సాక్షి, అమరావతి : విద్యుత్ పంపిణీ వ్యవస్థలో సరికొత్త విధానాలకు ఏపీ డిస్కంలు శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం ప్రాంతాల్లో స్మార్ట్, కంటైనర్, ఇండోర్, ఎయిర్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నాయి. కొన్నిచోట్ల షిష్ట్ ఆపరేటర్లు, సిబ్బంది లేకుండానే ఆన్‌లైన్‌లో కంట్రోల్ రూమ్ ద్వారా వాటి నిర్వహణ చేపట్టనున్నాయి. ఇందుకోసం సాధారణంగా వినియోగించే భూమితో పోలిస్తే పది శాతం నుంచి మూడో వంతు భూమిలోనే వీటిని ఏర్పాటుచేస్తున్నాయి.
పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో..
ఉద్యోగుల అవసరంలేకుండా గృహాలకు, దుకాణాలకు విద్యుత్ సరఫరా చేసేలా స్మార్ట్ సబ్‌స్టేషన్ల వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. విశాఖలోని ఆనందపురం మండలం గిడిజాల వద్ద ఉన్న 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను రూ.50 లక్షల అంచనా వ్యయంతో పూర్తిస్థాయి ఆటోమేషన్ సబ్‌స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో విద్యుత్ సిబ్బంది, షిఫ్ట్ ఆపరేటర్లు అవసరం ఉండదు. విద్యుత్ పంపిణీ, ఇబ్బందులు వంటి సమాచారమంతా ఆన్‌లైన్ ద్వారా పెదవాల్తేరు సబ్‌స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది. దాని నుంచే కార్యకలాపాలను నియంత్రించే వీలు కలుగుతుంది. ఈ ప్రయోగాన్ని పరిశీలించి డిస్కం పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్లను స్మార్ట్ సబ్‌స్టేషన్లుగా మార్చాలనుకుంటున్నామని సంస్థ సీఎండీ కె. సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు.
స్తంభాల్లేకుండా తక్కువ జాగాలో..
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) తిరుపతిలో రెండు కంటైనర్ సబ్‌స్టేషన్లను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో స్తంభాల్లేకుండా ఇటువంటి సబ్‌స్టేషన్లను నిర్మించడంవల్ల విద్యుత్ ప్రమాదాలను అరికట్టవచ్చని సంస్థ సీఎండీ హెచ్. హరనాథరావు అంటున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) 16 ఇన్‌డోర్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తోంది. వీటికోసం రూ.68.12 కోట్లు ఖర్చుచేయనున్నట్లు సంస్థ సీఎండీ జె. పద్మజనార్థనరెడ్డి చెప్పారు. అంతేకాక.. తొలిసారిగా కంటైనర్ సబ్‌స్టేషన్‌ను రూ.5.5 కోట్ల వ్యయంతో విజయవాడ శివారులోని గొల్లపూడిలో నిర్మిస్తోంది.. సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన భూమిలో కేవలం పది శాతం భూమిలోనే వీటిని నిర్మించవచ్చు. జగనన్న కాలనీల్లో ఎయిర్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్లను నిర్మిస్తోంది. దీనికి రూ.6.5 కోట్లు వెచ్చించనుంది. ఇది సాధారణ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపడే భూమితో పోలిస్తే మూడో వంతు భూమి ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment