సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 3 వేలకుపైగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లను ఆటోమేషన్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా వీలైనంత ఎక్కువగా స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమైంది. త్వరలో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చబోతోందని ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు.
ప్రతి సబ్ స్టేషన్ ఆన్‌లైన్‌తో అనుసంధానం
► వైర్లు తెగినా, సబ్‌స్టేషన్ ఉపకరణాలు కాలిపోయినా వాటిని గుర్తించడానికే ఒక రోజు పడుతోంది. అప్పటి వరకూ విద్యుత్ సరఫరా ఆగిపోవాల్సిందే.
► ఆటోమేషన్ ప్రక్రియతో ప్రతీ సబ్‌స్టేషన్ ఆన్‌లైన్‌తో అనుసంధానమై ఉంటుంది. కేంద్ర కార్యాలయానికీ ఇది కనెక్ట్ అవుతుంది.
► విద్యుత్ సరఫరా ఆగిపోతే వెంటనే అదెక్కడ జరిగిందో తెలుసుకోవచ్చు. సిబ్బంది సకాలంలో స్పందించకపోతే కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. దీనివల్ల జవాబుదారీ తనం పెరుగుతుంది.
ఆటోమేషన్ ఎలా?
► ప్రస్తుతం ఉన్న ప్రతీ 30 సబ్‌స్టేషన్లను కలిపి ఒక కేంద్ర సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తారు. ప్రతీ సబ్‌స్టేషన్‌లోనూ రిమోట్ టెర్మినాలజీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారానే కేంద్ర కార్యాలయానికి, క్షేత్రస్థాయి సిబ్బందికి సంకేతాలు వెళ్తాయి. ఎక్కడన్నా లైన్‌కు ఇబ్బంది వచ్చినప్పుడు కొన్ని క్షణాల్లోనే దీనిద్వారా గుర్తిస్తారు.
► ప్రతీ బ్రేకర్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల దానంతట అదే సమస్య ఏంటో తెలుసుకుని, కేంద్ర సబ్ స్టేషన్‌కు చేరవేస్తుంది.
► ఈ టెక్నాలజీ ద్వారా గంటలోపే ఎలాంటి సమస్యనైనా గుర్తించి, కేంద్ర సబ్‌స్టేషన్ పరిధిలోని సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందితో పనిచేయించే వీలుంది. ఫలితంగా మానవ వనరుల వాడకం తగ్గుతుంది. నిర్వహణ వ్యయం భారీగా తగ్గుతుంది. దీంతో విద్యుత్ ధర తక్కువగా ఉండే వీలుంది.
డిమాండ్‌కు తగ్గ టెక్నాలజీ
శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో సీఎండీ
రాష్ట్ర ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపట్టింది. దీని డిమాండ్ మేనేజ్‌మెంట్‌కు సబ్‌స్టేషన్ల ఆటోమేషన్ తప్పనిసరి అని గుర్తించింది. అందుకే దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల నిర్వహణ వ్యయం చాలా వరకు తగ్గుతుంది. నాణ్యమైన సేవలు అందుతాయి.
Comments
Please login to add a commentAdd a comment