హైకోర్టుకు తెలిపిన ఏజీ
కుంగుబాటుకు బాధ్యులైన అధికారులను తొలగిస్తాం
ఎన్‌డీఎస్‌ఏ కమిటీ నివేదిక తర్వాత మరిన్ని చర్యలు
న్యాయ విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన కమిటీ పూర్తి స్థాయి పరిశీలన చేసి నివేదిక సమర్పించిన తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.
పిల్‌పై విచారణ: మేడిగడ్డ ఘటనకు కారకులెవరో తేల్చేందుకు గాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తునకు ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కాంగ్రెస్ నేత జి.నిరంజన్ గత నవంబర్‌లో ఈ పిల్ దాఖలు చేశారు. కాగా ఫైలింగ్ నంబర్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టి.నరేందర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, కేంద్రం తరఫున న్యాయవాది ఎల్.ప్రణతిరెడ్డి, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ టి.సృజన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అవకతవకలు గుర్తించింది
మేడిగడ్డ రిజర్వాయర్ కుంగుబాటుపై ప్రభుత్వ దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలతో నివేదిక అందజేయాలని గత నెల విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదికను ధర్మాసనానికి ఏజీ అందజేశారు. అనంతరం వాదనలు వినిపించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్‌డీఎస్‌ఏ అధికారులు గత ఏడాది అక్టోబర్ 24, 25 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. మేడిగడ్డ బ్యారేజీ పియర్ కుంగిపోవడానికి కారణాలను ఎన్‌డీఎస్‌ఏ సమర్పించింది.
‘ప్రణాళిక, రూపకల్పన, నాణ్యత, నియంత్రణ, ఆపరేషన్–నిర్వహణకు సంబంధించిన సమస్యలతో పాటు పియర్లు ఏకశిలగా ఉండటంతో కదిలి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. కచ్చితమైన కారణాలను గుర్తించడానికి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి..’అని ప్రాథమికంగా అభిప్రాయపడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశించింది. ఈ విభాగం ప్రాథమిక విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగించాం. ఇతర అధికారులపై కూడా చర్యలు తీసుకుంటాం. అయితే ‘కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్, 1952లోని సెక్షన్ 3(1) ప్రకారం హైకోర్టు/సుప్రీంకోర్టు మాజీ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది’అని వివరించారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ధర్మాసనం 4 నెలలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment