Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా | Nagulapalli Srikanth Said Electricity Rates Will Never Be Same | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా

Published Sun, Nov 7 2021 11:54 AM | Last Updated on Mon, Nov 8 2021 4:17 AM

Nagulapalli Srikanth Said Electricity Rates Will Never Be Same - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్లపాటు నిరాటంకంగా అందించేందుకే కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా దీర్ఘకాలం నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు పూర్తి భరోసానిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధర కంటే తక్కువకే కొంటున్నందున ఏడాదికి రూ.2,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇవాక్యులేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయం మరో రూ.2,260 కోట్లు కూడా ఆదా అవుతాయని వెల్లడించారు. సెకీతో విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరమని అంశాలవారీగా వివరించారు...

యూనిట్‌కు రూ.1.87 ఆదా..
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అందించే విద్యుత్‌ను యూనిట్‌ సగటున రూ.4.36 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తోంది. సెకీతో ఒప్పందం వల్ల ఈ విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే వస్తుంది. ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ద్వారా పిలిచిన టెండర్లలో కనీస బిడ్‌ యూనిట్‌కు రూ.2.49కు కోట్‌ చేశారు. తద్వారా యూనిట్‌కు దాదాపు రూ.1.87 ఆదా అవుతుంది. ఆ ప్రకారం ఏడాదికి రూ.2,400 కోట్ల వరకూ ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు.

మనకు మరింత చౌకగా..
కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం ప్రకారమే సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆప్‌ ఇండియా (సెకీ) యూనిట్‌ 
రూ.2.49 చొప్పున ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్‌ లోనే సెకీ నుంచి యూనిట్‌ రూ.2.61చొప్పున సోలార్‌ విద్యుత్‌ను కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే సెకీ సంస్థ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌ చేసుకున్న విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలలో ప్రస్తుతం సెకీ ప్రతిపాదించిందే అతి తక్కువ ధర. అలాగే ఐఎస్టీఎస్‌ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. 

కేంద్ర చట్టాల ప్రకారమే..
డిస్కంలపై పడే నెట్‌ వర్క్‌ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర విద్యుత్‌ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. విద్యుత్‌ కొనుగోళ్లపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌(ఈఆర్‌సీ) కు ప్రతిపాదిస్తుంది. ఈఆర్‌సీ ఆమోదించిన తరువాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్‌ ఆఫ్‌ లా ప్రకారం విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తాయి.  కేంద్ర విద్యుత్‌ చట్టంలో దీన్నొక నిబంధనంగా నోటిఫై చేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని టెండర్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి అవకాశం లేదు. 

లైన్ల ఖర్చుండదు.. ఇతర అవసరాలకు భూములు 
సెకీ నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల ఇవాక్యులేషన్‌ లైన్ల ఖర్చు భారం ఉండదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2,260 కోట్లు ఖర్చు పెట్టి ఇవాక్యులేషన్‌ లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. సెకీతో ఒప్పందంతో ఆమేరకు భారీగా  ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే అది ఒకసారికే పరిమితమవుతుంది. కానీ కేంద్ర గ్రిడ్‌కు ఛార్జీలు 25 ఏళ్లపాటు కట్టాల్సి ఉంటుంది. దాంతో రాష్ట్రం చాలా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. మరోవైపు సెకీ విద్యుత్‌ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టుల కోసం ఈ భూమి ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  

ఆంధ్రప్రదేశ్‌ కంటే రాజస్థాన్‌లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడు. మన రాష్ట్రంలో కంటే అక్కడ గంటన్నర సేపు అధికంగా సూర్యరశ్మి ఉండటంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఎక్కువగా  ఉంటుంది. అందువల్ల డిమాండ్‌ అధికంగా ఉండే పీక్‌ అవర్స్‌లో సెకీ విద్యుత్‌ బాగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సే్చజీ నుంచి కొనుగోలు చేస్తే పీక్‌ అవర్‌లో కరెంట్‌ ధరలు అధికంగా ఉంటాయి.

ఐదేళ్లలో అస్తవ్యస్థం
గత సర్కారు హయాంలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 25 ఏళ్లకు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడంతో 2014– 2019 మధ్య రాష్ట్ర విద్యుత్‌ రంగం పూర్తిగా దివాళా తీసింది. కొనుగోలు నష్టాలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు గుదిబండల్లా మారాయి. చౌక విద్యుత్తు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వకుండా దీర్ఘకాలిక ఒప్పందాలపై గత సర్కారు మొగ్గు చూపడంతో డిస్కమ్‌లు నష్టాల భారంతో దివాళా స్థితికి చేరుకున్నాయి. 


నోట్‌: ‘సెకీ’ 2017 డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలో ధరలు, గత సర్కారు కొన్న ధరల్లో వ్యత్యాసం వివరాలు ఇవీ.

  

చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement