sub stations
-
నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
-
సబ్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని, ఇవాళ ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టింది. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం. 12 సబ్స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం ట్రాన్స్మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’’ సీఎం వివరించారు. ‘‘దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్ పవర్‌కు శ్రీకారం చుడుతున్నాం. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి. 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్పీసీఎల్తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్,విండ్, పీఎస్పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్యరహిత విద్యుత్ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యుత్ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. -
విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా 68 కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం
అమరావతి: విద్యుత్ పంపిణ సంస్థలు పంపిణీ నష్టాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఇపిడిసిఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని, అదే క్రమంలో విద్యుత్ బకాయిల విషయంలోనూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలకు సంబంధించిన పెండింగ్ బకాయిలును వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. అలాగే న్యాయస్థానాల్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఇపిడిసిఎల్ పరిధిలో 33 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పనులు మందకొడిగా జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు సర్కిళ్ళ పరిధిలో సాంకేతికంగా ఎక్కడైతే లో ఓల్టేజీ సమస్య ఉందో పరిశీలించి, అక్కడ మాత్రమే కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాలని సూచించారు. 33 కెవి సబ్ స్టేషన్లు మంజూరు చేసినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కాంట్రాక్ట్ ను రద్దు చేయాలని ఆదేశించారు. కోస్తా ప్రాంతంలో పీక్ లోడ్ పరిస్థితిని చక్కదిద్దేందుకు పరిశ్రమల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాలని కోరారు. జగనన్న హౌసింగ్ కాలనీల్లో విద్యుద్దీకరణ పనులను వేగవంతం చేయాలి. ఎస్పీడిసిఎల్ పరిధిలో వినియోగదారులకు అందిస్తున్న సేవల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేశారని, అదే మాదిరిగా ఇపిడిసిఎల్ లోనూ ఆన్లైన్ లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు వచ్చేలా అవగాహన పెంచాలని, సచివాలయ స్థాయిలో ఎనర్జీ అసిస్టెంట్ ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. విద్యుత్ భద్రతపై సిబ్బందికి శిక్షణ కల్పించాలి. ప్రమాదాల నివారణకు పోల్ టు పోల్ సర్వే చేయాలి. లూజ్ లైన్లను మార్చడంతో పాటు పాడైపోయిన కండక్టర్ లను ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. ఈదరు గాలుల వల్ల విద్యుత్ స్థంబాలు పడిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాల్లో కొన్నిచోట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై అధికారులు యుద్ద ప్రాతిపదికన వాటిని సరిచేయాలని ఆదేశించారు. గోదావరిజిల్లాల్లో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉందని, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణంతో లో ఓల్టేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. అలాగే విశాఖ సర్కిల్ పరిధిలో కొత్తగా జగనన్న కాలనీల్లో లక్ష ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయని, వాటికి అవసరమైన విద్యుత్ ను అందించేందుకు కొత్తగా 68 సబ్ స్టేషన్లను మంజూరు చేశామని, త్వరలోనే వాటికి టెండర్లు పిలుస్తామని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 250 ఎంయుల విద్యుత్ డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తూ, కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యంను మెరుగుపరుచుకుంటే, సబ్ స్టేషన్లు ఏర్పాటు, విద్యుత్ లైన్ల నిర్మాణంను కూడా ప్రణాళికాయుతంగా చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ విజయానంద్, జెన్కో ఎండి కెవిఎన్ చక్రథర్ బాబు, ఇపిడిసిఎల్ సిఎండి పృథ్వితేజ్ తదితరులు హాజరయ్యారు. -
‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా 15 జిల్లాల పరిధిలో విద్యుత్ సేవలు అందిస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సాంకేతికత వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మీటర్ రీడింగ్, కరెంట్ బిల్లుల వసూళ్లు, ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న సంస్థ తాజాగా విద్యుత్ సరఫరాలోని కీలకమైన సబ్స్టేషన్లపై దృష్టి సారించింది. అంతర్గత నిర్వహణ ఖర్చులు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు కొత్తగా ఆటోమేటెడ్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కల్యాణ్‌నగర్, ముఫకంజా, శిల్పారామం, కృష్ణానగర్, నాగోల్‌లలో సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. కొత్త ఏడాదిలో మరిన్ని ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్‌లో నాలుగు నుంచి ఆరుగురు విద్యుత్ సిబ్బంది పనిచేస్తుంటారు. సబ్‌స్టేషన్‌కు అందుతున్న, మిగతా 2వ పేజీలో u దాని నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ తీరును నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఫీడర్ ట్రిప్ అయితే వెంటనే సరిచేస్తుంటారు. అయితే ఒక్కో స్టేసన్‌లోని సిబ్బంది జీతాలన్నీ కలిపి రూ. లక్షల్లో ఉండటం, జీహెచ్ఎంసీ పరిధిలో వందలాది సబ్స్టేషన్లు ఉండటంతో ఈ లెక్కన టీఎస్ఎస్పీడీసీఎల్పై ప్రతి నెలా రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెస్తున్న అన్మ్యాన్డ్ సబ్స్టేషన్లలో సిబ్బంది అవసరం ఉండదు. పూర్తిగా సాఫ్ట్వేర్ సాయంతో ఇవి పనిచేయనున్నాయి. విద్యుత్ సరఫరా రీడింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నమోదు చేసుకోనున్నాయి. అలాగే ఫీడర్ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా వాటంతట అవే పరిష్కరించనున్నాయి. ప్రతి 10–15 సబ్స్టేషన్ల పనితీరును ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పర్యవేక్షిస్తే సరిపోనుంది. దీనివల్ల సంస్థపై ఆర్థికభారంగణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే సాంకేతిక సంస్కరణల బాట... – విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు కాల్‌సెంటర్ నంబర్ 1912 ద్వారా అందే ఫిర్యాదును సంబంధిత సెక్షన్ అధికారికి పంపేందుకు ‘సాసా’ యాప్ వినియోగం. గతంలో కాల్ సెంటర్ ద్వారా ఒకే సమయంలో 30 కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకొనే అవకాశం ఉండగా ప్రస్తుతం ఏకకాలంలో 300 ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం. – 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో విద్యుత్ అంతరాయ పనరుద్ధరణకు కంప్యూటర్ ఆధారిత అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎంఎస్) వాడకం. దీని సాయంతో విద్యుత్ పునరుద్ధరణకు ఎక్కడికి, ఎందరు సిబ్బందిని పంపాలో ముందే గుర్తించే వీలు. – సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ద్వారా వినియోగదారుడే స్వయంగా ఇంట్లోని మీటర్లో నమోదైన రీడింగ్‌ను తీసి బిల్లు పొందే వెసులుబాటు. – జీహెచ్ఎంసీ పరిధిలోని 226 సబ్స్టేషన్లు, 167 ఫీడర్లలో రియల్‌టైమ్‌లో విద్యుత్ గణాంకాల విశ్లేషణకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు రాకపోయినా ఆటోమేటిక్‌గా సరఫరాను పర్యవేక్షించే వీలు. కరెంట్ పోయిన ప్రాంతాల వివరాల గుర్తింపు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం ప్రత్యేకత. జీహెచ్ఎంసీ పరిధికే పరిమితమైన ఈ సేవలను 2023లో గ్రేటర్ శివారు ప్రాంతాలకు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ నిర్ణయం. ఎనిమిదేళ్లలో 34 అవార్డులు.. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఉండేవి. గృహాలకు తొమ్మిది గంటలు, రైతులకు ఆరు గంటలే విద్యుత్ అందేది. ప్రస్తుతం గృహ వినియోగదారులకే కాకుండా వ్యాపారులకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి కొత్తగా వచ్చే సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఫలితంగా ఈ ఎనిమిదేళ్లలో 34 జాతీయ అవార్డులు డిస్కంకు లభించాయి. ఇది గొప్ప అచీవ్మెంట్. – రఘుమారెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
ఏపీలో సబ్స్టేషన్లు సరికొత్తగా..
సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానాలకు ఏపీ డిస్కంలు శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో స్మార్ట్, కంటైనర్, ఇండోర్, ఎయిర్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్స్టేషన్లను నిర్మిస్తున్నాయి. కొన్నిచోట్ల షిష్ట్ ఆపరేటర్లు, సిబ్బంది లేకుండానే ఆన్లైన్లో కంట్రోల్ రూమ్ ద్వారా వాటి నిర్వహణ చేపట్టనున్నాయి. ఇందుకోసం సాధారణంగా వినియోగించే భూమితో పోలిస్తే పది శాతం నుంచి మూడో వంతు భూమిలోనే వీటిని ఏర్పాటుచేస్తున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో.. ఉద్యోగుల అవసరంలేకుండా గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా చేసేలా స్మార్ట్ సబ్స్టేషన్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. విశాఖలోని ఆనందపురం మండలం గిడిజాల వద్ద ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను రూ.50 లక్షల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విద్యుత్ సిబ్బంది, షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం ఉండదు. విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు వంటి సమాచారమంతా ఆన్లైన్ ద్వారా పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. దాని నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలుగుతుంది. ఈ ప్రయోగాన్ని పరిశీలించి డిస్కం పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను స్మార్ట్ సబ్స్టేషన్లుగా మార్చాలనుకుంటున్నామని సంస్థ సీఎండీ కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. స్తంభాల్లేకుండా తక్కువ జాగాలో.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతిలో రెండు కంటైనర్ సబ్స్టేషన్లను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో స్తంభాల్లేకుండా ఇటువంటి సబ్స్టేషన్లను నిర్మించడంవల్ల విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చని సంస్థ సీఎండీ హెచ్. హరనాథరావు అంటున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 16 ఇన్డోర్ సబ్స్టేషన్లను నిర్మిస్తోంది. వీటికోసం రూ.68.12 కోట్లు ఖర్చుచేయనున్నట్లు సంస్థ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి చెప్పారు. అంతేకాక.. తొలిసారిగా కంటైనర్ సబ్‌స్టేషన్‌ను రూ.5.5 కోట్ల వ్యయంతో విజయవాడ శివారులోని గొల్లపూడిలో నిర్మిస్తోంది.. సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిలో కేవలం పది శాతం భూమిలోనే వీటిని నిర్మించవచ్చు. జగనన్న కాలనీల్లో ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లను నిర్మిస్తోంది. దీనికి రూ.6.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపడే భూమితో పోలిస్తే మూడో వంతు భూమి ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపోతుంది. -
AP: కంటైనర్ సబ్స్టేషన్లు వచ్చేస్తున్నాయ్!
తిరుపతి రూరల్: ఏపీ రాష్ట్రంలో తొలిసారిగా కంటైనర్ విద్యుత్ సబ్స్టేషన్లకు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ శ్రీకారం చుడుతోంది. ప్రయోగాత్మకంగా తిరుపతిలోని రెండు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఒక్కో కంటైనర్ సబ్‌స్టేషన్‌ను 5, 8, 10 ఎంవీఏ సామర్థ్యంతో నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సుమారు రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు వ్యయం అవుతుందని వారు పేర్కొన్నారు. అవసరమైన యంత్ర పరికరాలను సంబంధిత తయారీ సంస్థ ప్లగ్ అండ్ ప్లే విధానంలో కంటైనర్లకు సమకూర్చి పంపిణీ చేస్తోందని తెలిపారు. వీటి నుంచి ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సరఫరా చేస్తామని.. పూర్తి ఆటోమేషన్ విధానంలో ఈ సబ్స్టేషన్లు పనిచేస్తాయని వెల్లడించారు. షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం ఉండదని.. నిర్వహణ మొత్తం ఆన్లైన్ విధానంలోనే ఉంటుందని తెలిపారు. ఇలాంటి కంటైనర్ సబ్స్టేషన్లు దేశంలో ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో పట్టణ, నగర ప్రాంతాల్లో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. కంటైనర్ సబ్స్టేషన్ల ప్రత్యేకతలు.. సాధారణ సబ్‌స్టేషన్‌కు 20 సెంట్ల స్థలం అవసరమైతే, దీనికి 2 సెంట్లు సరిపోతుంది. స్తంభాలు అవసరం లేదు. కంటైనర్ ఉంటే చాలు. సాధారణ సబ్‌స్టేషన్‌కు 3 నెలలకోసారి నిర్వహణ తప్పనిసరి. కానీ ఈ కంటైనర్ సబ్‌స్టేషన్‌కు ఆ అవసరం లేదు. విద్యుత్ పంపిణీ సాధారణ సబ్‌స్టేషన్ కంటే మెరుగ్గా, నిరంతరాయంగా ఉంటుంది. షిఫ్ట్ ఆపరేటర్ల అవసరం లేకుండానే ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను ఆన్, ఆఫ్ చేయొచ్చు. ఫెన్సింగ్, ప్రహరీ గోడలు వంటివి అవసరం లేదు. సాధారణ సబ్స్టేషన్కంటే మన్నిక ఎక్కువ. -
స్మార్ట్‌గా సబ్ స్టేషన్..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 3 వేలకుపైగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వీలైనంత ఎక్కువగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. త్వరలో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చబోతోందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ప్రతి సబ్ స్టేషన్ ఆన్‌లైన్‌తో అనుసంధానం ► వైర్లు తెగినా, సబ్‌స్టేషన్ ఉపకరణాలు కాలిపోయినా వాటిని గుర్తించడానికే ఒక రోజు పడుతోంది. అప్పటి వరకూ విద్యుత్ సరఫరా ఆగిపోవాల్సిందే. ► ఆటోమేషన్ ప్రక్రియతో ప్రతీ సబ్‌స్టేషన్ ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉంటుంది. కేంద్ర కార్యాలయానికీ ఇది కనెక్ట్ అవుతుంది. ► విద్యుత్ సరఫరా ఆగిపోతే వెంటనే అదెక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. సిబ్బంది సకాలంలో స్పందించకపోతే కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల జవాబుదారీ తనం పెరుగుతుంది. ఆటోమేషన్ ఎలా? ► ప్రస్తుతం ఉన్న ప్రతీ 30 సబ్స్టేషన్లను కలిపి ఒక కేంద్ర సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రతీ సబ్‌స్టేషన్‌లోనూ రిమోట్ టెర్మినాలజీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారానే కేంద్ర కార్యాలయానికి, క్షేత్రస్థాయి సిబ్బందికి సంకేతాలు వెళ్తాయి. ఎక్కడన్నా లైన్‌కు ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని క్షణాల్లోనే దీనిద్వారా గుర్తిస్తారు. ► ప్రతీ బ్రేకర్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల దానంతట అదే సమస్య ఏంటో తెలుసుకుని, కేంద్ర సబ్ స్టేషన్‌కు చేరవేస్తుంది. ► ఈ టెక్నాలజీ ద్వారా గంటలోపే ఎలాంటి సమస్యనైనా గుర్తించి, కేంద్ర సబ్‌స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఆన్లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించే వీలుంది. ఫలితంగా మానవ వనరుల వాడకం తగ్గుతుంది. నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. దీంతో విద్యుత్ ధర తక్కువగా ఉండే వీలుంది. డిమాండ్‌కు తగ్గ టెక్నాలజీ శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో సీఎండీ రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టింది. దీని డిమాండ్ మేనేజ్మెంట్కు సబ్స్టేషన్ల ఆటోమేషన్ తప్పనిసరి అని గుర్తించింది. అందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన సేవలు అందుతాయి. -
మేం మళ్లీ వస్తే.. మీ సంగతి చెప్తా!
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ‘‘ఏయ్..సబ్ స్టేషన్ నిర్వహణ పనులు రద్దు చేయించారు.. దీనికి ప్రతి ఫలం అనుభవించేలా చేస్తా. మా పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోదా.. అప్పుడు మీ సంగతి చెప్తా.. జిల్లాలో ఎలా పనిచేస్తారో చూస్తా.. ఇవేమీ సినిమా డైలాగ్‌లు కాదు.. విద్యుత్ అధికారులకు ఓ కాంట్రాక్టర్ బెదిరింపులు’’. అధికారులను శాసిస్తున్న టీడీపీ కాంట్రాక్టర్.. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్సీ అనుచరుడిగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ కాంట్రాక్టర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంజినీర్లను శాసించే స్థాయికి ఎదిగాడు. అడ్డదారుల్లో సబ్ స్టేషన్లు పొందడం, నాసిరకం పనులు చేయడం, బిల్లులు చేయని ఇంజినీర్లను బెదిరించడం ఈయన దినచర్య. ఏఈ నుంచి ఎస్ఈ వరకు ఎవరైనా ఈయన వ్యవహారశైలి ఇంతే. అలా అడ్డదారులు తొక్కి ఎన్నో అక్రమాలకు తెరలేపాడు. ఇతడి ఒత్తిళ్లు భరించలేక ఒక ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారంటే ఏస్థాయిలో బెదిరించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అధికారి సెలవులో వెళ్లడంపై ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒత్తిళ్లతో కాంట్రాక్టులు.. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని కర్నూలు సర్కిల్లో ఓ కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులతోపాటు అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని గతంలో పనిచేసిన ఎస్ఈని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. చెప్పిందే తడవుగా పనులు చేసే పెట్టే పరిస్థితి నెలకొనడంతో ఆపరేషన్స్ ఎస్ఈ ఏకంగా ఆ కాంట్రాక్టర్‌కు 19 సబ్స్టేషన్లు అప్పగించారు. దీనికి తోడు స్పాట్ బిల్లింగ్ వసూలు, బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ సబ్స్టేషన్లునూ దక్కించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక పత్తికొండ పరిధిలోని సబ్స్టేషన్లు పొందడం మరో ఎత్తు. విచారించి..కాంట్రాక్ట్ రద్దు కోడ్ అమల్లో ఉండగా సబ్స్టేషన్ల కేటాయింపులు జరిగాయని వచ్చిన ఫిర్యాదుపై గత జాయింట్ కలెక్టర్–2 మణిమాల, చీఫ్ జనరల్ మేనేజర్ లలిత, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (తిరుపతి) వెంకటరత్నం విచారణ చేశారు. అన్నీ ధ్రువీకరణ కావడంతో సబ్స్టేషన్ల కాంట్రాక్టును రద్దు చేశారు. అధికారులకు బెదిరింపులు.. సబ్స్టేషన్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో జీర్ణించుకోలేని సదరు కాంట్రాక్టర్ అధికారులపై కాలు దువ్వుతున్నాడు. ‘నాకు ఉప కేంద్రాలు రాకుండా చేశారు.. నాకూ సమయం వస్తుంది... అప్పుడు చూస్తా.. అంటూ బెదిరిస్తుండటంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతున్నారు. లాంగ్ లీవ్‌లో ఈఈ.. ఓర్వకల్లు ఏఈతోపాటు ఏడీఈపై కాంట్రాక్టర్ బెదిరింపు చర్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం. చివరగా ఈయన బెదరింపు చర్యలు, ఒత్తిళ్ల కారణంగా ఆదోని ఆపరేషన్స్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు లాంగ్ లీవ్‌లో వెళ్లారు. వ్యక్తిగత పనుల పేరుతో సెలవులో వెళ్లినా.. ఇటీవల అసలు విషయం బయటకు రావడం చర్చాంశనీయమైంది. కాంట్రాక్టర్ ఆగడాలను అరికట్టాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
మేఘా విద్యుత్ రికార్డు
ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఈఐఎల్ తాజాగా తెలంగాణకు ఎంతో ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరాల కోసం 6 భారీ సబ్ స్టేషన్లను ప్రపంచంలోనే తొలిసారిగా త్వరితగతిన పూర్తిచేసి రికార్డ్ సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. నీటిపారుదల రంగంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచంలోని ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రైవేటు రంగంలో విద్యుత్ సరఫరా కోసం అతిపెద్దదైన WUPPTCL ఉత్తరప్రదేశ్‌లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అయితే అది విద్యుత్ అవసరాలకోసం కాగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్ల కాలంలోనే 6 భారీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. ఇవన్నీ 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగినవి. దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లను కూడా అతితక్కువ కాలంలోనే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. 2017 ఫిబ్రవరిలో రామడుగు సబ్‌స్టేషన్‌తో పనులను ప్రారంభించి, ఒక్కో సబ్‌స్టేషన్‌ను పూర్తిచేస్తూ చివరగా ఆరో సబ్‌స్టేషన్‌ను 2019 మే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతిపెద్ద విద్యుత్ వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే మన దేశంలోని జమ్ము కాశ్మీర్ (3428 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (3356 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల విద్యుత్ సరఫరా వ్యవస్థలకు దాదాపుగా సమానం. రికార్డు సమయంలో ఎంఈఐఎల్ ఆరు సబ్ స్టేషన్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంప్ హౌజ్ లలో ఏర్పాటు చేసిన మొత్తం 43 పంపుమోటార్లకు విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఆరు విద్యుత్ సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6, 12, 14 సబ్ స్టేషన్ లు మినహా మిగతా అన్ని సబ్ స్టేషన్ లను, విద్యుత్ సరఫరా లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్‌వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ పంప్ హౌజ్ లో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ రామడుగు వద్ద ఏర్పాటు చేసింది. దీని కోసం 18 కిలోమీటర్ల 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్, ట్రాన్స్ మిషన్ లైన్ పనులను 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి, కేవలం ఏడాది కాలంలో పనులను పూర్తిచేసి, 2018 మే 6న చార్జ్ చేసి అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది యూనిట్లతో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించే 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ గడువులోగా పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్ నుంచే 220 కేవీ అన్నారం, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందుతుంది. 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించేందుకు 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ పనులను 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 14న చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. 440 మెగావాట్ల సామర్థ్యంతో 11 యూనిట్లను కలిగిన మేడిగడ్డ పంప్ హౌజ్ కు విద్యుత్ అందించేందుకు 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ తోపాటు సుందిళ్ల నుంచి 80 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ఏర్పాటు చేశారు. దీని పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 29న చార్జింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేసింది. తిప్పాపూర్ సబ్ స్టేషన్ తో ప్యాకేజీ 10కు విద్యుత్ సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్ నుంచి 46.115 కిలోమీటర్ల లైన్ తోపాటు చందులాపూర్ నుంచి 19.096 కిలోమీటర్ల క్యూఎండీసీ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్, లైన్ల పనులను 2017 నవంబర్ 8న ప్రారంభించి, 2019 ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ 11 రంగనాయకసాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు చందులాపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లి కేటీపీపీ నుంచి గజ్వేల్ సబ్ స్టేషన్ అక్కడి నుంచి చందులాపూర్ వరకు 54.18 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను మే 2017లో ప్రారంభించగా, 2019 మే 6న చార్జింగ్ చేశారు. -
త్వరపడండి.. అమ్మకానికి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): ఎన్నికల నియమావళి వస్తోందని పనులు పూర్తికాక ముందే ప్రారంభించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఖాళీగా ఉండే షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో పోస్టును రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు సొమ్ము చేసుకుంటున్నారు. దీపం ఉన్నప్పుడూ ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నినాదంతో అధికార టీడీపీ నాయకులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మళ్లీ అధికారం వస్తుందో లేదో అన్న అనుమానంతో అర్హత కలిగిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను డబ్బులిచ్చిన వారికి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వకపోవడంతో చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా తిరగలేక కనీసం డబ్బులు కడితేనైనా తమకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో నాయకులు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొందరు ఉద్యోగాలు లేవని పెళ్లి కూడా చేసుకోకుండానే అలాగే ఉండిపోతుఆన్నరు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ వంటి ఉపాధి కోర్సులు చదువుకున్నా సొంతంగా దుకాణాలు పెట్టుకున్నా పోటీ ఎక్కువ కావడంతో కనీసం ఇల్లు గడవడానికి సంపాదించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఉద్యోగమైనా ఏదో ఒక రోజు మనసున్న ముఖ్యమంత్రి రాకపోతాడా..తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయకపోతాడా.. అన్న ఆశతో పెద్ద మొత్తంలో నగదు చెల్లించి షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరుతున్నారు. ఒక్కో సబ్‌స్టేషన్‌లో ఐదు పోస్టులు ప్రతి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేసేందుకు ఐదుగు ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తారు. ఇందులో ఒకరు వాచ్‌మన్ కాగా మిగిలిన నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లుగా ఉంటారు. ఇందులో సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతకు ఒక పోస్టు ఇవ్వగా మిగిలిన పోస్టులకు విపరీతమైన పోటీ ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న అధికార టీడీపీ నాయకులు డిమాండ్ సృష్టించి నిరుద్యోగుల నుంచి అందిన కాడికి పిండుకుంటున్నారు. తమ గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో పోస్టుల్లో తనకు వాటా ఉందంటూ కొందరు అధికార పార్టీ నాయకులు ముందుగానే అడ్వాన్సులు పుచ్చుకున్నారు. తమకు ఉద్యోగం ఎప్పుడు వస్తోందని నగదు ఇచ్చిన వారు నాయకుల వెంట తిరుగుతున్నారు. టీడీపీలో చేరితే పోస్టులంటూ ఎర గిద్దలూరు నియోజకవర్గంలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ.. షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులిస్తాం..తమ పార్టీలో చేరండని మాజీ సర్పంచ్‌లు, కుల సంఘాల నాయకులను బతిమిలాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ముండ్లపాడులో ఓ నాయకునికి రెండు పోస్టులు ఇస్తామని కండువా కప్పారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచికి రెండు షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు ఇస్తానంటూ ఎరవేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్‌ల్లో ఆరు విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పొదలకుంటపల్లెలో ఉన్న సబ్‌స్టేషన్ ఇటీవల పూర్తయింది. మిగిలిన కొత్తపల్లె, బురుజుపల్లె, అనుములపల్లె, చిన్నకంభం, నల్లగుంట్ల గ్రామాల్లో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణాలు పూర్తికాక ముందే పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఒక్కో సబ్ స్టేషన్లో నాలుగు పోస్టుల చొప్పున మొత్తం 24 పోస్టులు విక్రయానికి పెట్టారు. ఎన్నికల నియమావళి రావడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాత తేదీలతో నియామకాలు చేపట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పొదలకుంటపల్లె గ్రామంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నేటికీ కొత్త ఉద్యోగులు విధుల్లో చేరలేదు. అయినా ఈ నెల 5వ తేదీనే నియామకాలు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు. ఇలానే అన్ని సబ్స్టేషన్లలోని పోస్టులను భర్తీ చేసేందుకు ఒక్కో పోస్టుకు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా రూ.1.60 కోట్లు నిరుద్యోగుల నుంచి లాగేసుకుంటున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇలా దాదాపు రూ.2 కోట్లు వసూలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి నియామకాలు చేపడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు, అర్హత కలిగిన నిరుద్యోగ యువకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై విద్యుత్ శాఖ మార్కాపురం డీఈఈ టి.వెంకటేశ్వరరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. -
విజయవాడలో కరెంటు పోయిందా.. కటకటే!
సాక్షి, విజయవాడ: జిల్లాలో విద్యుత్ శాఖ పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో ముందుండాల్సిన ఆ శాఖ సిబ్బంది.. తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా వినియోగదారులు విద్యుత్ సరఫరా లేదని ఫోన్ చేస్తే సిబ్బంది సరిగ్గా స్పందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దురుసుగా మాట్లాడుతూ.. ఇప్పుడు రాలేం.. కుదిరినప్పుడు వస్తాం అంటూ సమాధానం చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం సిబ్బంది కొరతేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ (విజయవాడ సర్కిల్) విద్యుత్ సంస్థ అధికారులు సేవలను గాలికి వదిలేశారు. కేవలం బిల్లుల వసూళ్లకే పరిమితమవుతూ.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కల్గితే సేవలందించటానికి కంటికి కనపడటం లేదని ప్రజానీకం గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు, సర్‌చార్జీలు, ఓవర్‌లోడ్ చార్జీల వసూళ్లకు మాత్రం వినియోగదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కరెంటు పోయింది చూడమంటే కిందిస్థాయిలో పోలెక్కడానికి సిబ్బంది లేరని అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో మొత్తం అన్ని కేటగిరీలు కలిపి 17లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే దీనిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే సేవలు సక్రమంగా అందుతున్నట్లు ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులే చెబుతుండటం గమనార్హం. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సైతం పంపినట్లు తెలుస్తోంది. మెరుగైన సేవలు మేడిపండే.. మెరుగైన విద్యత్ సరఫరా చేస్తామని ఏపీఎస్పీడీసీఎల్ ఇంటింటికి చేస్తున్న ప్రచారం ఆచరణలో అమలవటం లేదని ప్రజానీకం విమర్శిస్తున్నారు. దీనికి విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతే ప్రధాన కారణంగా తెలుస్తోంది. జిల్లాలో పట్టణాలు, గ్రామాల్లో 40శాతం వినియోగదారులకు అధికారులు, సిబ్బంది లేరని విద్యుత్ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. సిబ్బంది కొరత చాలా ప్రాంతాల్లో ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఇన్చార్జిలుగా ఉన్న వారు పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో విఫలమవుతున్నారు. ఎవరైనా వినియోగదారుడు సమస్యపై ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత ఉంది అత్యవసరంగా సేవలందించలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఏఈలు లేరు.. జిల్లా మొత్తం మీద అత్యంత ప్రాధన్యం ఉన్న 18 విద్యుత్ సబ్స్టేషన్లకు ఏఈలు లేరు. ఆయా సబ్–స్టేషన్లలో అసిస్టెంట్ సబ్–ఇంజినీర్లే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. విజయవాడ గవర్నర్‌పేట, రింగ్‌రోడ్డు, కానూరు, గంగూరు, జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో డి1, డి2, తిరువూరు టౌన్, నూజివీడు, రూరల్, చిల్లకల్లు, చందర్లపాడు, గుడివాడ టౌన్, అవనిగడ్డ, ఘంటశాల, మోపిదేవి తదితర పలు ముఖ్యమైన విభాగాల్లో సబ్–స్టేషన్లలో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని సబ్–స్టేషన్లలో ఏడాది నుంచి, మరికొన్నింటిలో ఆరు నెలల నుంచి పోస్టులు భర్తీకావటం లేదు. 470 జూనియర్ లైన్మన్లు ఖాళీ ఇదిలా ఉండగా కిందిస్థాయిలో పోలెక్కి విద్యుత్ అంతరాయాలు, ఇతర సమస్యలు పరిష్కరించే జూనియర్ లైన్మెన్పోస్టులు నాలుగున్నరేళ్లుగా భర్తీకావటం లేదు. జిల్లా మెత్తం మీద ఐదేళ్ల కిందట ఉన్న విద్యుత్ వినియోగదారులు 13లక్షల మందికి గాను 1200ల మంది జూనియర్ లైన్మెన్లు ఉన్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో పెరిగిన విద్యుత్ వినియోగదారులకు తగ్గట్టు లైన్మెన్లు పెరగకపోగా.. రిటైర్మెంట్లు తదితర కారణాలతో 470 జూనియర్ లైన్మెన్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈ లేక ఇబ్బందులు తిరువూరు మండలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీకి అధికారులు జాప్యం చేస్తున్నారు. తిరువూరులో ఏఈ లేకపోవడం, గ్రామాల్లో లైన్మెన్ల కొరత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా త్వరగా మార్పు చేయట్లేదు. కొత్త కనెక్షన్ల జారీకి నెలల తరబడి తిప్పుతున్నారు. –ఎస్కే రామారావు, వినియోగదారుడు, వామకుంట్ల, తిరువూరు లైన్మెన్లు లేరంటున్నారు కరెంటు పోయిందంటే మరమ్మతులకు ఎవరు రావటం లేదు. ఫోన్ చేస్తే లైన్మెన్లు లేరని చెబుతున్నారు. రాత్రి సమయాల్లో కరెంటు పోతే ఇక జాగరమే. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులైనా కనీసం ఎవరూ పట్టించుకోవడం లేదు. – కె. కోటేశ్వరరావు, వినియోగదారుడు, గోశాల, పెనమలూరు -
ఆపరేటర్ పోస్టుకు రూ. 2 లక్షలు
కాంట్రాక్టర్ల బేరసారాలు జిల్లాలో 230 పోస్టుల భర్తీకి సన్నాహాలు అధికారులపైనే నిరుద్యోగుల ఆశలు విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల నియామకంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ సబ్‌స్టేషన్ కాంట్రాక్టర్లు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్లోని వరంగల్, వరంగల్ రూరల్ పరిధిలో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల వసూళ్ల వ్యవహారంపై పలువురు నిరుద్యోగులు ఇప్పటికే ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది. సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలోని 33/11 కేవీ(కిలో వాట్) సబ్‌స్టేషన్ నిర్వహణ కోసం 230 మంది ఆపరేటర్ల నియామకానికి ఆగస్టు 26న నోటిఫికేషన్ జారీ అయ్యింది. డివిజన్ల వారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆపరేటర్లకు వేతనాలు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్లు చెల్లిస్తారు. ఐటీఐ(ఎలక్ట్రికల్), ఇంటర్మీడియెట్ ఒకేషనల్(ఇడబ్లు్యఎన్ఈఈ) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. మన జిల్లాకు చెందినవారే దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ పరిధిలోని ఉప కేంద్రాలకు ఆ ప్రాంతం వారే (ట్రైబల్ ఏజెన్సీ వాసులు) అర్హులు అని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా సబ్ స్టేషన్ల కాంట్రాక్టర్లు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకటి రెండు డివిజన్లలో ఒక్కో పోస్టుకు 50 మంది పోటీపడేలా దరఖాస్తుల సంఖ్య ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇది పూర్తయితేగానీ కచ్చితమైన సంఖ్య తెలియదు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రత్యేక కమిటీ చేపట్టనుంది. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయంలోని టెక్నికల్ డీఈ, ఆపరేషన్ డీఈ, ఎన్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక డీఈ, కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో ఉంటారు. ఐటీఐ, ఇంటర్మీడియేట్ ఒకేషన్లో మెరిట్, రిజర్వేషన్, కరెంటు స్తంభాలు ఎక్కే అర్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నిబంధనలు ఇలా ఉంటే... కాంట్రాక్టర్లు మాత్రం అంతా తామే అన్నట్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ‘మా పరిధిలో ఇన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇన్ని ఆపరేటరు ఉద్యోగాలు ఇస్తాం. అంతా మేం చెప్పినట్లే ఉంటుంది. ముందుగా డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యత’ అని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్పీడీసీఎల్ అధికారులు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోస్టుల వివరాలు డివిజన్ పేరు ఖాళీలు వరంగల్ 20 వరంగల్ రూరల్ 25 ములుగు 34 మహబూబాబాద్ 46 నర్సంపేట 22 జనగామ 83 పారదర్శకంగా నియామకాలు : శివరాం, వరంగల్ ఎస్ఈ సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకాలు పారదర్శకంగా జరుగాతాయి. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా... విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగే వారిని ఎంపిక చేస్తాం. ఎలాంటి పైరవీలకు, అక్రమాలకు తావు లేదు. బ్రోకర్లను నమొ్మద్దు. ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. -
ఏడు సబ్స్టేషన్లు మంజూరు
సీఈ నందకుమార్ రాపూరు : జిల్లాకు ఏడు 132 కేవీ సబ్స్టేషన్లు, 33–11 కేవీ సబ్స్టేషన్లు 11 మంజూరయ్యాయని, వీటి పనుల త్వరలో ప్రారంభిస్తారని విద్యుత్‌శాఖ సీఈ నందకుమార్ తెలిపారు. ఆధునీకరణ చేసిన రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు హెచ్‌వీడీఎస్ (వ్యవసాయ రైతులకు మూడు విద్యుత్ మెటార్లకు ఒక ట్రాన్స్ఫారం) పథకానికి రూ.320 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. విద్యుత్ సమస్యలుంటే ప్రజలు టోల్‌ఫ్రీ నంబర్ 180042515333 ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. రాపూరు సమీపంలో నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పూర్తయితే విద్యుత్ సమస్య ఉండదని ఇక్కడి నుంచి చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరాచేస్తామని చెప్పారు. రాపూరుకు ఏఈని పుష్కరాల అనంతరం నియమిస్తామన్నారు. జిల్లాలో విద్యుత్ శాఖలో 1,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వనికి నివేదిక పంపామని చెప్పారు. అనంతరం విద్యుత్‌శాఖ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. పాత బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఆయన వెంట డీఈలు అనీల్‌కుమార్, రాఘవేంద్ర ఇస్మాయిల్, జగదీష్, ఏడీఈ ప్రసాద్, ఏఈ సుబ్రమణ్యం ఉన్నారు. -
రైతన్నకు గుండె ‘కోత’
సాక్షి, నెల్లూరు: వేసవిలో ఎండలతో పాటు విద్యుత్ కోతలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో వేలాది రూపాయల పెట్టుబడి సాగు చేస్తున్న పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. పచ్చటి పంటలు, తోటలు కళ్లముందే ఎండిపోతుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. జిల్లాలో 8.84 లక్షల గృహ కనెక్షన్లు, 71 వేల కమర్షియల్ కనెక్షన్లు, 1.35 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులు 41 వేల వరకు ఉన్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. సెంట్రల్ గ్రిడ్ నుంచి ఏపీఎస్పీడీసీఎల్కు 22 శాతం వాటా మాత్రమే సరఫరా అవుతోంది. ఈ క్రమంలో జిల్లాకు రోజుకు సరఫరా అవుతున్న పది మిలియన్ యూనిట్ల విద్యుత్ సరిపోవడం లేదు. ఇందులో 30 శాతం నగర ప్రజల అవసరాలకే సరిపోతోంది. దీనికి తోడు పరిశ్రమల్లోనూ వినియోగం పెరగడంతో విద్యుత్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇది ప్రధానంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయానికి రోజుకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంగా రెండు గంటలకు కూడా ఇవ్వని పరిస్థితి. అందులోనూ పలుమార్లు ట్రిప్ చేస్తుండడంతో పొలాలకు నీరు పారని పరిస్థితి నెలకొంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోవడంతో రైతులు నిరంతరం మోటార్ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా నీళ్లు చాలక వరి, సజ్జ, పత్తి, బత్తాయి తదితర పంటలు నిలువునా ఎండి పోతున్నాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండకపోతుండడంతో సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. సోమవారం పొదలకూరు మండలం చెర్లోపల్లి, ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సబ్స్టేషన్ల ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. కావలి నియోజకవర్గంలోని కావలి, బోగోలు తీర ప్రాంతంతో పాటు జలదంకి, దగదర్తి ప్రాంతాల్లో బెండ, వంగ, దోస, పచ్చిమిరప పంటలతో పాటు పండ్లతోటలు సాగులో ఉన్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కోవూరు ప్రాంతంలో ప్రధానంగా వరి, కొంత మేర చెరకు, కొద్ది మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. పలుచోట్ల కూరగాయలు, అరటి తోటలు సాగులో ఉన్నాయి. విద్యుత్ కోతల నేపథ్యంలో నీళ్లు చాలక పంటలు వాడుముఖం పట్టాయి. సర్వేపల్లిలో వరి, వేరుశనగ, సజ్జ తదితర పంటలు సాగులో ఉన్నాయి. వందలాది ఎకరాల విస్తీర్ణంలో నిమ్మతోటలు సాగు చేస్తున్నారు. కోతల కారణంగా ఇవి ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉదయగిరి ప్రాంతంలో మొక్కజొన్న, పత్తితో పాటు సుమారు నాలుగు వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగవుతున్నాయి. విద్యుత్ కోతల పుణ్యమాని ఇవి ఎండిపోతున్నాయి. వెంకటగిరి ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నారు. ఓ వైపు నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నా, మరోవైపు తోటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గూడూరు ప్రాంతంలో నిమ్మతోటలతో పాటు కూరగాయల సాగు భారీగా జరుగుతోంది. విద్యుత్ కోతలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాళంగినది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాల పరిధిలో బోర్ల ఆధారంగా వరిసాగు జరుగుతోంది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వరి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది. -
పాలమూరు జిల్లాలో భారీ సోలార్ పార్కు
5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల ప్లాంటు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు మండలంలో భారీ సోలార్ పార్కు ఏర్పాటు కానుంది. 5 వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన పార్కును ఏర్పాటు చేసేందుకు సోలార్ ఎనర్జీ కో-ఆపరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ)తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సోలార్ పార్కులో రూ. 600 కోట్లతో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్ బాబు శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు. మొదటి దశలో 500 మెగావాట్లు, రెండో దశలో మరో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పార్కు అమలు ఏజెన్సీగా నెడ్‌క్యాప్ వ్యవహరించనుందన్నారు. సోలార్ ప్లాంట్లకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాల(విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు మొదలైనవి)ను ఎస్ఈసీఐ అభివృద్ధి చేయనుంది. ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేయనున్నారు.