కరెంట్‌ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా | YS Jagan Mohan Reddy Review On Power Distribution In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కొనుగోళ్లపై సమీక్షతో.. ప్రజాధనం ఆదా

Published Tue, Jul 16 2019 2:43 AM | Last Updated on Tue, Jul 16 2019 8:53 AM

YS Jagan Mohan Reddy Review On Power Distribution In Andhra Pradesh - Sakshi

ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం

చౌక ధరలకే ముందుకొస్తున్నారు.. 5 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్‌రూ. 2.70కే రాష్ట్రానికి అందించేందుకు ఎలాంటి పీపీఏలు లేకుండానే పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కొందరు వ్యక్తులలాబీయింగ్‌కు రాష్ట్రం ఎందుకు తలొగ్గాలి? ప్రజలకు అతి తక్కువ ధరకే విద్యుత్తు లభిస్తుంటే ఎక్కువ ధరలున్న పీపీఏలను సమీక్షించడాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కొంతమంది రాజకీయ నాయకులు కుదుర్చుకున్న తప్పుడు డీల్స్‌పైనే సీఎం దృష్టి పెట్టారు. 

సాక్షి, అమరావతి: ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. అవినీతికి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజలు, ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని తగ్గించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గత సర్కారు హయాంలో అధిక ధరలతో చేసుకున్న పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను క్షుణ్నంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని, దీని ద్వారా ఏటా రూ.2,500 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగం కాకుండా నివారించవచ్చని సీఎం భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విపక్షాలు విమర్శించడం ఏమిటని కల్లం తప్పుబట్టారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతుల కోసం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ పథకాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. వ్యవసాయం, విద్యుత్‌ అత్యంత కీలక రంగాలని పేర్కొన్నారు. కీలకమైన విద్యుత్‌ రంగం గాడి తప్పుతోందని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దీన్ని సరైన మార్గంలోకి తెచ్చి అవినీతికి తావు లేకుండా తీర్చిదిద్దాలని నిర్ణయించారని వివరించారు. మూడేళ్లలో గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు వివాదాస్పదం కావడంతో వీటిని పునఃసమీక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారని తెలిపారు. సీఎం సదాశయాన్ని అంతా అభినందించాల్సిందేనని పేర్కొన్నారు.

ధరలు తగ్గాయని కేంద్రమే చెప్పింది 
పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో పలు రకాలుగా స్పందించిందని కల్లం గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్‌ ధరలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018–19 సర్వేలో స్పష్టంగా పేర్కొందన్నారు. 2010లో యూనిట్‌ రూ. 18 చొప్పున ఉన్న సౌర విద్యుత్‌ ధర 2018 నాటికి రూ. 2.44కి తగ్గిందని కేంద్రం ప్రకటించిందన్నారు. 2018–19 ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. దేశంలో పవన విద్యుత్‌ ధర 2017 డిసెంబర్‌ నాటికి యూనిట్‌ రూ.4.20 నుంచి రూ. 2.44కి  తగ్గిందన్నారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా గత రెండేళ్లలో 3,000 మెగావాట్ల వరకూ యూనిట్‌ రూ. 4.84 చొప్పున కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

దేశంలో పవన, సౌర విద్యుత్‌ ధరలు భారీగా తగ్గితే రాష్ట్రంలో మాత్రం ఎలాంటి టెండర్లకు వెళ్లకుండా పీపీఏలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో థర్మల్‌ ప్రాజెక్టులతో దీర్ఘ, మధ్య కాలిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలున్నాయని, థర్మల్, జల విద్యుత్‌ ద్వారా రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ తీరడానికి ఆస్కారం ఉందని కల్లాం పేర్కొన్నారు. సోలార్, విండ్‌ పవర్‌ కన్నా థర్మల్‌ విద్యుత్తు తక్కువ ధరకే లభించే అవకాశం ఉందని వివరించారు. చౌకగా లభించే జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉన్నప్పటికీ ప్రైవేట్‌ పవన విద్యుత్‌ను తీసుకోవడం దారుణమన్నారు. పవన, సౌర విద్యుత్‌ను ఇష్టానుసారంగా కొనుగోలు చేయడం వల్ల పీపీఏలు చేసుకున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ నిలిపివేసినా స్థిర వ్యయం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.  

థర్మల్‌ విద్యుత్తు యూనిట్‌కు రూ.4.20కే అందుబాటులో ఉంటే వాడకుండా పవన్‌ విద్యుత్తు యూనిట్‌కు రూ.5.94, సౌర విద్యుత్తు రూ.6.10 చొప్పున కొనుగోలు చేయడం వల్ల ఖజానాపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడిందన్నారు. ప్రజా ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, వీటిని కాపాడానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు నష్టం కలిగించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. అవినీతిపై యుద్ధం చేస్తామని సీఎం బహిరంగంగానే ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీఏలపై సమీక్షించడాన్ని ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ కూడా స్వాగతించిందన్నారు. ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమంటూ అత్యధిక ధరలున్న పీపీఏలు సమీక్షించడం మంచి నిర్ణయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు.
 
సమీక్షించాలని గతంలో చెప్పింది... 
ప్రజలపై భారం మోపే విద్యుత్‌ ఒప్పందాలను రాష్ట్రం ఎందుకు సమీక్షించడం లేదని కేంద్రం కూడా గతంలో ప్రస్తావించినట్లు ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ తెలిపిందని కల్లాం పేర్కొన్నారు. 5 శాతం తీసుకోవాల్సిన రెన్యూవబుల్‌ పవర్‌ను 22 శాతం తీసుకున్నారని, థర్మల్‌ విద్యుత్‌ కన్నా ఇది తక్కువ ఉంటే ప్రోత్సహించడం మంచిదని, కానీ అధిక ధరలు చెల్లించి ఎందుకు తీసుకున్నారనేది బోధపడటం లేదన్నారు. తక్కువ ధరకు లభించే థర్మల్‌ విద్యుత్తును తీసుకోకుండా, వాటికి బ్యాక్‌డౌన్‌ వల్ల స్థిర విద్యుత్‌ చెల్లించడం, విండ్, సోలార్‌కు అయ్యే ఖర్చుతో కలిపితే ఏడాదికి రూ. 2,500 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలియకుండా ఏపీఈఆర్‌సీకి వివరాలు ఇవ్వడం లేదన్నారు.

గత ఏడాది సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ 3 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌కు టెండర్లు పిలిచిందని, అందులో 2,400 మెగావాట్లు రద్దు చేసిందని, సాఫ్ట్‌బ్యాంక్‌ అనే సంస్థ గణాంకాల మాయజాలం చేస్తే, కేవలం 27 పైసలు తేడా ఉందంటూ టెండర్లు రద్దు చేశారని తెలిపారు. కర్నూలులో సోలార్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తే అందులో 350 మెగావాట్లు యూనిట్‌ రూ. 4.63 చొప్పున పీపీఏ చేసుకున్నారని చెప్పారు. గత ఐదేళ్లుగా జరిగిన పీపీఏలను సమీక్షిస్తామని, అక్రమాలు జరగకుంటే వాటికి ఏ ఇబ్బందీ ఉండదని కల్లాం ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో విద్యుత్‌ ధరలు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు.
 
అప్పుల్లో డిస్కమ్‌లు 
గత మూడేళ్లుగా రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యుత్‌ను అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. ఉత్పత్తిదారులకు పంపిణీ సంస్థలు రూ. 18,375 కోట్ల మేరకు బకాయిలు పడ్దాయని, ఇవి ఇప్పటికి రూ. 20 వేల కోట్లకు చేరుకున్నాయని వివరించారు. ఈ ఏడాది మార్చి 31 వరకూ డిస్కమ్‌ల నష్టాలు రూ. 15 వేల కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక పరిస్థితి ఇలా దిగజారడం వల్ల డిస్కమ్‌లకు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదన్నారు. దీనివల్ల ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉందన్నారు.  కేవలం ఎన్టీపీసీకే రూ. 5 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని, సెప్టెంబర్‌ నాటికి చెల్లించకుంటే మరో రూ. 450 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. ఏపీఈఆర్‌సీకి ఇచ్చిన ఆదాయ అంతరం (రెవెన్యూ గ్యాప్‌) రూ. 3 వేల కోట్ల వరకూ భారం పడుతోందన్నారు. దీన్ని ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు.

రాష్ట్రంలో సంప్రదాయేత ఇంధన వనరులు (విండ్, సోలార్‌) డిమాండ్‌లో 5 శాతం మాత్రమే ఉండాలని, కానీ దీన్ని 22 శాతం తీసుకున్నారని, దీనివల్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయాల్సి వచ్చిందని, ఆ ఉత్పత్తిదారులతో ఒప్పందాలున్నాయని కాబట్టి విద్యుత్‌ తీసుకోకపోయినా ఫిక్స్‌డ్‌ ధర చెల్లించాల్సి వచ్చిందన్నారు. కొన్నింటికి యూనిట్‌కు రూ. 1.10, మరికొన్నింటికి రూ. 1.25 చెల్లిస్తామని చెప్పారు. గత ఐదేళ్లుగా పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు. విద్యుత్‌ ధరలు పెరిగితే పారిశ్రామిక వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్‌ తక్కువ ధరకే లభిస్తే పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టే అవకాశం ఉండదన్నారు. రాష్ట్రంలో పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు 221 ఉన్నాయని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో 88, కొత్త రాష్ట్రంలో 133 ఒప్పందాలు జరిగాయని వివరించారు. 25 సంవత్సరాల పీపీఏల నెట్‌ వ్యాల్యూ రూ.9,200 కోట్లని తెలిపారు. ఇందులో ప్రధాన పీపీఏలు ఐదున్నాయని, వీటితోనే 75 శాతం విద్యుత్‌ తీసుకునేందుకు ఒప్పందాలు జరిగాయని చెప్పారు. అందులో గ్రీన్‌కోవి 16 (999 మెగావాట్లు), రెన్యూ 15 (717 మె.వా), మైత్రా 7 పీపీఏలు (352 మె.వా), కేంద్ర ప్రభుత్వ పవర్‌  ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ నాలుగు పీపీఏలు (189 మె.వా), ఎకోరిన్‌ (151 మె.వా), యాక్సిస్‌ (210మె.వా) ఉన్నాయన్నారు. కొన్నేళ్లుగా వివిధ రాష్ట్రాల్లో విండ్, సోలార్‌ విద్యుత్‌ ధరల గురించి శ్రీకాంత్‌ వివరించారు. 1995లో విండ్‌ యూనిట్‌ రూ. 2.23 ఉందని,  2006లో రూ. 2.70 ఉందని, 1995–2000 మధ్య తమిళనాడులో రూ.2.70 వరకూ ఉందని తెలిపారు. ప్రస్తుతం సెఖీ బిడ్‌ 2017లో రూ. 2.43 ఉందని, తమిళనాడులో రూ. 2.86 చొప్పున ఉందన్నారు.  

విద్యుత్‌ ధరలపై అత్యున్నత కమిటీ సమీక్ష
టీడీపీ సర్కారు హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అత్యున్నతస్థాయి సంప్రదింపుల కమిటీ సోమవారం భేటీ అయింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఇంధనశాఖ సలహాదారు కృష్ణ, కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు. విండ్, సోలార్‌ ఉత్పత్తిదారులకు కమిటీ అన్ని విషయాలను వివరించింది.

దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్‌ ధరలు తగ్గాయని, రాష్ట్రంలో ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండా పీపీఏలు చేసుకోవడం వల్ల విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో సౌర, పనవ విద్యుత్‌ ధరలు చౌకగా ఉన్న విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కమిటీ సూచనలపై సమాలోచనలు జరుపుతామని విండ్, సోలార్‌ ఉత్పత్తిదారులు తెలిపారు. త్వరలో తదుపరి సమావేశాన్ని నిర్వహిస్తామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ తెలిపారు.  

విద్యుత్‌ టారిఫ్‌లపై ఎవరి నిర్ణయం ఉండదు : చంద్రబాబు
సాక్షి, అమరావతి: విద్యుత్‌ టారిఫ్‌ నిర్ణయంలో ఎవరి ప్రమేయం ఉండదని, పద్ధతి ప్రకారం ధరల నిర్ణయం ఉంటుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. టారిఫ్‌ నిర్ణయం స్వల్పకాలిక, దీర్ఘకాలికంగా ఉంటుందన్నారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్స్‌లో సోమవారం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీఏలను రద్దు చేయొద్దని కేంద్ర ఇంధన శాఖ కోరిందని, మంత్రివర్గం ఖరారు చేసిన తర్వాతే అవి అమల్లోకి వస్తాయని తెలిపారు.
 
పీపీఏలను సమీక్షించాల్సిందే: సీపీఎం
రాష్ట్ర ప్రజలపైన, ప్రభుత్వ ఖజానాపైన భారాన్ని తగ్గించడానికి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కేంద్రం పీపీఎలను సమీక్షించి ప్రజలకు విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement