చింతూరు :‘సొమ్మొకడిది సోకొకడిది’ అన్న సామెత విలీన మండలాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఆంధ్రాలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను వినియోగించుకుంటున్న తెలంగాణ అధికారులు అదే విద్యుత్తును విలీన మండలాలకు సరఫరా చేస్తూ ఈ మండలాల్లో విద్యుత్తు ద్వారా వస్తున్న ఆదాయాన్ని తన్నుకుపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, నెల్లిపాక మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమయ్యాయి. చింతూరు మండలంలోని లోయర్ సీలేరు ప్రాజెక్టు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం కూడా ఇదే జిల్లాలో విలీనమైంది. ఈ కేంద్రంలోని నాలుగు యూనిట్ల ద్వారా నిత్యం 460 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేంద్రం ద్వారా ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ పరిధిలోని సీతారామపట్నం 220 కేవీ సబ్‌స్టేషన్‌కు 100 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరిగేది. ఇదే విద్యుత్తును జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వినియోగించేవారు. ఇక్కడి నుంచి భద్రాచలం సమీపంలోని ఎటపాక 132 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా జరిగి అక్కడి నుంచి విలీన మండలాలైన నెల్లిపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు సరఫరా చేసేవారు. ఇప్పుడీ మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనా ఇప్పటి వరకూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది. కాగా విలీన మండలాల్లో చాలావరకు ప్రభుత్వ శాఖల విభజన ప్రక్రియ పూర్తయి ఆంధ్రా అధికారుల పాలన కొనసాగుతున్నా విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో విలీన మండలాల్లో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆధీనంలో ఇక్కడ విద్యుత్ సరఫరా జరిగేది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాలు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోకి వెళ్లాల్సి ఉండగా, పైస్థాయిలో విభజన ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ మండలాల్లో ఇంకా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిబ్బందే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
విద్యుత్ శాఖ విభజన జరగకే..
పవర్ కంపెనీల నడుమ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాక పోవడంతో విలీన మండలాలకు సంబంధించి ప్రతినెలా సుమారు రూ.60 లక్షల ఆదాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోల్పోతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, నెల్లిపాక, వీఆర్‌పురంలలో గృహావసరాలకు సంబంధించి 30 వేలు, వ్యవసాయానికి 1124, కమర్షియల్‌కు సంబంధించి 1100, ఇండస్ట్రియల్‌కు సంబంధించి 22, ప్రభుత్వ శాఖలకు సంబంధించి 350 విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటి ద్వారా బిల్లుల రూపంలో ప్రతినెలా సుమారు రూ.60 లక్షల వరకు వసూలవుతుంటాయి. ప్రస్తుతం ఈ సొమ్ములన్నీ తెలంగాణ ప్రాంతంలోని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆధీనంలోనే వసూలు చేస్తూ తెలంగాణ కు తీసుకెళుతున్నారు. తద్వారా ఆంధ్రా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. అన్నిశాఖల మాదిరిగానే విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ చేసి ఉంటే ప్రభుత్వానికి ఈపాటికే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరి ఉండేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి విద్యుత్‌శాఖకు సంబంధించి విభజన ప్రక్రియ పూర్తిచేయాలని విలీన మండలాల ప్రజలు కోరుతున్నారు.
విభజన ప్రక్రియ కొనసాగుతోంది..
విద్యుత్‌శాఖకు సంబంధించి కూడా విభజన ప్రక్రియ కొనసాగుతోందని లోయర్ సీలేరు జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజనీర్ నాగభూషణరావు ‘సాక్షి’కి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే మాదిరిగానే ప్రస్తుతం పొల్లూరు కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతోందని, ఆంధ్రా, తెలంగాణ ల ఫీడర్లు మారే వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశముందన్నారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా చేస్తున్నామనే దానిపై జలవిద్యుత్ కేంద్రం వద్ద ఇంటర్‌స్టేట్ మీటర్‌ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా తెలంగాణ కు ఎంత విద్యుత్ సరఫరా జరుగుతుందో నమోదవుతుందని తెలిపారు. ఈ నమోదు ఆధారంగా ప్రస్తుతం తమ నుంచి వాడుకుంటున్న విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం నుంచి సొమ్ములు వసూలు చేసే అవకాశముందన్నారు. కాగా విలీన మండలాల్లో ఇప్పటికే విద్యుత్ సిబ్బందిని నియమించినట్లు రంపచోడవరం ఏడీఈ లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యుత్ పంపిణీకి సంబంధించి విభజన ప్రక్రియ పూర్తికాగానే విలీన మండలాల్లో కూడా తమ సిబ్బందే బిల్లులు వసూలు చేస్తారని చెప్పారు.
కరెంటు ఏపీది.. కాసులు తెలంగాణవి
Published Mon, Mar 9 2015 12:41 AM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM
Advertisement
Advertisement