సాక్షి, అమరావతి: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసిందన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఈ రంగాన్ని ఆదుకుందని గుర్తు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించకూడదని డిమాండ్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో అధికారులు సోమవారం మరోదఫా సంప్రదింపులు జరిపారు. విద్యుత్ సంస్థల పరిస్థితిని గణాంకాలతో సహా వారి ముందుంచారు. అర్ధం చేసుకుని ఆందోళన మానుకోవాలని హితవు పలికారు. ఆ వివరాలతో నాగులాపల్లి ప్రజలకు ఓ లేఖ రాశారు. లేఖలో ఏముందంటే..
అసాంఘిక శక్తుల ప్రమేయం..!
విద్యుత్ ఉద్యోగులు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నారనే తప్పుడు ప్రచారానికి ప్రభావితులవుతున్నారు. కొందరు పనికట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. అయితే అసలా ఆలోచనే లేదని ప్రభుత్వం ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేసింది. ఇటీవల విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉద్యోగులకు ఈ విషయం నిక్కచ్చిగా చెప్పారు. అయినప్పటికీ ఈ అంశాన్ని తెరపైకి రావడం వెనుక కొన్ని అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడే అవకాశం ఉంది.
అదే నిజమైతే వేల కోట్లు ఎందుకిస్తారు?
2019 మార్చి నాటికి విద్యుత్ రంగం పరిస్థితి దారుణంగా ఉంది. డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.13,391 కోట్లు ఉన్నాయి. వీటికోసం 2019–20లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్థిక కష్టాలేవీ పరిగణనలోకి తీసుకోకుండా రూ.8,654.95 కోట్లు విడుదల చేసింది. 2020 మార్చి 31 నాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.28,731.87 కోట్లు ఉంటే, ఇప్పటికే రూ.17,904 కోట్లు చెల్లించింది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా మిగతా మొత్తాన్నీ చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. ప్రైవేటీకరించే ఆలోచనే ఉంటే ప్రభుత్వం ఈ రంగానికి ఇన్ని వేల కోట్ల డబ్బులు ఇస్తుందా? గత ఐదేళ్ళుగా పేరుకుపోయిన బకాయిలను విడుదల చేస్తుందా? ఉద్యోగులు, ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనించాలి.
విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు జగన్ సర్కారు ప్రయత్నం
2014–15 నాటికి విద్యుత్ సంస్థలు రూ.7,069.25 కోట్ల నష్టాల్లో ఉన్నాయి. 2019–20లో ప్రస్తుత ప్రభుత్వం వచ్చే నాటికే ఆ నష్టాలు రూ.35,700.97 కోట్లకు చేరాయి. ఏటా నాలుగైదు వేల కోట్ల చొప్పున నష్టాల ఊబిలో కూరుకుపోతున్న విద్యుత్ సంస్థలను గట్టెక్కించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. నిర్వహణ ఖర్చును ఒక్క ఏడాదిలోనే రూ.5 వేల కోట్ల వరకు తగ్గించేలా ప్రణాళికను రూపొందించింది. నిజంగా ప్రైవేటీకరణ ఆలోచనే ఉంటే ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుంటుందా? ఇవన్నీ గమనించి, తప్పుడు ప్రచారానికి ప్రభావితం కాకుండా, సంస్థను బలోపేతం చేసేందుకు ఉద్యోగులు సహకరించాలి.
Comments
Please login to add a commentAdd a comment