
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లు
రాత్రి 10 గంటల సమయంలో అత్యవసరంగా విచారణ జరిపిన ధర్మాసనం
అదుపులోకి తీసుకున్న నిందితులను సీసీటీవీలున్న స్టేషన్‌లోనే ఉంచాలని ఆదేశం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోలీసుల తీరుపై హైకోర్టు మరోసారి విస్మయం వ్యక్తం చేసింది. 2023లో ఘటన జరిగితే.. రెండేళ్ల తరువాత ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయడమేకాక నిందితులంటూ ఇద్దరు వ్యక్తులను ఇప్పుడు అదుపులోకి తీసుకోవడాన్ని కూడా ప్రశ్నించింది. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఇప్పుడే మేల్కొన్నారా? అని ప్రశ్నించింది. అసలేం జరుగుతోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అదుపులోకి తీసుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చింతపల్లి అల్లా భక్షు, చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను ఆదివారం ఉదయం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేంత వరకు సీసీ కెమెరాలు పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో ఉంచాలని పల్నాడు జిల్లా మాచవరం పోలీసులను ఆదేశించింది.
ఆదివారం ఉదయం వరకు వారిద్దరూ సీసీ కెమెరాలో కనిపిస్తూనే ఉండేలా చూడాలని తేల్చిచెప్పింది. ఒకవేళ మాచవరం పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు లేకపోయినా, అవి పనిచేయకపోయినా అల్లా భక్షు, పెద్ద సైదాను సమీపంలో సీసీ కెమెరాలున్న మరో పోలీస్ స్టేషన్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంభజడల మన్మథరావు ధర్మాసనం శనివారం రాత్రి 10 గంటలకు ఉత్తర్వులు జారీ చేసింది.
అక్రమ నిర్బంధంపై ‘హెబియస్ కార్పస్’
తన కుమారుడు చింతపల్లి అలియాస్ సత్తెనపల్లి పెద్ద సైదాను, తన మేనల్లుడు చింతపల్లి అల్లా భక్షును పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, వారిని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన షేక్ చింతపల్లి నన్నే, గుంటూరు జానీబాషా వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం వీరిద్దరూ అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సార్వత్రిక ఎన్నికల తరువాత పెద్ద సైదా, అల్లా భక్షు గ్రామం విడిచి బయట ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు చాలామంది ప్రజలు సైతం గ్రామం విడిచివెళ్లారన్నారు. తెలంగాణలో ఉన్న సైదా, అల్లా భక్షును అకస్మాత్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వీరిద్దరి అరెస్ట్ గురించి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. వారి ఆచూకీ కూడా చెప్పడం లేదని వివరించారు. ఓ ప్రైవేటు ఎస్టేట్‌లో పెద్ద సైదాను, అల్లా భక్షును దాచేపల్లి పోలీసులు నిర్బంధించినట్టు తమకు తెలిసిందన్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా ఇలా నిర్బంధించడం చట్ట విరుద్ధమన్నారు.
2023లో ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశాం: ఎస్‌జీపీ
పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. నిందితులిద్దరూ తీవ్ర నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిపై మాచవరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారన్నారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో వారిని అరెస్ట్ చేశారన్నారు. ఆదివారం ఉదయం వారిని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరుస్తారని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వారిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు విష్ణుతేజ సమాధానం ఇవ్వలేదు. అసలు ఘటన ఎప్పుడు జరిగిందని ధర్మాసనం తిరిగి ప్రశ్నించింది.
17.5.2023న ఘటన జరిగిందని విష్ణుతేజ చెప్పారు. దీనిపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రెండేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారా? అంటూ అమితాశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేమిటని, అసలు ఏం జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదుదారు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకుంటే తాము చేయగలిగిందేమీ లేదని విష్ణుతేజ చెప్పగా.. రెండేళ్ల తరువాత ఫిర్యాదుదారు ఆకస్మాత్తుగా మేల్కొన్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.