రెవెన్యూ.. అక్రమాల పుట్ట!
జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అక్రమాల పుట్టగా మారింది. పేరుకే ఆన్‌లైన్ సేవలు.. వాస్తవానికి ప్రతిపనికీ చేయి తడపాల్సిందే.. లేదంటే తంటానే. శనివారం పట్టాదారు పాసు పుస్తకం కోసం బాలాయపల్లి తహసీల్దార్ రాంబాబు రైతు చెంచయ్య నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో రెవెన్యూలో లంచాల అవతారం మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
► ఆత్మకూరు మండలం నల్లపురెడ్డి పల్లె దళిత కుటుంబానికి చెందిన పాణెం పెంచలరావు కుటుంబం తమ తాతల కాలం నుంచి రెండున్నర ఎకరాల కాలువ పొరంబోకు మెట్టపొలాన్ని సాగు చేసుకుంటున్నారు. ఈ స్థలానికి పట్టా ఇచ్చే అవకాశం చట్టరీత్యా ఉండదు. వర్షాలు వరుసగా పడకపోవడంతో ఒక సంవత్సరం హైదరాబాద్‌కు కూలిపనుల కోసం వలస పోయారు. ఇంతలో ఆ పొలాల గుండా సోమశిల కాలువ వచ్చింది. గ్రామానికి చెందిన మోతుబరి పాణెం పెంచలయ్యకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు. తహసీల్దారు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పాణెం పెంచలయ్యకు న్యాయం జరగలేదు. లంచాలు తీసుకున్న అప్పటి తహసీల్దారు గ్రామ మోతుబరికి అండగా నిలిచారు. ఇప్పటికీ న్యాయం జరగలేదు.
► వింజమూరు మండలంలో ప్రభుత్వ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం అప్పట్లో ఆర్‌ఐగా, ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. తహసీల్దారు పాత్ర మరిచి పోయారు.
► ఏఎస్‌పేట మండలం కుప్పురుపాడు గ్రామానికి చెందిన వై.రమణయ్య పట్టాదారు పాసుపుస్తకాల కోసం ఏడాది క్రితం మూడు నెలలపాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాడు. గ్రామ పెద్ద అక్కడి రెవెన్యూ సిబ్బంది తనకు తెలుసని చెప్పా డు. రూ.10 వేలు ఇస్తే పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తానని తెలిపారు. లంచంగా రూ.10వేలు సిబ్బంది కి ఇప్పించాడు. సిబ్బంది డూప్లికేట్ పాసుపుస్తకాలు ఇచ్చారు. తనకిచ్చిన పుస్తకాలు డూప్లికేట్ అనే సంగతి మూడు నెలల తరువాత తెలుసుకున్న ఆయన గొడవ పెట్టుకునేసరికి రెండు దఫాలుగా ఆయన డబ్బులు ఆయనకి చెల్లించేశారు.
► ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు కుంభకోణంలో భారీ స్థాయిలో వీఆర్వోలు ఇరక్కుని సస్పెండ్ అయిన విషయం తెలి సిందే.
► వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ భూముల్లో టేకు చెట్లు నరికి అధికారపార్టీ నేత సొమ్ము చేసుకున్న ఘటనలో అప్పటి నెల్లూరు తహసీల్దార్ పాత్ర అందరికీ తెలిసిందే.
► నెల్లూరు వైఎస్సార్ నగర్‌లో సైతం నాటి ఆర్‌ఐలు ఒకే నివేశన స్థల ప్లాటుకు డబ్బులు తీసుకుని ఇద్దరికి పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. జిల్లాలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.