘సెస్'లో చేతివాటం!

సిరిసిల్ల :
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) స్టోర్స్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి స్టోర్‌కు తీసుకొస్తే లంచం ఇస్తేగానీ కొత్తవి ఇవ్వడం లే దు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పొట్టకొచ్చిన పొలా లు తడారిపోతున్నాయి. అసలే ఐదుగంటల కరెంటు... అది కూడా లోవోల్టేజీ.. తరచూ ట్రిప్పింగ్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. సెస్ పరిధిలో నిత్యం ఏడు ట్రాన్స్‌ఫార్మర్ల వరకు కాలిపోతుండగా రిపేరు చేసి ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. కాసులిచ్చిన వారికే మొదటి ప్రాధాన్యం ఇస్తుండడంతో సామాన్య రైతులు అసహనానికి గురవుతున్నారు.
 సిరిసిల్ల డివిజన్‌లోని వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, ఇల్లంతకుంట, సిరిసిల్ల మండలాల్లోని విద్యుత్ వినియోగదారులకు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. లో ఓల్టేజీ, విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, ఉరుపులుమెరుపులతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాలిన 24 గంటల్లో మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా రిపేర్లలో జాప్యంతో  రోజుల తరబడి ట్రాన్స్‌ఫార్మర్లు బిగించలేకపోతున్నారు. హెల్పర్లు రైతుల వద్ద డబ్బులు వసూలు చేసి స్టోర్స్‌లో సిబ్బందికి రూ.2 వేలు ఇస్తూ వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్తున్నారు. ఈ పైరవీ తెలియడం చేయని సామాన్య రైతులు మాత్రం రోజుల తరబడి ట్రాన్స్‌ఫార్మర్ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది ఒక్కో ట్రాక్టర్‌కు రూ.5వేల వరకు వసూలు చేసి జేబులు నింపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 ట్రాన్స్‌ఫార్మర్ తరలింపునకు సైతం హెల్పర్ల చేయి తడపాల్సిందే. సెస్‌లో రెండు వ్యాన్లు ఉండగా, ఇటీవల మరో ట్రాక్టర్ అద్దెకు తీసుకున్నారు. వీటి ద్వారా ఆయా గ్రామాలకు ట్రాన్స్‌ఫార్మర్లు తరలించాల్సి ఉండగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ అద్దె పేరిట రైతుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందంటే దాని పరిధిలోని ఒక్కో రైతుకు రూ.500 వరకు భారం పడుతోంది. డబ్బులివ్వకుంటే ట్రాన్స్‌ఫార్మర్ రావడం ఆలస్యమై పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉండడంతో అసహాయ స్థితిలో అన్నదాతలు డబ్బులిస్తున్నారు.
 కొత్తవి కొనుగోలు చేస్తున్నా..
 సెస్ పరిధిలో 5,800 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా సగటున నిత్యం ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. గత నెలలో 234 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, ఈ నెలలో ఇప్పటివరకే 173 కాలిపోయాయి. రోజుకు ఐదు ట్రాన్స్‌ఫార్మర్లు, మూడు షెడ్లలో రిపేరు చేస్తున్నారు. రిపేరవుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు సరిపోవడం లేదు. ఇటీవల అధికారులు రూ.రెండు కోట్లతో 200 ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలుకు ప్రతిపాదించారు. ఈ మధ్యే 20 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు వచ్చాయి. వచ్చే నెలలో మరో ఇరవై ట్రాన్స్‌ఫార్మర్లు రానున్నాయి. కొత్తవి వస్తున్నా కొరత తీరడం లేదు. నిజానికి 60 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఓవర్‌లోడ్‌తో పని చేస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది సామర్థ్యం మేరకు కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా ఉచిత కరెంటు కావడంతో నియంత్రణ లేకుండా కనెక్షన్లు ఇస్తున్నారు. ఫలితంగా కొత్తవి కొనుగోలు చేస్తున్నా సరిపోవడం లేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement