తిరుపతి రూరల్: ఏపీ రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ విద్యుత్ సబ్‌స్టేషన్లకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కంటైనర్ సబ్‌స్టేషన్‌ను 5, 8, 10 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వ్యయం అవుతుందని వారు పేర్కొన్నారు. అవసరమైన యంత్ర పరికరాలను సంబంధిత తయారీ సంస్థ ప్లగ్ అండ్ ప్లే విధానంలో కంటైనర్లకు సమకూర్చి పంపిణీ చేస్తోందని తెలిపారు.
వీటి నుంచి ట్రాన్స్‌ఫార్మర్లకు కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తామని.. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఈ సబ్‌స్టేషన్లు పనిచేస్తాయని వెల్లడించారు. షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం ఉండదని.. నిర్వహణ మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుందని తెలిపారు. ఇలాంటి కంటైనర్ సబ్‌స్టేషన్లు దేశంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో పట్టణ, నగర ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కంటైనర్ సబ్‌స్టేషన్ల ప్రత్యేకతలు..
సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరమైతే, దీనికి 2 సెంట్లు సరిపోతుంది.
స్తంభాలు అవసరం లేదు. కంటైనర్ ఉంటే చాలు.
సాధారణ సబ్‌స్టేషన్‌కు 3 నెలలకోసారి నిర్వహణ తప్పనిసరి. కానీ ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌కు ఆ అవసరం లేదు.
విద్యుత్ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్ కంటే మెరుగ్గా, నిరంతరాయంగా ఉంటుంది.
షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం లేకుండానే ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ఆన్, ఆఫ్ చేయొచ్చు.
ఫెన్సింగ్, ప్రహరీ గోడలు వంటివి అవసరం లేదు.
సాధారణ సబ్‌స్టేషన్‌కంటే మన్నిక ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment