ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ను కోరనున్న మంత్రి ఉత్తమ్
11న ఢిల్లీకి వెళ్లనున్న నీటిపారుదల శాఖ మంత్రి
మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలపై సర్కారు దృష్టి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్‌ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్‌ఏ చైర్మన్ అనీల్ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.
అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్‌ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్‌లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.
సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ బరాజ్ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్‌ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్‌ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్‌ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, హరిరామ్‌లతో సమావేశమయ్యారు.
మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు..
గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్‌తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్‌లోకి పంపింగ్ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్‌లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్‌ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
మూసీ కాల్వలకు సత్వర అనుమతులు..
నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్ బరాజ్ నిర్మాణం విషయంలో ఛత్తీస్‌గఢ్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్‌ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులు
నీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment