మన వైద్య రంగం దేశానికే దిక్సూచి  | Chief Minister YS Jagan Mohan Reddy Inaugurates New Medical Colleges | Sakshi
Sakshi News home page

మన వైద్య రంగం దేశానికే దిక్సూచి 

Published Sat, Sep 16 2023 3:28 AM | Last Updated on Sat, Sep 16 2023 7:50 AM

Chief Minister YS Jagan Mohan Reddy Inaugurates New Medical Colleges - Sakshi

కొన్ని స్టేట్‌మెంట్స్‌ ఎప్పుడూ నా మనసును తడుతుంటాయి. ఈవేళ అలా ‘నాట్‌ ఆల్‌ ఏంజిల్స్‌ హేవ్‌ వింగ్స్‌.. సమ్‌ హేవ్‌ స్టెతస్కోప్స్‌’  (దేవతలంటే రెక్కలున్న వాళ్లు మాత్రమే కాదు.. స్టెతస్కోప్స్‌ ఉన్న వాళ్లు కూడా) అనే కోట్‌ నా మనసుకు తట్టింది. అందుకే ఈ కళాశాలలో అడుగు పెట్టినప్పుడు దీనిని బోర్డుపై రాసి సంతకం పెట్టాను. కీప్‌ దిస్‌ ఇన్‌ మైండ్‌. మీరంతా మంచి డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ డాక్టర్లు, సూపర్‌ స్పెషాలిటీ డాక్లర్లు అవుతారన్న నమ్మకం నాకు ఉంది. ఆల్‌ ద వెరీ బెస్ట్‌.
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నాలుగేళ్లలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, కార్యక్రమాల వల్ల మన వైద్య రంగం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రూ.8,480 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మాణం చేపట్టిన 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో తొలి దశలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఐదు కళాశాలలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని స్వయంగా, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. 

విశాఖపట్నం నుంచి ఉదయం 10:30 గంటలకు విజయనగరం మెడికల్‌ కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల అంతటా కలియదిరిగి పరిశీలించిన తర్వాత విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టామని, అందులో ఇప్పటికే పూర్తి అయిన ఐదు మెడికల్‌ కాలేజీల్లో ఈరోజు పిల్లలు అడ్మిషన్లు తీసుకొని డాక్టర్లుగా అడుగులు వేస్తున్నారన్నారు. వైద్య విద్య అభ్యసించాక, అందరూ మంచి సేవల ద్వారా గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. మనసున్న డాక్టర్లను సమాజానికి అందించడమే లక్ష్యంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  
ప్రతి జిల్లాలో టెరిషరీ కేర్‌... 
ఈ రోజు 5 మెడికల్‌ కాలేజీలు.. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభించాం. వచ్చే ఏడాది మరో ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు చేస్తాం. మళ్లీ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అడ్మిషన్‌ స్థాయిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా 17 మెడికల్‌ కాలేజీలను తీసుకు రాగలుగుతున్నాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేశాం. ప్రతి జిల్లా స్థాయిలో ఒక మెడికల్‌ కాలేజీ పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనివల్ల టెరిషరీ కేర్‌ (స్పెషలిస్టు డాక్టర్లతో అత్యున్నత స్థాయి వైద్యం) అనేది ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయిలోకి మనం తీసుకు పోగలుగుతాం. 

ఎప్పుడైతే మెడికల్‌ కాలేజీ అందుబాటులో ఉంటుందో అప్పుడు అక్కడి ప్రొఫెసర్లు, పోస్ట్‌ గ్రా­డ్యు­యేట్‌ స్టూడెంట్లు నిత్యం అందుబాటులో ఉంటారు. దీనివల్ల వైద్య సేవల్లో గొప్ప మార్పు ఉంటుంది. ఇలా టెరిషరీ కేర్‌ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఇది ఒక ఎత్తయితే మరోవైపు వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇన్‌స్టిట్యూషన్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయగలుగుతున్నాం. 

అదనంగా ఎంబీబీఎస్‌ సీట్లు 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత వరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. కేవలం ఈ నాలుగేళ్ల కాలంలో దేవుడి దయతో 13 జిల్లాలను 26 జిల్లాలుగా అధికార వికేంద్రీకరణ చేయగలిగాం. అలాగే, కొత్తగా ఏర్పాటు చేసే 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 28 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు అందుబాటులో ఉండే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. 

ఈ 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వీటివల్ల 2,250 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎంబీబీఎస్‌ సీట్లు 2,185 కాగా, ఈ 17 మెడికల్‌ కాలేజీలు రావడంతో ఏకంగా 4,735కు పెరుగుతాయి.  

ఇప్పటికే ఉన్న కాలేజీల ఆధునికీకరణ 
రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్‌ కాలేజీలన్నింటిలోనూ మౌలిక సదుపాయాలన్నీ అప్‌గ్రేడ్‌ చేయగలిగాం. ‘జీరో వేకెన్సీ’ పాలసీ తీసుకొచ్చి గతంలో పెండింగ్‌లో ఉన్న పోస్టులన్నీ భర్తీ చేయతలపెట్టాం. తద్వారా దాదాపు ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 17 కొత్త మెడికల్‌ కాలేజీల ద్వారా భవిష్యత్‌లో మరో 2,737 పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయి. 

ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తోందంటే మీరంతా (వైద్య విద్యార్థులు) మంచి డాక్టర్లు కావాలి. రాష్ట్ర ప్రజలకు ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలనేదే నా ఆశయం. యాజ్‌ ఏ లీడర్, విజనరీస్, దిస్‌ ఈజ్‌ అవర్‌ డిజైర్‌. అందుకే ఇదంతా మీకు వివరిస్తున్నాను. 

ఈ రోజు ప్రారంభమవుతున్న ఐదు మెడికల్‌ కాలేజీల్లో దాదాపు 750 ఎంబీబీఎస్‌ సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు. రేపటి సంవత్స­రం పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదన­పల్లె, ఆదోని ఇలాంటి బ్యాక్‌వర్డ్‌ ఏరియాల్లో కూడా మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. తద్వారా 2024–25లో మరో 750 మెడికల్‌ సీట్లు వస్తాయి. ఆ తర్వాత 2025–26లో గిరిజన ప్రాంతాలు, టెరిషరీ కేర్‌ దొరకడం కష్టంగా ఉన్న పార్వతీ­పురం, నర్సీపట్నం లాంటి చోట్ల మరో ఏడు మె­డికల్‌ కాలేజీలు రాబోతున్నాయి. తద్వారా 1,050 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 

నర్సింగ్‌ కాలేజీలూ అభివృద్ధి  
గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 1,090 నర్సింగ్‌ సీట్లు ఉన్నాయి. కొత్తగా 18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకొస్తున్నాం. వీటి ద్వారా మరో 1,200 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 2,090 సీట్లు ఉంటాయి. 

రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఎన్‌ఏబీహెచ్‌ (నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ హాస్పిటల్స్, హెల్త్‌ కేర్‌ ప్రొవైడర్స్‌), ఎన్‌ఎంసీ (నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) మార్గదర్శకాలకు అనుగుణంగా నాడు–నేడు ద్వారా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు రూ.3,820 కోట్లు వెచ్చిస్తున్నాం. 

జాతీయ స్థాయి కన్నా ఎంతో మెరుగు 
గతంలో కనివినీ చూడని విధంగా రాష్ట్రంలో ప్ర­తి మండలానికి కనీసం ఒక 108 వాహనం, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా ఏర్పాట్లు చేశాం. 1,514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం. తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లతో కలిపితే మొత్తం 2,204 అంబులెన్స్‌ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతు­న్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. 

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో ఒక్క వైద్య, ఆరోగ్య విభాగంలోనే 53,126 మందిని రిక్రూట్‌ చేశాం. జాతీయ సగటును గమనిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల ఖాళీలు 61 శాతం ఉన్నాయి. మన రాష్ట్రంలో అది 3.96 శాతం మాత్రమే. ఒక స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పెట్టి, నో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి అసలు ఎక్కడా ఖాళీలు ఏర్పడక ముందే భర్తీ చేయాలని వెంట పడుతున్నాం. 

జాతీయ స్థాయిలో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో నర్సు పోస్టుల ఖాళీలు 27 శాతం ఉంది. మన రాష్ట్రంలో జీరో (సున్నా శాతం). జాతీయ స్థాయి­లో సగటున ప్రభుత్వాస్పత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషి­యన్ల ఖాళీలు 33 శాతం. మన రాష్ట్రంలో జీరో. 

పేదవాళ్లకు ఉపయోగపడాలి 
వైద్య ఆరోగ్య రంగంలో మంచి డాక్టర్లు రావాలి. మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మీలో (వైద్య విద్యార్థుల్లో) మంచి మనసు రావాలి. మీరంతా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలనేదే నా ఆశయం. ఇప్పటి వరకు బటన్ నొక్కితే డీబీటీ పద్ధతిలో 2.35 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేద ప్రజల ఖాతాల్లోకి వేయగలిగాం. ఎలాంటి లంచాలకు, ఎక్కడా వివక్షకు చోటు లేకుండా చేయగలిగాం.

ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేలా వ్యవస్థను గడప వరకు తీసుకుపోగలిగాం. రేషన్‌ కార్డు, రేషన్ బియ్యాన్ని ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి, ఇంటి స్థలం లేని వారెవరైనా ఉన్నారా అని వెతికి, అప్లికేషన్‌ పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. 22 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఎవరికి ఏ రకమైన సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి అడిగి మరీ సమకూరుస్తున్నాం. ఇటీవల జగనన్న సురక్ష కార్యక్రమంలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం.

గతానికి ఇప్పటికీ ఎంతో తేడా 
గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదని చాలా మంది అనుకుంటారు. కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ (వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌), జీఎంపీ (గుడ్‌ మాన్యుఫాక్టరింగ్‌ ప్రాక్టీసెస్‌) నిర్దేశించిన మందులు మాత్రమే ఉంచాం. ఆరోగ్యశ్రీ సేవలు మనం రాకముందు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు ఉంటే ఈరోజు 3,255 ప్రాసీజర్లకు విస్తరించాం.

అన్ని రకాల క్యాన్సర్ల నుంచి కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ వరకు ఆరోగ్య శ్రీలో కవర్‌ అవుతున్నాయి. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలనే తపన, తాపత్రయంతో విస్తరిస్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ హాస్పిటళ్లు 900 ఉంటే ఈరోజు 2,285కు విస్తరించాయి. గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌ రూ.1,100 కోట్లు కూడా సరిగా లేదు. ఈ రోజు ఆ బడ్జెట్‌ దాదాపు రూ.3,600 కోట్ల వరకూ ఉంది. 

ప్రివెంటివ్‌ కేర్‌ అవసరం 
నాలుగేళ్ల మన పాలనలో ప్రణాళికా బద్ధంగా గ్రామ స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం. ఒకపక్క క్యూరేటివ్‌ కేర్, టెరిషరీ కేర్‌పై దృష్టి పెట్టాం. క్యూరేటివ్‌ కేర్‌ ఎంత అవసరమో ప్రివెంటివ్‌ కేర్‌ (ప్రమాదకరమైన వ్యాధులు, ఆరోగ్య సమస్యలు తీవ్ర స్థాయికి చేరకముందే కనుక్కొని నిరోధించడం) కూడా అంతే అవసరం.

ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా అడుగులు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటయ్యాయి. వాటిలో సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ఉంటారు. అక్కడ 105 రకాల మందులు ఇస్తారు. 14 రకాల డయోగ్నోస్టిక్‌ టెస్టులు చేస్తారు. మరో 542 అర్బన్ క్లినిక్‌లు తీసుకొచ్చాం. 

విలేజ్‌ క్లినిక్‌లను ప్రివెంటివ్‌ కేర్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ప్రతి మండలానికి కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేట్లుగా చేస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉంటారు. ఒక 104 వాహనం ఉంటుంది. ఒక డాక్టరు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటే, మరో డాక్టరు ఈ అంబులెన్స్‌లో షెడ్యూల్‌ ప్రకారం కేటాయించిన గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. ఇలా ప్రతి నెలా ఆ గ్రామానికి కనీసం రెండుసార్లు వెళ్లేట్లు చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల ఆర్నెల్ల వ్యవధిలోనే ఆ గ్రామంలో ఎవరికి ఏ రోగం ఉంది.. ఎవరికి బీపీ, షుగర్‌ వంటి సమస్యలున్నాయనేది పూర్తిగా చెప్పగలిగేలా ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చాం. 

జగనన్న ఆరోగ్య సురక్ష మరో మంచి కార్యక్రమం
ఈ రోజు మరో మంచి కార్యక్రమం దిశగా అడుగులు వేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభించాం. ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి ఆ ఇంట్లో ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా సరే 7 రకాల టెస్టులు చేస్తారు. 5 దశల్లో యాక్టివిటీ మొదలు పెట్టాం. నాలుగో దశలో హెల్త్‌ క్యాంపులు ఉంటాయి. సెప్టెంబర్‌ 30న మొదటి హెల్త్‌ క్యాంపు నిర్వహిస్తారు.

తర్వాత 45 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ హెల్త్‌ క్యాంపులు పూర్తవుతాయి. గ్రామం మొత్తం మ్యాపింగ్‌ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ రకమైన సమస్య ఉన్నా, వారికి ఉచితంగా టెస్టులు చేస్తాం. ఉచితంగా మందులు ఇవ్వబో­తున్నాం. తర్వాత హ్యాండ్‌ హోల్డింగ్‌ చేయబోతున్నాం. అది చాలా కీలకమైంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధన దిశగా అడుగులు వే­స్తున్నాం. ఇందుకు మీ అందరి సహాయ సహకా­రాలు కావాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నా." అని అన్నారు.  

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాలనాయుడు, పీడిక రాజన్నదొర, మంత్రులు విడదల రజని, బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, విజ­యనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకటచిన అప్పలనాయుడు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాసరావు, కళావతి, పుష్ప శ్రీవాణి, జోగారావు, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు పెను­మత్స సురేష్‌బాబు, విక్రాంత్, రఘు­రాజు, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి, డీసీఎంఎస్‌ చైర్‌పర్సన్‌ భావన, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.  

వ్యాధిగ్రస్తులకు పెద్దమనసుతో సాయం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని హెలిప్యాడ్‌ వద్ద అనారోగ్యంతో బాధ పడుతున్న పలువురు బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పూసపాటిరేగ గ్రామానికి చెందిన టొంపల లేఖన, బోన్‌మ్యారో మార్పిడి కోసం ఎదురు చూస్తున్న గంట్యాడ మండలం కొర్లాం గ్రామానికి చెందిన దూరి భానుప్రసాద్, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామానికి చెందిన పోలియో వ్యాధిగ్రస్తుడు పిల్లా శంకరరావు, అనుకోని ప్రమాదంతో వీల్‌చైర్‌కే పరిమితమైన జి.సిగడాం మండలం నిద్దాం గ్రామానికి చెందిన చౌదరి గణే‹Ùలు తమ అనారోగ్య సమస్యలు చెప్పుకున్నారు. వీరందరి సమస్యలను ఓపికగా విన్న సీఎం వారి భుజం తట్టి ఓదార్చారు. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున అందించాలని, మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిమిషాల వ్యవధిలో కలెక్టర్‌ నాగలక్ష్మి వారికి చెక్కులు అందజేశారు.  

ఇది కూడా చదవండి: థాంక్యూ జగనన్న.. జీవితాంతం మేం మీకు రుణపడి ఉంటాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement