power transformers
-
ట్రాన్స్ఫార్మర్లు టపటపా!
సాక్షి, హైదరాబాద్: వంద, వెయ్యి, పది వేలు కాదు.. ఏకంగా లక్షకు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అదీ ఒక్క ఏడాదిలోనే. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,260 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్లు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎన్పీడీసీఎల్)లు.. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి తాజాగా సమర్పించిన వార్షిక (2024–25) ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,58,932 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, అందులో 19 శాతానికి పైగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఏడాదికి సగటున 50 వేల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కానీ గతేడాది ఈ సంఖ్య రెట్టింపు కావడంపై విద్యుత్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ లక్ష ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగడమే కాకుండా, వాటి మరమ్మతులకు డిస్కంలు రూ.వందల కోట్లలో ఖర్చు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాసిరకం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లు, పాడైన ట్రాన్స్ఫార్మర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా మరమ్మతులు చేయకపోవడం, చిన్న చిన్న లోపాలను గుర్తించి సరి చేయడానికి వీలుగా పీరియాడిక్ మెయింటనెన్స్ నిర్వహించడంలో అధికారుల నిర్లక్ష్యం, లైన్లలో లోపాలు ఏర్పడడం వంటి సమస్యలకు ఓవర్ లోడింగ్ సమస్య జతకావడంతో ట్రాన్స్ఫార్మర్లు పటాకుల్లా కాలిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాసంగి పంటలకు అధిక వినియోగం టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లో గత ఏడాది అత్యధికంగా 71,733 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్‌లో మరో 34,527 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో 2023 తొలి అర్ధవార్షికం (ఏప్రిల్– సెపె్టంబర్)లో 27,596 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, 2023 అక్టోబర్– 2024 మార్చి మధ్యకాలంలో ఏకంగా 44,137 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. వర్షాభావంతో యాసంగి పంటలకు విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో పాటు గృహాలు, ఇతర అవసరాలకు సైతం వినియోగం పెరిగి ఓవర్‌లోడ్ పడటంతో రెండో అర్ధ వార్షికంలో అధిక సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లపై కాలిపోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ అంతరాయాలపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అత్యధికం నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 10,682 ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడం గమనార్హం. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 7,162, నాగర్‌కర్నూల్ జిల్లాలో 6,234, సిద్దిపేట జిల్లాలో 5,522, సంగారెడ్డి జిల్లాలో 5,160, యాదాద్రి భువనగిరి జిల్లాలో 4,734 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. జంట నగరాల పరిధిలో అత్యధికంగా రాజేందర్‌నగర్ సర్కిల్లో 5,076 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 22,578, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 17,992 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఈ రెండు జిల్లాల్లో ఓవర్ లోడ్‌కు, నిర్వహణా లోపాల సమస్యలకు అద్దం పడుతోంది. ఇక టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 4,289 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. మరమ్మతులకు భారీగా వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 25/63/100 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను, పట్టణ ప్రాంతాల్లో 100/160/315/500 కేవీఏ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మరమ్మతుల కోసం సగటున కేవీఏకు రూ.200 చొప్పున మొత్తం ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యానికి బిల్లులు లెక్కించి కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.15–20 వేలు, 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రూ.లక్ష వరకు డిస్కంలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో కాలిపోయిన వైండింగ్ స్థానంలో కొత్త వైండింగ్ ఏర్పాటుతో పాటు ఆయిల్‌ను ఫిల్టర్ చేసి వేస్తారు. ఒక్కోసారి పూర్తి వైండింగ్ కాలిపోతే ఖర్చు అధికం అవుతుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్కు ఐదేళ్ల వారంటీ ఉంటుండగా, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేసిన తర్వాత ఆరు నెలల గ్యారెంటీ పీరియడ్ ఉంటుంది. గ్యారెంటీ పీరియడ్ లేని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పూర్తి వ్యయం డిస్కంలే భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడానికి ప్రధాన కారణాలు... – అనధికార వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరగడంతో లోడ్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – ట్రాన్స్ఫార్మర్ల మెయింటినెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, వర్షాల్లో లోపలికి నీళ్లు వెళ్లకుండా లీకేజీలను అరికట్టకపోవడం వల్ల కాలిపోతున్నాయి. – జీవిత కాలం ముగిసిన అధిక శాతం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. – సరైన ఎర్తింగ్ లేకపోవడం వల్ల కూడా కాలిపోతున్నాయి. -
భారత్‌లో రూ. 500 కోట్ల పెట్టుబడులు : తోషిబా గ్రూప్
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యెన్లు (సుమారు రూ. 500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తోషిబా గ్రూప్ వెల్లడించింది. పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచుకునేందుకు తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఈ నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. 2024–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టీటీడీఐ చైర్పర్సన్ హిరోషి ఫురుటా తెలిపారు. భారత్‌లో తయారీ, భారత్ నుంచి ఎగుమతుల నినాదానికి అనుగుణంగా చేసే ఈ పెట్టుబడులతో నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోనున్నట్లు వివరించారు. భారత మార్కెట్లో ట్రాన్స్ఫార్మర్ల డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతులను పెంచుకోవడానికి పవర్ ట్రాన్స్ఫార్మర్ల విస్తరణ తోడ్పడగలదని హిరోషి పేర్కొన్నారు. -
AP: కంటైనర్ సబ్స్టేషన్లు వచ్చేస్తున్నాయ్!
తిరుపతి రూరల్: ఏపీ రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్లకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కంటైనర్ సబ్‌స్టేషన్‌ను 5, 8, 10 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వ్యయం అవుతుందని వారు పేర్కొన్నారు. అవసరమైన యంత్ర పరికరాలను సంబంధిత తయారీ సంస్థ ప్లగ్ అండ్ ప్లే విధానంలో కంటైనర్లకు సమకూర్చి పంపిణీ చేస్తోందని తెలిపారు. వీటి నుంచి ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తామని.. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఈ సబ్స్టేషన్లు పనిచేస్తాయని వెల్లడించారు. షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం ఉండదని.. నిర్వహణ మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని తెలిపారు. ఇలాంటి కంటైనర్ సబ్స్టేషన్లు దేశంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో పట్టణ, నగర ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంటైనర్ సబ్స్టేషన్ల ప్రత్యేకతలు.. సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరమైతే, దీనికి 2 సెంట్లు సరిపోతుంది. స్తంభాలు అవసరం లేదు. కంటైనర్ ఉంటే చాలు. సాధారణ సబ్‌స్టేషన్‌కు 3 నెలలకోసారి నిర్వహణ తప్పనిసరి. కానీ ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌కు ఆ అవసరం లేదు. విద్యుత్ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్ కంటే మెరుగ్గా, నిరంతరాయంగా ఉంటుంది. షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం లేకుండానే ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను ఆన్, ఆఫ్ చేయొచ్చు. ఫెన్సింగ్, ప్రహరీ గోడలు వంటివి అవసరం లేదు. సాధారణ సబ్స్టేషన్కంటే మన్నిక ఎక్కువ. -
గోడలపై రాతలు..గ్రామాలకు కాసులు
వ్యాపార సంస్థల ప్రకటనలు గ్రామ సీమలకు ఆదాయ వనరు కాబోతున్నాయి. ఊళ్లల్లోకి వచ్చి గోడలమీద ఎడాపెడా రాసేసి, గీసేసి చెక్కెయాలని చూసే సంస్థలకు పంచాయతీ అధికారులు చెక్ పెట్టబోతున్నారు. ఈ కార్యాచరణలో గృహ యజమానులనూ భాగస్వాములను చేయనున్నారు. తద్వారా పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు చేకూర్చాలని యత్నిస్తున్నారు. ‘గ్రామాల్లో గోడలపై రాతలకు పన్ను’ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. తొలిసారిగా తెనాలి డివిజన్లో చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కొంతలో కొంతైనా ఆర్థిక పరిపుష్టి చేకూరినట్టే. తెనాలిఅర్బన్ : గ్రామ పంచాయతీల ఆదాయం పెంపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభా లపై పన్ను వసూలుకు కసరత్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిపాదనకు తెరతీయనుంది. వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ప్రకటనలు ఇళ్ల గోడలపై వెలుస్తున్న నేపథ్యంలో వాటిపైనా పన్ను వసూలుకు సిద్ధమవుతోంది. తెనాలి డివిజన్లో 349 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల ఆదాయం పెంపునకు చేపల చెరువుల వేలం, పంచాయతీ స్థలాలు లీజుకివ్వటం, ఇంటిపన్ను నూరు శాతం వసూలు వంటి కార్యక్రమాలు చేపట్టిన అధికారులు ఇప్పుడు కొత్త ప్రతిపాదనలకూ శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల్లో ఇళ్ల గోడలు, ఇంటి ప్రహరీ గోడలపైనా వ్యాపార ప్రకటనలు సర్వసాధారణం. సిమెంటు, పురుగుమందులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, వస్త్ర వ్యాపారాలు, సెల్ కంపెనీలు, సెల్ నెట్ వర్కులు తదితర ప్రకటనలూ గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి. ఇలాంటి ప్రకటనలకు కొందరు గృహ యజమానులు ఆయా కంపెనీల నుంచి ఎంతో కొంత తీసుకునే అనుమతిస్తారు. మరి కొందరు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తారు. ఇలాంటి వ్యాపార ప్రకటనలనూ ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రకటనలు ఉన్న గోడలకు చెందిన యజమానులకు ప్రకటన పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నారు. దీనిని కనీసం రూ.300గా నిర్ణయించినట్లు తెలిసింది. ప్రకటనదారుడు పన్నును పంచాయతీకి చెల్లించే విధంగా యజమాని చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రకటనను యజమాని చెరిపివేయాలి. ఈ రెండూ కానిపక్షంలో పంచాయతీ అధికారులే ఆ ప్రకటనలను చెరిపివేయాల్సి వస్తే తారుపూసే ప్రమాదం ఉంది. తిరిగి ఆ గోడలు శుభ్రం కావాలంటే పన్నుకు మించిన భారం గృహ యజమానిపై పడనుంది. ఇదిలా ఉంటే పెద్దపెద్ద ఐరన్ఫ్రేమ్లతో వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేస్తుంటారు. ఆయా సంస్థల నుంచి పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటారు. వీలుకాని పక్షంలో ఆ స్థానంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శనగా ఉంచుతారు. పంచాయతీల ఆదాయం పెంపు కోసమే ... గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను సేకరించే పనిలో ఉన్నాం. అలాగే ఇంటి గోడలు, ప్రహరీ గోడలపై ప్రత్యక్షమయ్యే ప్రకటనలకూ పన్ను వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గృహ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నాం. పన్ను యజమాని చెల్లించవచ్చు. కుదరని పక్షంలో ప్రకటనదారు ద్వారా చెల్లించేందుకైనా చర్యలు తీసుకోవాలి. అలా చేయని పక్షంలో పంచాయతీ సిబ్బంది తారుపూసి ఆ ప్రకటనను కనబడకుండా చేస్తారు. దీనిపై కార్యదర్శులకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. - ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, డివిజనల్ పంచాయతీ అధికారి, తెనాలి.