
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.8,500 కోట్లతో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తలపెట్టారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. తొలి విడతలో నిర్మాణం పూర్తయిన ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ఈ నెల 15వ తేదీన ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.
విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సీఎం జగన్ వస్తారని, ఇక్కడి నుంచే రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. వచ్చే సంవత్సరం మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత సంవత్సరానికి మిగతా ఏడు కాలేజీలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.
విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం పర్యటనకు ఏర్పాట్లను ఆమె శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. సీఎం పర్యటనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి రజిని తెలిపారు.