నాలుగేళ్లు నిండిన వైఎస్సార్‌సీపీ జనరంజక పాలన | Ysrcp Government Has Been Completed 4 Years of Governance says Vijayasai Reddy | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమమే పరమావధిగా ఐదో సంవత్సరంలోకి జగన్‌ ప్రభుత్వం

Published Mon, May 29 2023 11:20 PM | Last Updated on Mon, May 29 2023 11:23 PM

Ysrcp Government Has Been Completed 4 Years of Governance says Vijayasai Reddy - Sakshi

నవ్యాంధ్ర ప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనకు నేటితో నాలుగు సంవత్సరాలు నిండుతున్నాయి. వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్న సుపరిపాలన  2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగుబెడుతోంది. ఈ నాలుగేళ్లలో దాదాపు ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలు గతంలో అంటే-1953 అక్టోబర్‌ 1–1956 అక్టోబర్‌ 31 మధ్యన (నాటి ఆంధ్ర రాష్ట్రంలో) గాని లేదా 1956 నవంబర్‌ 1–2014 జూన్‌ 1 మధ్యన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో) గాని కనిపించని ప్రభుత్వ జన సంక్షేమ పథకాలను, సర్వోతోముఖ ప్రగతిని స్వయంగా చూశారు. 

పేద ప్రజలు, బలహీనవార్గాల అభివృద్ధికి పెద్ద పీఠ వేసి అన్ని వర్గాల ప్రజలు చేయీ చేయి కలిపి ముందుకు సాగడానికి వైఎస్సార్‌సీపీ సర్కారు 2019 మే 30 నుంచీ నిజాయితీగా చేసిన ప్రయత్నాలకు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2004–2009 మధ్య జననేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాలనలో మాత్రమే రాష్ట్ర సర్కారు ఇలాంటి ప్రజాసంక్షేమానికి అవసరమైన పథకాలు రూపొందించి అమలు చేసింది. 

2014–2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన సాగిన ఐదేళ్ల పాలనతో కుదేలైన ఏపీ ప్రజానీకాన్ని ఆదుకోవడానికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మరుక్షణం నుంచే జగన్‌ గారు ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపైనే వృద్ధ్యాప్య పింఛన్లను పెంచుతూ ఫైలుపై సంతకం చేశారు. ఇలా మొదలైన పరిపాలనలో ఇప్పటికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సర్కారు తన ఎన్నికల వాగ్దానపత్రంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసింది. 

ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేశామని ఈ నెల 23 సాయంత్రం ప్రియతమ ముఖ్యమంత్రి ట్విటర్‌ ద్వారా చేసిన ప్రకటన అక్షర సత్యం. మరోసారి తెలుగు ప్రజలకు సేవచేయడానికి ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 175 గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్న జగన్‌ గారి మాటలు వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమేగాక క్షేత్రస్థాయిలో పాలకపక్షానికి ప్రజల అనుకూల స్థితిని ప్రతిబింబిస్తున్నాయి. 

పాలకపక్షంపై ప్రజల్లో అనుకూలతే
సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా నాలుగు సంవత్సరాల పరిపాలన తర్వాత ఏ ప్రభుత్వమైనా ప్రజల్లో వ్యతిరేకతను, అసంతృప్తిని ఎదుర్కొంటుంది. అలాంటిది ఏపీలో 4 సంవత్సరాలుగా కొనసాగుతున్న రాష్ట్ర సర్కారు పాలనపై జనామోదం నిరంతరం వ్యక్తమౌతూనే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన పంచాయతీ, పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో, శాసనమండలికి జరిగిన అన్ని రకాల ఎన్నికల్లో జనం తమ పాలకపక్షానికి నీరాజనం పట్టారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జయాపజయాలపై కన్నా అన్ని వృత్తులు, రంగాల్లో ఉన్న ప్రజల ఆయురారోగ్యాలకే ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న పథకాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. సంక్షేమ పథకాలను నగదు బదిలీ ప్రక్రియ ద్వారా అమలు చేయడం వల్ల అవినీతికి, అక్రమాలకు తావు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్ల రూపాయల సహాయం ఆంధ్ర ప్రజానీకానికి ఇంత సాఫీగా అందడం వైఎస్సార్‌సీపీ హయాంలోనే మొదటిసారి. ప్రతిపక్షాల అభాండాలను, అడ్డంకులను విజయవంతంగా అధిగమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రగతిపథంలో ముందుకు సాగడం దేశంలోనే అనేక రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. 

అనేక రాష్ట్రాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమ పథకాలను, వాటి అమలు తీరును అధ్యయనం చేయడానికి రావడం రాష్ట్రానికే గర్వకారణం. నిర్ణీత కాలానికి ఎన్నికలు జరిగే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా అత్యధిక పాలక పార్టీలు వచ్చే ఎన్నికల్లో విజయం గురించే ఆలోచిస్తాయి. ఇలాంటి పార్టీలకు తమ గెలుపు గురించి యావే తప్ప ప్రజ ల గోడు పట్టదు. కాని, వైఎస్పార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పేదల సర్కారు, ఆర్థిక సాయం అవసరమైన అన్ని వర్గాల మేలు కోసమే పరిపాలన సాగిస్తోంది.

కొత్త పథకాలకు రూపం ఇస్తూ, ప్రజా సేవకు మరోసారి అంకితం కావడానికి రాజకీయంగా తన కృషి కొనసాగిస్తోంది. నిరంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల మధ్యన తిరగడమేగాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లతో ఎల్లవేళలా ప్రజలకు సేవలందించడం తెలుగునాట కొత్త అధ్యాయానికి తెరతీసింది. ప్రజల మేలు కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ వ్యవస్థలన్నీ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ గారు చెప్పినట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 స్థానాలు గెలుచుకునే దిశగా పయనించడం తెలుగునాట ప్రజలకు శుభ పరిణామం.


-విజయ సాయిరెడ్డి, వైఎస్సార్సిపి, రాజ్యసభ సభ్యులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement