
దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే విద్యుత్ ప్లాంట్లలో ఏప్రిల్ 30 వరకు ఉత్పత్తి కొనసాగించాలి
వేసవిలో అధిక విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కోవడానికి కేంద్రం ఆదేశం
ఉత్పత్తి వ్యయం వినియోగదారుల నుంచి వసూలుకు అనుమతి
మన రాష్ట్రంలో విదేశీ బొగ్గుతో నడుస్తున్న ఎస్‌డీఎస్‌టీపీఎస్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఏర్పడుతున్న విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్) మీద ఆధారపడి నడుస్తున్న థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆపొద్దని కేంద్రం స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న బొగ్గు టన్ను ధర రూ.15,535 వరకు పలుకుతోంది. విదేశీ బొగ్గుతో స్వదేశీ బొగ్గును కలిపి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి యూనిట్‌కు దాదాపు రూ.10 ఖర్చు అవుతుంది. విద్యుత్ ఉత్పత్తిదారులు ఈ వ్యయాన్ని వినియోగదారుల నుంచి రాబట్టుకునేందుకు కూడా కేంద్రం అనుమతించింది.
దేశంలో 17.. మన రాష్ట్రంలో ఒకటి
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) వివరాల ప్రకారం... దేశవ్యాప్తంగా సొంత బొగ్గు గనులున్న థర్మల్ కేంద్రాలు 18 మాత్రమే. దేశీయ బొగ్గుపై ఆధారపడి నడిచేవి 155 ఉన్నాయి. ఈ మొత్తం 173 ప్లాంట్లు ఉత్పత్తి సామర్థ్యం 2,03,347 మెగావాట్లు. దిగుమతి చేసుకున్న బొగ్గుతో నడిచే ప్లాంట్లు 17 ఉండగా, వాటి పూర్తి ఉత్పత్తి సామర్థ్యం 17,225 మెగావాట్లు.
వీటిలో మన రాష్ట్రంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం (ఎస్‌డీఎస్‌టీపీఎస్–కృష్ణపట్నం) ఒకటి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవిలో రోజుకు 270 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. మన రాష్టంలో 260 మిలియన్ యూనిట్లకు డిమాండ్ చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇందులో ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్లు 110 మిలియన్ యూనిట్లు సమకూరుస్తున్నాయి. అందులో 40శాతం కృష్ణపట్నంలోని ఎస్‌డీఎస్‌టీపీఎస్‌లో ఉన్న 2,400 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్ల నుంచి వస్తోంది.
మూడు రోజులకే బొగ్గు నిల్వలు
ప్రస్తుతం కృష్ణపట్నం ఎస్‌డీఎస్‌టీపీఎస్‌లో 79,450 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇక్కడ ఒక రోజు విద్యుత్ ఉత్పత్తికి 29 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం. ప్రస్తుత నిల్వలు దాదాపు మూడు రోజులు మాత్రమే వస్తాయి. విద్యుత్ చట్టం సెక్షన్–11 ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు (ఇంపోర్టెడ్ కోల్)తో నడిచే విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తిని కేంద్రం తప్పనిసరి చేసింది. నిబంధనల ప్రకారం ఒక ప్లాంటులో 24 రోజులకు సరిపడా బొగ్గు ఉండాలి. ఎస్‌డీఎస్‌టీపీఎస్‌లో మాత్రం మూడు రోజులకు మించి బొగ్గు నిల్వలు ఉండటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment