గోడలపై రాతలు..గ్రామాలకు కాసులు | The government is exploring alternative ways of increasing the income of village panchayats | Sakshi
Sakshi News home page

గోడలపై రాతలు..గ్రామాలకు కాసులు

Published Sun, Sep 7 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

The government is exploring alternative ways of increasing the income of village panchayats

వ్యాపార సంస్థల ప్రకటనలు గ్రామ సీమలకు ఆదాయ వనరు కాబోతున్నాయి. ఊళ్లల్లోకి వచ్చి గోడలమీద ఎడాపెడా రాసేసి, గీసేసి చెక్కెయాలని చూసే సంస్థలకు పంచాయతీ అధికారులు చెక్ పెట్టబోతున్నారు. ఈ కార్యాచరణలో గృహ యజమానులనూ భాగస్వాములను చేయనున్నారు. తద్వారా పంచాయతీలకు ఆర్థిక జవసత్వాలు చేకూర్చాలని యత్నిస్తున్నారు. ‘గ్రామాల్లో గోడలపై రాతలకు పన్ను’ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నారు. తొలిసారిగా తెనాలి డివిజన్‌లో చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు కొంతలో కొంతైనా ఆర్థిక పరిపుష్టి చేకూరినట్టే.
 
 తెనాలిఅర్బన్ : గ్రామ పంచాయతీల ఆదాయం పెంపునకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభా లపై పన్ను వసూలుకు కసరత్తు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రతిపాదనకు తెరతీయనుంది. వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ప్రకటనలు ఇళ్ల గోడలపై వెలుస్తున్న నేపథ్యంలో వాటిపైనా పన్ను వసూలుకు సిద్ధమవుతోంది.
 
  తెనాలి డివిజన్‌లో 349 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల ఆదాయం పెంపునకు చేపల చెరువుల వేలం, పంచాయతీ స్థలాలు లీజుకివ్వటం, ఇంటిపన్ను నూరు శాతం వసూలు వంటి కార్యక్రమాలు చేపట్టిన అధికారులు ఇప్పుడు కొత్త ప్రతిపాదనలకూ శ్రీకారం చుడుతున్నారు.
 
 గ్రామాల్లో ఇళ్ల గోడలు, ఇంటి ప్రహరీ గోడలపైనా వ్యాపార ప్రకటనలు సర్వసాధారణం. సిమెంటు, పురుగుమందులు, సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్, వస్త్ర వ్యాపారాలు, సెల్ కంపెనీలు, సెల్ నెట్ వర్కులు తదితర ప్రకటనలూ గ్రామాల్లో దర్శనమిస్తుంటాయి.
 
  ఇలాంటి ప్రకటనలకు కొందరు గృహ యజమానులు ఆయా కంపెనీల నుంచి ఎంతో కొంత తీసుకునే అనుమతిస్తారు. మరి కొందరు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తారు.
 
 ఇలాంటి వ్యాపార ప్రకటనలనూ ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పంచాయతీ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
 
 ప్రకటనలు ఉన్న గోడలకు చెందిన యజమానులకు ప్రకటన పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేయనున్నారు. దీనిని కనీసం రూ.300గా నిర్ణయించినట్లు తెలిసింది.
 
 ప్రకటనదారుడు పన్నును పంచాయతీకి చెల్లించే విధంగా యజమాని చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రకటనను యజమాని చెరిపివేయాలి. ఈ రెండూ కానిపక్షంలో పంచాయతీ అధికారులే ఆ ప్రకటనలను చెరిపివేయాల్సి వస్తే తారుపూసే ప్రమాదం ఉంది. తిరిగి ఆ గోడలు శుభ్రం కావాలంటే పన్నుకు మించిన భారం గృహ యజమానిపై పడనుంది.
 
 ఇదిలా ఉంటే పెద్దపెద్ద ఐరన్‌ఫ్రేమ్‌లతో వ్యాపార ప్రకటనలు ఏర్పాటు చేస్తుంటారు. ఆయా సంస్థల నుంచి పన్ను వసూలుకు చర్యలు తీసుకుంటారు. వీలుకాని పక్షంలో ఆ స్థానంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శనగా ఉంచుతారు.
 
 పంచాయతీల ఆదాయం పెంపు కోసమే ...
 గ్రామ పంచాయతీల ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సెల్ టవర్లు, విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తదితర వివరాలను సేకరించే పనిలో ఉన్నాం.
 
 అలాగే ఇంటి గోడలు, ప్రహరీ గోడలపై ప్రత్యక్షమయ్యే ప్రకటనలకూ పన్ను వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
 
 గృహ యజమానులకు నోటీసులు జారీ చేయనున్నాం. పన్ను యజమాని చెల్లించవచ్చు. కుదరని పక్షంలో ప్రకటనదారు ద్వారా చెల్లించేందుకైనా చర్యలు తీసుకోవాలి.
 
 అలా చేయని పక్షంలో పంచాయతీ సిబ్బంది తారుపూసి ఆ ప్రకటనను కనబడకుండా చేస్తారు. దీనిపై కార్యదర్శులకు మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి.
 - ఎంవీఎస్ సుబ్రహ్మణ్యం, డివిజనల్ పంచాయతీ అధికారి, తెనాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement