నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌ | Cm Jagan Inauguration To Power Substations Updates | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం: సీఎం జగన్‌

Published Tue, Nov 28 2023 12:25 PM | Last Updated on Tue, Nov 28 2023 1:39 PM

Cm Jagan Inauguration To Power Substations Updates - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సబ్‌స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని, ఇవాళ ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. రైతులకు 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యుత్‌ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్‌ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టింది. సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. 
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నాం. 14 జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్‌ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం. 12 సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభిస్తున్నాం, 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం

ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ ప్రతి గ్రామానికి ప్రతిరైతుకు ఇచ్చే వ్యవస్థను క్రియేట్‌ చేస్తున్నాం. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. రూ.1700 కోట్ల తో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తున్నాం. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.4లకే యూనిట్‌ ధరతో సెకీతో ఒప్పందం చేసుకున్నాం. మరో 25 సంవత్సరాలపాటు రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. దీనివల్లరాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’’ సీఎం వివరించారు.

‘‘దాదాపు రూ.3099 కోట్లతో సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం, ఇప్పటికే కొన్నింటిని ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నాం. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. అవేరా స్కూటర్స్‌ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి.

తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు వస్తాయి. 28 సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. హెచ్‌పీసీఎల్‌తో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం పెడుతున్నాం. సోలార్‌,విండ్‌, పీఎస్పీ, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను వీరు పెడుతున్నారు. దాదాపుగా 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది. పలు విద్యుత్‌ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా  పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement