2022 సంవత్సరం ఏపీలోని సీఎం జగన్ ప్రభుత్వానికి కీలకంగా మారింది. కోవిడ్ కష్టాలు సంపూర్ణంగా దాటిన తర్వాత వైఎస్ జగన్ తన దక్షత, సమర్థతను ఈ సంవత్సరంలో నిరూపించారు. విభజన మిగిల్చిన కష్టాలు.. కోవిడ్ తెచ్చిన కష్టాలను అధిగమిస్తూ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్. విప్లవాత్మక సంస్కరణలు, అధికార వికేంద్రీకరణతో ప్రతి గడప దగ్గరకూ పరిపాలనను తీసుకెళ్ళారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుతున్నారు వైఎస్ జగన్.
సంక్షేమానికి పెద్ద పీట
2022వ సంవత్సరం ప్రారంభమైన తొలిరోజే తన పాలన కేరాఫ్ క్రెడిబిలిటీ అని నిరూపించేలా సీఎం జగన్ వైఎస్సార్ పెన్షన్ కానుకను 2500 రూపాయలకు పెంచి రాష్ట్రంలో అవ్వా తాతలకు అమితమైన సంతోషాన్ని కలిగించారు. ఈ ఏడాది ముగిసేనాటికి అదే వైఎస్సార్ పెన్షన్ కానుక 2750కి పెంచి జనవరి ఒకటో తేదీని 62 లక్షల 31 వేల మంది లబ్ధిదారులకు అందించనున్నారు. ఇన్ని లక్షల మందికి పెన్షన్‌లు ఇస్తున్న రాష్ట్రం కానీ, ఇంత మొత్తం పెన్షన్ ప్రతీ నెలా అందిస్తున్న ముఖ్యమంత్రి కానీ ఈ దేశంలో వైఎస్ జగన్ తప్ప ఇంకొకరు లేకపోవడం విశేషం. పేదరిక నిర్మూలనకు, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపడం కోసం సీఎం వైఎస్ జగన్ ఈ ఏడాదంతా అన్ని సంక్షేమ పథకాలను చెప్పిన తేదీ ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అందించి చూపించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా డిబిటి, నాన్ డిబిటి ద్వారా సుమారు 3 లక్షల 20 వేల కోట్లను ప్రజలకు అందించారు. అందులో 2022వ సంవత్సరంలోనే లక్ష కోట్ల వరకు డిబిటి, నాన్ డిబిటి సంక్షేమ పథకాలను అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం ఇప్పటికే అమలు చేశారు వైఎస్ జగన్.
విద్యార్థులకు పెద్దన్నగా సీఎం జగన్
ఈ ఏడాది విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టి అమలు చేశారు. విద్యా రంగంలో జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల 48 వేలమందికి 6500 కోట్లు అందించారు. జగనన్న వసతి దీవెన 18 లక్షల 77 వేల మందికి అందించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 24 లక్షల 74 వేల మంది విద్యార్థుల తల్లులకు లబ్ధి చేకూర్చారు. ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ బిడ్డ అయినా, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎంత పెద్ద చదువైనా ఉచితంగా అందించాలన్న సంకల్పంతో విద్యా దీవెనను అమలు చేశారు. స్కూల్ పిల్లలకు జగనన్న విద్యాకానుక 47 లక్షల 40 వేల మందికి అందించారు. జగనన్న గోరుముద్ద ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 43 లక్షల 26 వేల మంది పిల్లలకు పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు డిజిటల్ విద్యని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ ఓ వినూత్న పథకాన్ని ప్రారంభించారు. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను అందించారు.
అన్నదాతలకు అన్నింటా అండ
తన ప్రభుత్వానికి వ్యవసాయ రంగమే తొలి ప్రాధాన్యం, ఇది రైతు ప్రభుత్వం అని తొలి కేబినెట్‌లోనే ప్రకటించిన వైఎస్ జగన్ ఈ ఏడాది కూడా వ్యవసాయ రంగానికి పెద్ద పీటవేశారు. రైతుకి విత్తనం నుండి విక్రయం వరకు అండగా నిలవడమే కాదు విపత్తు కాలంలో కూడా అండగా నిలిచారు. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను రైతులకు ప్రతీ గ్రామంలోను వన్ స్టాప్ సెంటర్‌గా ఆవిష్కరింపచేశారు. 52 లక్షల 38 వేల మందికి వైఎస్సార్ రైతు భరోసాతో ఈ ఏడాది పెట్టుబడి సహాయాన్ని చెప్పిన మాట ప్రకారం అందించింది ప్రభుత్వం. 65 లక్షల 65 వేల మంది రైతులకు ఉచిత పంట రుణాలను అందించారు. 44 లక్షల 27 వేల మందికి వైఎస్సార్ ఉచిత పంటల భీమా పథకాన్ని, అలానే 20 లక్షల మంది రైతులకు ఇన్ పుడ్ సబ్సిడీని ఈ ఏడాది అందించింది.
రైతుకు పూర్తి భరోసా
రైతు భరోసా కేంద్రాలు ఈ ఏడాది అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాయి. రైతులకు మేలు చేసే ఉత్తమ ఆవిష్కరణగా కేంద్ర ప్రభుత్వం ఏపీలోని రైతు భరోసా కేంద్రాలను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ అవార్డు కోసం ప్రతిపాదించింది. అంతేకాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా రైతు భరోసా కేంద్రాల మోడల్ ని అనుసరించాలని నీతి ఆయోగ్ స్వయంగా సూచించిన అరుదైన ఘటన ఈ ఏడాదే చోటు చేసుకుంది. అలానే రైతు భరోసా కేంద్రాలను ఈ ఏడాది రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన ధాన్యాన్ని రైతుల నుండి నేరుగా మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. దీని వలన రైతులందరికీ దళారుల నుండి విముక్తి లభించింది. ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంది. రాష్ట్రంలోని ఐదు నదులు ఒకేసారి పొంగి పొర్లిన అరుదైన రికార్డ్ నెలకొంది. వందేళ్ల తరువాత ఇలాంటి రైతు సానుకూల పరిస్థితి వచ్చింది. రైతున్నకు సీఎం జగన్ అండగా నిలవడం, ప్రకృతి కరుణించడంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సగటున 13 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. ఒక్క వరిలోనే 9 లక్షల టన్నుల వృద్ధి నమోదైంది.
అక్కా చెల్లెమ్మలకు చేయూత
మహిళా సాధికారతలో తిరుగులేని ప్రభుత్వంగా ఈ ఏడాది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. దాంతో పాటుగా మహిళలకు నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రులుగా ఆర్కే రోజా, తానేటి వనిత, విడదల రజని, ఉషాశ్రీ చరణ్‌లకు అవకాశం కల్పించారు. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలకు ప్రాధాన్యం గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇవ్వలేదు. ఇక మహిళల సాధికారత కోసం కోటి రెండు లక్షల మంది డ్వాక్రా మహిళలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అందించారు. 24 లక్షల 95 వేల మంది 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు వారి కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారు. 78 లక్షల 74 వేల మంది మహిళలకు వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని ఈ ఏడాది ఓ విడత నిధులను తిరిగి చెల్లించారు.
రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణం
మహిళల సొంతింటి కలను నిజం చేసేలా ఈ ఏడాది 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇక వైద్య రంగం చరిత్రలో కనీ వినీ ఎరుగని మార్పు తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. ఆరోగ్య శ్రీ పథకాన్ని ఈ ఏడాది 2400 నుండి 3,260 ప్రొసీజర్లకు వైద్యం అందించే స్థాయికి విస్తరించారు. మరో వైపు యూరప్ దేశాల్లో మాత్రమే ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం ట్రయల్ రన్ ప్రతీ పీహెచ్‌సీ పరిధిలోనూ అమలవుతోంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కోసం కొత్తగా 104 వాహనాలను, మందులను, ల్యాబ్ ఎక్విప్‌మెంట్ కొనుగోలు చేయడంతో పాటు డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించారు. ప్రతీ కుటుంబానికి త్వరలో ప్రభుత్వ డాక్టర్ సేవలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి రానున్నాయి.
ఆంధ్ర అభివృద్ది పథం
ఇక అభివృద్ధిలో ఈ ఏడాది సీఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతాలు సృష్టించింది. పారిశ్రామిక రంగం, ఎగుమతుల రంగం, నిర్మాణ రంగం, సేవా రంగం, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లన్నీ ఊపందుకున్నాయి. వరుసగా రెండో ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎగుమతుల రంగంలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. మరో వైపు GSDP గ్రోత్ లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి ఒక్క ఎనర్జీ రంగంలోనే ఈ ఏడాది లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారు. దేశంలోనే దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన అదాని గ్రూప్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతోంది. అదానీతో పాటు అమెజాన్, ఎటిఎస్, ఇన్ఫోసిస్, టాటా, ఆదిత్య బిర్లా వంటి పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.
ఇవిగో ప్రశంసలు
సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఈ ఏడాది పలు దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు ప్రశంసించడం విశేషం. టెక్ మహీంద్రా సీఇవో సీపీ గుర్నానీ, ఐటీసీ సీఈఓ సంజీవ్ పురి, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర పలువురు పారిశ్రామికవేత్తలు ప్రత్యేకంగా సీఎం జగన్ పారిశ్రామిక ఫ్రెండ్లీ విధానాలను, పారదర్శక ప్రభుత్వ పాలనను ప్రశంసించారు. ఇక అప్పుల విషయంలో కూడా ప్రతిపక్షాలు చెంప చెళ్ళుమనేలా రిజర్వ్ బ్యాంకు లెక్కలను బయటపెట్టింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు 2 లక్షల 29 వేల 333 కోట్లని ప్రకటించింది. సీఎం జగన్ మూడున్నరేళ్ల పాలనలో అది 3 లక్షల 60 వేల 333 కోట్లకు చేరిందని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. అంటే సీఎం జగన్ పాలనలో కేవలం లక్షా 30 వేల కోట్ల అప్పు మాత్రమే చేసిందని తెలిపింది. కానీ రోజూ చంద్రబాబు, ఎల్లో మీడియా 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అప్పంటూ కొట్టిన డప్పంతా సుద్ద తప్పని తేలింది. అప్పుల పెరుగుదల శాతం కూడా చంద్రబాబు పాలనలో ఏడాదికి 19 శాతం సగటు ఉంటే సీఎం జగన్ పాలనలో సగటు 15 శాతానికి తగ్గించారు. ఇలా అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి దిశగా, దుబారాను నియంత్రిస్తూ, అసలు సిసలైన అభివృద్ధి మార్గంలో సీఎం జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకెళుతోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment