రెక్కలు తెగిన నెల్లూరు
వరద పోటుతో విలవిల్లాడుతున్న నెల్లూరు జిల్లా
* జలదిగ్బంధంలోనే సింహపురి వాసులు
* ఇంటి పైకప్పులు, చెట్లపైనే వందలాది మంది
* సాయం చేసేవారి కోసం ఎదురుచూపులు
* జిల్లా వ్యాప్తంగా 81 మంది మృత్యువాత
* నీటమునిగిన పవర్ స్టేషన్లు, ఫీడర్లు
* సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం విఫలం
* సమీక్షలకే పరిమితమైన మంత్రులు
సాక్షి నెట్‌వర్క్: తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లేకాదు కనీసం నిలబడేందుకు భూమికూడా లేదు. చుట్టూ ఎటుచూసినా నీళ్లే.
చెట్టు, పుట్ట, గోడ, పైకప్పు ఏది కనిపిస్తే అదే అసరాగా గంటలతరబడి గడిపేస్తున్నారు. ఎవరైనా వస్తారని, ఆదుకుంటారనే ఆశతో చూసి.. చూసి.. నిల్చున్నచోటే కొయ్యబారిపోతున్నారు.ఆదుకోండంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలకు నెల్లూరు జిల్లాలో నెలకొన్న అత్యంత దయనీయ పరిస్థితి ఇది. మిగతా జిల్లాల్లో పరిస్థితి కాస్త మెరుగుపడ్డా నెల్లూరు జిల్లా మాత్రం ఇంకా వరద బీభత్సాన్ని ఎదుర్కుంటూనే ఉంది. గురువారం కూడా జల్లుమీద జల్లు పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటిదాకా 10 మంది వరదలో కొట్టుకుపోయి, విద్యుత్ షాక్‌తో నలుగురు, చలితీవ్రతకు 67 మంది..మొత్తం 81 మంది మరణించారు. 459 పశువులు మృత్యువాత పడ్డాయి.
ఆలకించేవారే లేరు..: జిల్లావ్యాప్తంగా వందలాది మంది జలదిగ్భంధంలో చిక్కుకున్నారు. చిట్టమూరు వద్ద మూడు రోజులపాటు 22 మంది జలదిగ్భంధంలో చిక్కుకుని కాపాడంటూ వేడుకున్నా.. ప్రభుత్వ యంత్రాంగం వారిని ఒడ్డుకు చేర్చలేని దుర్భరస్థితి. ఇళ్లలోకి వరదనీరు రావటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు వందలాది కుటుంబాలు నివాసాలపైకి ఎక్కి.. రక్షించండంటూ కేకలు పెట్టినా వారి మొర ఆలకించేవారు కరువయ్యారు. వారికి ఆహార ప్యాకెట్లు అందించే విషయంలోనూ అధికారయంత్రాంగం విఫలమైంది. అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నాయి. మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాలోనే ఉన్నా.. వారు అధికారులతో సమీక్షలు, సమావేశాలకే పరిమతమయ్యారు.
అక్కడక్కడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండిపోయారే తప్ప.. వరద ముప్పును అంచనా వేయటం.. వేగంగా సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం.. గురువారం సీఎం చంద్రబాబు ముగ్గురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేయటమే. చిల్లకూరు మండలం తీర ప్రాంతంలోని రెండు విద్యుత్ పరిశ్రమల్లోకి నీరు చేరింది. దీంతో మూడురోజులుగా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కొంతమంది బాధితులను పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ వేలమంది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వరదలోనే ఉన్నారు. గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు డివిజన్లలో రోడ్లు తెగిపోవడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం జనం నానా ఇబ్బందులు పడుతున్నారు.
అపారనష్టం.. : అవినీతి, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వందలాది చెరువులు, నదులు తెగి గ్రామాలు, పంటలను ముంచెత్తింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో పాటు, వరి, అరటి, బొప్పాయి, నిమ్మ, వేరుశనగ, వరి నారుమళ్లు, మినుము, తమలపాకుల తోటలు దెబ్బతిన్నాయి. 12వేల ఎకరాల్లో సాగవుతున్న ఆక్వా వరదనీటిలో కొట్టుకుపోయింది. మొత్తంగా రైతాంగమే రూ.3వేల కోట్లకుపైగా నష్టపోయినట్లు అంచనా.150 పునరావాల కేంద్రాల్లో సుమారు 20 వేల మందికిపైగా తలదాచుకుంటున్నారు.
నగరమా? నరకమా?
ఎన్నడూలేని విధంగా నెల్లూరు నగరాన్ని వరదనీరు చుట్టుముట్టింది. వరద నీరు వెళ్లేందుకు ఉన్న మార్గాలన్నీ మూసుకుపోవటంతోరోడ్లు, నివాసాలు, వ్యాపార దుకాణాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు నీటమునిగాయి. ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి. దీంతో నగరవాసులు నరకయాతనను అనుభవిస్తున్నారు.
స్తంభించిన రాకపోకలు
మనబోలు వద్ద జాతీయ రహదారికి మంగళవారం రాత్రి గండిపడటంతో చెన్నై-విజయవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. వందలాది వాహనాల్లోని ప్రయాణికులు రోడ్డుపైనే రెండురోజులపాటు గడపాల్సి వచ్చింది. నెల్లూరు-ముంబై రహదారి కూడా పలుచోట్ల గండ్లుపడటంతో అటువైపు వెళ్లే వాహనాలు సైతం నిలిచిపోయాయి. నెల్లూరు నుంచి చెన్నై, తిరుపతి, కడప, కర్నూలు, ముంబై వెళ్లే వారిదీ ఇదే పరిస్థితి. గురువారం రాత్రికి రాకపోకలను పునరుద్ధరించారు. కలకత్తా-చెన్నై జాతీయరహదారిని పాక్షికంగా పునరుద్ధరించారు. మనుబోలు మండలపరిధిలోని బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం వేకువన బ్రిడ్జ్ కూలిన విషయం తెలిసిందే. కోతకు గురైన హైవేను గురువారం రాత్రి 7 గంటల సమయంలో గూడూరు నుంచి నెల్లూరు వచ్చే వైపు పునరుద్ధరించి వాహనాలను అనుమతించారు.
తిరుపతిపై జలఖడ్గం..: వర్షాల కారణంగా ఏక్షణంలో ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి తిరుపతిలో నెలకొంది. గురువారం మధ్యాహ్నం నుంచి కురిసిన వర్షంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రధానమైన రోడ్లు జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని అధికారులు చెబుతున్నా శ్రీకాళహస్తి నియోజక వర్గంలో 70 గ్రామాలు ఇంకా అంధకారంలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు
14 మంది మరణించారు.
కూలిన కొండచరియలు
తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. మొదటి ఘాట్‌రోడ్డులో తొలిసారిగా కొండ చరియలు కూలాయి. రెండో ఘాట్ తరహాలోనే మొదటి ఘాట్‌రోడ్డులో కూడా రాళ్లు కూలడంతో ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చే స్తున్నారు.
తమిళనాడుకు మళ్లీ వానముప్పు
భారీ వర్షాల నుంచి తమిళనాడు కోలుకోక ముందే మళ్లీ ప్రమాదం పొంచి ఉన్నట్లు చెన్నై వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో శుక్ర, శనివారాల్లో వానలు పడతాయని ప్రకటించింది.
వరద సాయంలోనూ వివక్షేనా?
మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నామని కనీసం పట్టించుకున్నవారు కూడా లేరని ఏపీపీఎస్సీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిధర్‌ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకా డు దళితవాడకు చెందిన వరద బాధితులు నిలదీశారు. గురువారం గూడూరు సబ్ కలెక్టర్ గిరిషాతోపాటు ప్రత్యేక అధికారి గిరిధర్ వచ్చారు.
దీంతో వరద భాధితులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట వారిని చుట్టుముట్టారు. ప్రభుత్వం ప్రకటించిన వరద బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో అధికారులు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లల్లో నీళ్లు ఉంటేనే వరద సాయం వస్తుందని, లేకుంటే రాదని రెవెన్యూ అధికారులు చెప్పడం దారుణమన్నారు.
అప్పటివరకు తాము నీళ్లల్లో ఎలా ఉంటామో మీరే చెప్పాలంటూ వరద బాధితులు ప్రిన్సిపల్ సెక్రటరీని గట్టిగా అడిగారు. స్పందించిన గిరిధర్ కాసేపు అధికారులతో చర్చించిన అనంతరం ప్రతి ఒక్కరికి వరద సాయం అందించాలని ఆదేశించారు.