చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Questioned To Chandrababu Over Medical College Seats | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యమెందుకు?: వైఎస్‌ జగన్‌

Published Sun, Sep 15 2024 3:35 PM | Last Updated on Sun, Sep 15 2024 4:08 PM

YS Jagan Questioned To Chandrababu Over Medical College Seats

సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన పాలన చేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.  పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్ల కోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పిపంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి  దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడింది అని ఘాటు విమర్శలు చేశారు.

కాగా, వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి ఎనిమిది ప్రశ్నలు సంధించారు..
1.రాష్ట్రానికి ఎంబీబీఎస్‌ సీట్లు వస్తుంటే సంతోషించాల్సింది పోయి, అవసరం లేదంటూ చంద్రబాబు గారి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం చాలా దారుణం. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసే బృహత్తర యజ్ఞానికి రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తన చేతులతో తానే భంగం కలిగించడం అత్యంత హేయం, దుర్మార్గం. పక్క రాష్ట్రాలు కొత్త మెడికల్‌ కాలేజీలు, ఎంబీబీఎస్‌ సీట్లకోసం ప్రదక్షిణాలు చేస్తున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వచ్చిన సీట్లను తిప్పి పంపడం ఏ తరహా పరిపాలనకు నిదర్శనం చంద్రబాబు?

2.నాణ్యమైన విద్య, వైద్యాన్ని ప్రజలకు ఒక హక్కుగా అందించడం అన్నది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, మంచి వైద్యం అందుకోవడానికి ఏ కుటుంబం కూడా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదు. ఈ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా తప్పించుకుంటుంది చంద్రబాబు? అలా తప్పించుకుంటే, దాన్ని ప్రభుత్వం అని అంటారా?

3.దీన్ని గుర్తించే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో రూ.8,480కోట్లతో 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించాం. దీనివల్ల ప్రభుత్వానికి ఏ రకంగా నష్టం వస్తుంది? 2023-24 సంవత్సరాల్లో 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం నిజం కాదంటారా? తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా రాష్ట్రానికి రాలేదంటారా? చాలామంది పేద పిల్లలు సీట్లు సాధించి డాక్టర్‌ చదువులు చదవడం లేదా?

4.నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం వెళ్తే ఈ ఏడాదిలోనే మరో 5 కాలేజీలు మదనపల్లె, పులివెందుల, ఆదోని, మార్కాపురం, పాడేరుల్లో మరో 750 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు పాడేరు కాలేజీని 50 సీట్లకే పరిమితం చేయడం ఏంటి? పులివెందుల కాలేజీకి ఎన్‌ఎంసీ 50 సీట్లు మంజూరు చేస్తే, వద్దంటూ లేఖ రాయడం ఏంటి? మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ పరంచేసే స్కామ్‌లకు ఆలోచన చేయడం ఏంటి?

5.కోవిడ్‌లాంటి సంక్షోభం ఉన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మెడికల్‌ కాలేజీల నిర్మాణాల కోసం రూ.2403 కోట్లు ఖర్చుచేసి, ఐదు కాలేజీల్లో క్లాసులు మొదలుపెట్టి, మరో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే బోధనకు సిద్ధం చేశాం. మీ ప్రభుత్వం కూడా క్రమంగా ఖర్చు చేసుకుంటూ వెళ్తే మిగిలిన కాలేజీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నది వాస్తవం కాదా? ఇది చేయకుండా భారం అంటూ చేతులు దులిపేసుకుని ప్రజారోగ్య సంస్థలను అమ్మేస్తారా?. ప్రైవేటు మీద మీకు అంతమోజు ఎందుకు? ప్రభుత్వ సంస్థలంటే అంత అసహ్యం ఎందుకు?

6.కొత్త మెడికల్‌ కాలేజీల నిర్వహణలో ఇబ్బందులు రాకూడదు, అదే సమయంలో పేద విద్యార్థులకు నష్టం రాకూడదన్న విధానంలో మేం సీట్లను భర్తీ చేస్తే, ఎన్నికల్లో ఓట్ల కోసం నానా రాద్ధాంతం చేశారు. అధికారంలోకి వస్తే మొత్తం సీట్లన్నీ ఫ్రీ అన్నారు. సీట్ల సంగతి  దేవుడెరుగు.. ఇప్పుడు ఏకంగా కాలేజీలనే అమ్మేస్తున్నారు. ఇది ఏరుదాటాక తెప్పతగలేయడం కాదంటారా? మోసం చేయడమే మీ నైజమని మరోసారి బయటపడింది చంద్రబాబు.

7.పార్లమెంటు నియోజకవర్గానికో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటే, అది ఆ నియోజకవర్గంలో ఉన్న ఏరియా ఆస్పత్రులకు, సీహెచ్‌సీలకు, పీహెచ్‌సీలకు, విలేజ్‌ క్లినిక్స్‌కు మార్గదర్శిగా ఉంటుంది. సూపర్‌ స్పెషాలిటీ సేవలు కూడా పేదలకు ఉచితంగా ఆ జిల్లాస్థాయిలోనే అక్కడే లభిస్తాయి. అలాంటి కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే ముందుగా నష్టపోయేది పేద విద్యార్థులే కాదు, అక్కడి ప్రజలకు కూడా. వారికి నాణ్యమైన వైద్యం అందదు సరికదా, ప్రైవేటు ఆస్పత్రులకు పోటీ లోపించి వైద్యంకోసం వసూలుచేసే ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఎప్పుడైనా ప్రైవేటుకు గవర్నమెంటు పోటీగా ఉంటేనే, రేట్లు రీజనబుల్‌గా ఉంటాయి. కాలేజీలను ప్రైవేటీకరించాలన్న మీ విధానం అందరినీ దెబ్బతీస్తుందన్న మాట వాస్తవం కాదా? అటు ప్రజలను, ఇటు పిల్లలను కోవిడ్‌ లాంటి మహమ్మారి సమయంలో ఆదుకున్నది ప్రజారోగ్య రంగమే అని గుర్తించకపోతే ఎలా చంద్రబాబు.

8.ఇకనైనా కళ్లుతెరవండి  చంద్రబాబుగారూ. వెంటనే ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవడంతోపాటు, ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోండి. మెడికల్ కాలేజీల్లో మిగిలిన పనులను పూర్తిచేసి, పేదపిల్లలకు వైద్యవిద్యను, పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురండి. మీకు చేతనైనంత మీరు ఖర్చుచేస్తూ వెళ్లండి. మీకు చేతకాకపోతే మళ్లీ మేం వచ్చిన తర్వాత అయినా పూర్తిచేస్తాం. అంతేకానీ ఇలా మెడికల్‌ కాలేజీల ప్రైవేటు పరం మాటున స్కామ్‌లు చేయడం మానుకో చంద్రబాబూ! లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని గుర్తించుకోండి’ అంటూ కామెంట్స్‌ చేశారు.

 

ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement