నెల్లూరు నగరపాలక సంస్థ దోచుకున్నవాడికి దోచుకున్నంత అనే రీతిలో తయారైంది. పనులు చేయకపోయినా çపర్వాలేదు.. పరపతి ఉంటే చాలు పాత బిల్లులు కూడా మంజూరు చేసేస్తారు. అయితే ప్రతి దానికీ ఓ రేటు ఉంటుంది. కాంట్రాక్టర్లు పరపతి వినియోగించుకోవటంతో పాటు ఆ రేటుకు ఒప్పుకుంటే చాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులు రోజుల వ్యవధిలో మంజూరవుతాయి. 2016 సంవత్సరంలో బిల్లులు సదరు కాంట్రాక్టర్‌కు తెలియకుండానే గత నెలలో చెల్లించే వ్యవహారం ఇప్పటికే తీవ్ర దుమారం రేపింది. దీనికి కొనసాగింపు అనే రీతిలో గతంలోనూ ఇదే తరహా బిల్లుల చెల్లింపులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2011లోని బిల్లులను 2015లో చెల్లించారు. ఏకంగా రూ.కోటి చెల్లించారు. దీని వెనుక అధికార పార్టీ కీలక నేత ముఖ్య అనుచరుడు అంతా తానై వ్యవహారం నడిపాడు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థలో జవాబుదారీ తనం పూర్తిగా లోపించింది. ఉన్నతాధికారులకు శాఖపై పూర్తి పట్టులేకపోవటమో లేక లంచాలు తీసుకోవడంతో సంస్థలో జరుగుతున్న అక్రమాలపై మౌనం వహిస్తున్నారు. వరుసగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగి విచారణ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లెక్కకు మించి విచారణలు నగరపాలక సంస్థలో జరగుతున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి సొంత జిల్లాలోని కార్పొరేషన్‌లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా ఆయన ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి. దీంతో అధికారులదే ఇష్టారాజ్యంగా మారింది. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్లు ఉన్నప్పటికీ ఎవరితో పనిలేకుండా కొందరు అధికారులు వ్యవహరించి అడ్డగోలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెల్లో చెల్లించిన పాత బిల్లు రూ.65 లక్షల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో పాటు విజిలెన్స్ విచారణ సాగుతున్న క్రమంలో అదే రీతిలో మరో వ్యవహారం బయటపడింది.
పాత బిల్లుతో రూ.కోటి స్వాహా
పలువురు కమిషనర్లు ఓ బిల్లు మంజూరు చేసేందుకు నిరాకరించారు. చివరకు ఓ కమిషనర్ మాత్రం భారీగా ముడుపులు తీసుకుని బిల్లు మంజూరు చేశారు. అది కూడా ఐదేళ్ల కిందటి బిల్లు కావటం విశేషం. 2011–13 సంవత్సరం మధ్య నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఆంజనేయులు పనిచేశారు. ఆయన హయంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి లెక్కకు మించి ఖర్చు చేసినట్లు రూ.కోటి వరకు బిల్లులు సృíష్టించారు. 2011 నుంచి 2013 మధ్యలో పారిశుద్ధ్య పనులు, బ్లీచింగ్, సున్నం చల్లడం, కాలువ పూడిక తీత తదితర ఎమర్జెన్సీ పనుల నిమిత్తం సుమారు రూ.కోటి సీ బిల్లులు సృష్టించారు. ఈ క్రమంలో అప్పటి కమిషనర్ ఆంజనేయులు ఆకస్మిక బదిలీ నేపథ్యంలో ఆ బిల్లులు నిలిచిపోయాయి.
ఈ క్రమంలో తరువాత కమిషనర్లుగా వచ్చిన జాన్ శ్యామ్‌సన్, ఐఏఎస్ అధికారి చక్రధర్‌బాబు, మరో కమిషనర్ పీవీవీఎస్ మూర్తితో పాటు ఇద్దరు ఇన్‌చార్జ్ కమిషనర్లు మారారు. వీరిలో ఒక్క కమిషనర్ కూడా బిల్లులు చెల్లించేందుకు సుముఖత చూపలేదు. ప్రధానంగా చేయని పనులకు సీ బిల్లులు సృష్టించినట్లు కమిషనర్ల దృష్టికి రావటంతో వారు ఫైల్‌ను పక్కన పెట్టేశారు. దీంతో 2015 సంవత్సరంలో కరణం వెంకటేశ్వర్లు కమిషనర్‌గా వచ్చి కేవలం తొమ్మిది నెలలు పనిచేశారు. ఈ సమయంలోనే సుమారు ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులను గుట్టుచప్పుడు కాకుండా మంజూరు చేశారు. దీని వెనుక ఇద్దరు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి తీసుకున్న లంచంలో కమిషనర్‌కు 20 శాతం వరకు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చక్రం తిప్పింది ఇద్దరే..
కరణం వెంకటేశ్వర్లు కమిషనర్‌గా ఉన్న సమయంలో సిద్ధిక్ అనే వ్యక్తి అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆయన కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య దళారిగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌లు భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 2011 నుంచి 2013 మధ్యలోని బిల్లులను కరణం వెంకటేశ్వర్లు టేబుల్ పైకి తీసుకొచ్చి కె.మహేశ్వరరావు అనే కాంట్రాక్టర్‌కు నెల వ్యవధిలో రూ.65 లక్షలు బిల్లులు చెల్లించారు. మరో రూ.25 లక్షలకు పైగా గతంలోని బిల్లులు మంజూరు చేశారు. ఈ వ్యవహారం వెనుక అకౌంటెంట్ సిద్ధిక్, మేయర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి కీలకంగా వ్యవహరించారు. తాజాగా ఇదే తరహా బిల్లుల వ్యవహారంపై విజిలెన్స్ దృష్టి పెట్టిన క్రమంలో అక్రమాలు తెరపైకి రావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment