అత్యధికంగా దక్షిణ డిస్కం పరిధిలో 71,733 కాలిపోయిన వైనం
రెండో అర్ధ వార్షికంలో ఎక్కువగా ఓవర్ లోడ్
సాక్షి, హైదరాబాద్: వంద, వెయ్యి, పది వేలు కాదు.. ఏకంగా లక్షకు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. అదీ ఒక్క ఏడాదిలోనే. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,260 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినట్లు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన వార్షిక (2024–25) ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లో వెల్లడించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 5,58,932 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, అందులో 19 శాతానికి పైగా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఏడాదికి సగటున 50 వేల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయేవి. కానీ గతేడాది ఈ సంఖ్య రెట్టింపు కావడంపై విద్యుత్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ లక్ష ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడమే కాకుండా, వాటి మరమ్మతులకు డిస్కంలు రూ.వందల కోట్లలో ఖర్చు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
నాసిరకం ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లు, పాడైన ట్రాన్స్‌ఫార్మర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయకపోవడం, చిన్న చిన్న లోపాలను గుర్తించి సరి చేయడానికి వీలుగా పీరియాడిక్ మెయింటనెన్స్ నిర్వహించడంలో అధికారుల నిర్లక్ష్యం, లైన్లలో లోపాలు ఏర్పడడం వంటి సమస్యలకు ఓవర్ లోడింగ్ సమస్య జతకావడంతో ట్రాన్స్‌ఫార్మర్లు పటాకుల్లా కాలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
యాసంగి పంటలకు అధిక వినియోగం
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లో గత ఏడాది అత్యధికంగా 71,733 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో మరో 34,527 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 2023 తొలి అర్ధవార్షికం (ఏప్రిల్– సెపె్టంబర్)లో 27,596 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోగా, 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్యకాలంలో ఏకంగా 44,137 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.
వర్షాభావంతో యాసంగి పంటలకు విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పాటు గృహాలు, ఇతర అవసరాలకు సైతం వినియోగం పెరిగి ఓవర్‌లోడ్ పడటంతో రెండో అర్ధ వార్షికంలో అధిక సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లపై కాలిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత డిసెంబర్‌లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికం
నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 10,682 ట్రాన్స్‌ఫార్మర్‌లు దగ్ధం కావడం గమనార్హం. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 7,162, నాగర్‌కర్నూల్ జిల్లాలో 6,234, సిద్దిపేట జిల్లాలో 5,522, సంగారెడ్డి జిల్లాలో 5,160, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,734 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. జంట నగరాల పరిధిలో అత్యధికంగా రాజేందర్‌నగర్ సర్కిల్‌లో 5,076 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22,578, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17,992 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం ఈ రెండు జిల్లాల్లో ఓవర్ లోడ్‌కు, నిర్వహణా లోపాల సమస్యలకు అద్దం పడుతోంది. ఇక టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4,289 ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి.
మరమ్మతులకు భారీగా వ్యయం
గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను, పట్టణ ప్రాంతాల్లో 100/160/315/500 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున మొత్తం ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యానికి బిల్లులు లెక్కించి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే రూ.15–20 వేలు, 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే రూ.లక్ష వరకు డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తోంది.
ట్రాన్స్‌ఫార్మర్‌లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటుతో పాటు ఆయిల్‌ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికం అవుతుంది. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌కు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పీరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పీరియడ్ లేని ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం డిస్కంలే భరించాల్సి ఉంటుంది.
ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడానికి ప్రధాన కారణాలు...
– అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరగడంతో లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.
– ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటినెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వర్షాల్లో లోపలికి నీళ్లు వెళ్లకుండా లీకేజీలను అరికట్టకపోవడం వల్ల కాలిపోతున్నాయి.
– జీవిత కాలం ముగిసిన అధిక శాతం ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి.
– సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment