భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌ | Huge increase in electricity demand | Sakshi
Sakshi News home page

భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

Published Sun, Feb 25 2024 4:53 AM | Last Updated on Sun, Feb 25 2024 8:50 PM

Huge increase in electricity demand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 15వేల మెగావాట్లను దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది.

గతేడాది సరిగ్గా ఇదే రోజు 14,526 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ మాత్రమే నమోదైంది. గతేడాది మార్చి 30న రాష్ట్రంలో అత్యధికంగా 15497 మెగావాట్ల గరిష్ట విదుŠయ్‌త్‌ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మెగావాట్లకు మించనుందని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 

1,200 మెగావాట్ల విద్యుత్‌ బ్యాంకింగ్‌కు ఏర్పాట్లు 
1,600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో 800 మెగావాట్ల నుంచి ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్‌ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వంసిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాలతో 1200 మెగావాట్ల విద్యుత్‌ బ్యాంకింగ్‌కు సైతం ఏర్పాట్లు చేశారు.

దీని ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు విద్యుత్‌ ఇచ్చి మన రాష్ట్రంలో లోటు ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజువారీ విద్యుత్‌ వినియోగం 242.95 మిలియన్‌ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 256.74 మిలియన్‌ యూనిట్లకు చేరింది.  

సాగునీరు లేక పెరగనున్న విద్యుత్‌ అవసరాలు 
కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో కాల్వల కింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మతుల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద విద్యుత్‌ వినియోగం మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ మార్చి చివరిలోగా 16500–17000 మెగావాట్ల మధ్య నమోదు కావచ్చని భావిస్తున్నారు. 

దక్షిణ డిస్కంల పరిధిలోనూ పెరిగిన వినియోగం  దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు విద్యుత్‌ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24 శాతం విద్యుత్‌ వినియోగం పెరిగింది.

సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 9043 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 9253 మెగావాట్లకు పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 158.71 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరగగా, ఈ ఏడాది ఇదే కాలంలో 169.36 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది.  

గ్రేటర్‌లో డిమాండ్‌ పైపైకి.. 
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27శాతం విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 2,930 మెగావాట్లుగా నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లుగా నమోదయ్యింది.

నగరంలో గతేడాది జనవరి, ఫిబ్రవరిలో సగటు విద్యుత్‌ వినియోగం 51.69 మిలియన్‌ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 57.34 మిలియన్‌ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement