మేఘా విద్యుత్ రికార్డు  | Megha Sets world Records for the Fastest Execution of Power Sub Stations | Sakshi
Sakshi News home page

మేఘా విద్యుత్ రికార్డు 

Published Wed, Jun 5 2019 12:01 PM | Last Updated on Wed, Jun 5 2019 12:01 PM

Megha Sets world Records for the Fastest Execution of Power Sub Stations - Sakshi

ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్లను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఈఐఎల్ తాజాగా తెలంగాణకు ఎంతో ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరాల కోసం 6 భారీ సబ్ స్టేషన్లను ప్రపంచంలోనే తొలిసారిగా త్వరితగతిన పూర్తిచేసి రికార్డ్ సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. నీటిపారుదల రంగంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచంలోని ఇదే తొలిసారి అని చెప్పవచ్చు.

ప్రైవేటు రంగంలో విద్యుత్ సరఫరా కోసం అతిపెద్దదైన WUPPTCL ఉత్తరప్రదేశ్‌లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అయితే అది విద్యుత్ అవసరాలకోసం కాగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్ల కాలంలోనే 6 భారీ  సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. ఇవన్నీ 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగినవి. దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్‌మిషన్ లైన్లను కూడా అతితక్కువ కాలంలోనే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. 2017 ఫిబ్రవరిలో రామడుగు సబ్స్టేషన్‌తో పనులను ప్రారంభించి, ఒక్కో సబ్‌స్టేషన్‌ను పూర్తిచేస్తూ చివరగా ఆరో సబ్‌స్టేషన్‌ను 2019 మే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. 

అతిపెద్ద విద్యుత్ వ్యవస్థ 
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే మన దేశంలోని జమ్ము కాశ్మీర్ (3428 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (3356 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల విద్యుత్ సరఫరా వ్యవస్థలకు దాదాపుగా సమానం.

రికార్డు సమయంలో ఎంఈఐఎల్ ఆరు సబ్ స్టేషన్లు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంప్ హౌజ్ లలో ఏర్పాటు చేసిన మొత్తం 43 పంపుమోటార్లకు విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఆరు విద్యుత్ సబ్‌స్టేషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6, 12, 14 సబ్ స్టేషన్ లు మినహా మిగతా అన్ని సబ్ స్టేషన్ లను, విద్యుత్ సరఫరా లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది.

అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్‌వ్యవస్థ
ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ పంప్ హౌజ్ లో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ రామడుగు వద్ద ఏర్పాటు చేసింది. దీని కోసం 18 కిలోమీటర్ల 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్, ట్రాన్స్ మిషన్ లైన్ పనులను 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి, కేవలం ఏడాది కాలంలో పనులను పూర్తిచేసి, 2018 మే 6న చార్జ్ చేసి అందుబాటులోకి తెచ్చింది.

తొమ్మిది యూనిట్లతో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించే 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ గడువులోగా పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్ నుంచే 220 కేవీ అన్నారం, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందుతుంది. 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించేందుకు 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ పనులను 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 14న చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. 440 మెగావాట్ల సామర్థ్యంతో 11 యూనిట్లను కలిగిన మేడిగడ్డ పంప్ హౌజ్ కు విద్యుత్ అందించేందుకు 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ తోపాటు సుందిళ్ల నుంచి 80 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ఏర్పాటు చేశారు. దీని పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 29న చార్జింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేసింది. 

తిప్పాపూర్ సబ్ స్టేషన్ తో ప్యాకేజీ 10కు విద్యుత్
సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్ నుంచి 46.115 కిలోమీటర్ల లైన్ తోపాటు చందులాపూర్ నుంచి 19.096 కిలోమీటర్ల క్యూఎండీసీ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్, లైన్ల పనులను 2017 నవంబర్ 8న ప్రారంభించి, 2019 ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ 11 రంగనాయకసాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు చందులాపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లి కేటీపీపీ నుంచి గజ్వేల్ సబ్ స్టేషన్ అక్కడి నుంచి చందులాపూర్ వరకు 54.18 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను మే 2017లో ప్రారంభించగా, 2019 మే 6న చార్జింగ్ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement