సాక్షి, నెల్లూరు: వేసవిలో ఎండలతో పాటు విద్యుత్ కోతలు అదేస్థాయిలో పెరుగుతున్నాయి. విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో వేలాది రూపాయల పెట్టుబడి సాగు చేస్తున్న పంటల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. పచ్చటి పంటలు, తోటలు కళ్లముందే ఎండిపోతుండడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నాలకు దిగుతున్నారు. జిల్లాలో 8.84 లక్షల గృహ కనెక్షన్లు, 71 వేల కమర్షియల్ కనెక్షన్లు, 1.35 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, పరిశ్రమలకు సంబంధించిన సర్వీసులు 41 వేల వరకు ఉన్నాయి. వేసవి తీవ్రత పెరగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. సెంట్రల్ గ్రిడ్ నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌కు 22 శాతం వాటా మాత్రమే సరఫరా అవుతోంది. ఈ క్రమంలో జిల్లాకు రోజుకు సరఫరా అవుతున్న పది మిలియన్ యూనిట్ల విద్యుత్ సరిపోవడం లేదు. ఇందులో 30 శాతం నగర ప్రజల అవసరాలకే సరిపోతోంది. దీనికి తోడు పరిశ్రమల్లోనూ వినియోగం పెరగడంతో విద్యుత్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.
ఇది ప్రధానంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యవసాయానికి రోజుకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నా, వాస్తవంగా రెండు గంటలకు కూడా ఇవ్వని పరిస్థితి. అందులోనూ పలుమార్లు ట్రిప్ చేస్తుండడంతో పొలాలకు నీరు పారని పరిస్థితి నెలకొంది. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియకపోవడంతో రైతులు నిరంతరం మోటార్ల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా నీళ్లు చాలక వరి, సజ్జ, పత్తి, బత్తాయి తదితర పంటలు నిలువునా ఎండి పోతున్నాయి. దీంతో ఆందోళనకు గురవుతున్న రైతులు విద్యుత్ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. అయినా ప్రయోజనం ఉండకపోతుండడంతో సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు. సోమవారం పొదలకూరు మండలం చెర్లోపల్లి, ఆత్మకూరు మండలం నెల్లూరుపాళెం సబ్‌స్టేషన్ల ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
కావలి నియోజకవర్గంలోని కావలి, బోగోలు తీర ప్రాంతంతో పాటు జలదంకి, దగదర్తి ప్రాంతాల్లో బెండ, వంగ, దోస, పచ్చిమిరప పంటలతో పాటు పండ్లతోటలు సాగులో ఉన్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. కోవూరు ప్రాంతంలో ప్రధానంగా వరి, కొంత మేర చెరకు, కొద్ది మంది రైతులు పత్తి సాగు చేస్తున్నారు. పలుచోట్ల కూరగాయలు, అరటి తోటలు సాగులో ఉన్నాయి. విద్యుత్ కోతల నేపథ్యంలో నీళ్లు చాలక పంటలు వాడుముఖం పట్టాయి. సర్వేపల్లిలో వరి, వేరుశనగ, సజ్జ తదితర పంటలు సాగులో ఉన్నాయి.
వందలాది ఎకరాల విస్తీర్ణంలో నిమ్మతోటలు సాగు చేస్తున్నారు. కోతల కారణంగా ఇవి ఎండిపోతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఉదయగిరి ప్రాంతంలో మొక్కజొన్న, పత్తితో పాటు సుమారు నాలుగు వేల ఎకరాల్లో బత్తాయి తోటలు సాగవుతున్నాయి. విద్యుత్ కోతల పుణ్యమాని ఇవి ఎండిపోతున్నాయి. వెంకటగిరి ప్రాంతంలో సుమారు 2 వేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నారు. ఓ వైపు నిమ్మకాయల ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నా, మరోవైపు తోటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గూడూరు ప్రాంతంలో నిమ్మతోటలతో పాటు కూరగాయల సాగు భారీగా జరుగుతోంది. విద్యుత్ కోతలు వీటిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో కాళంగినది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాల పరిధిలో బోర్ల ఆధారంగా వరిసాగు జరుగుతోంది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వరి పంట ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
రైతన్నకు గుండె ‘కోత’
Published Wed, Apr 16 2014 2:18 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement