విచారణకు హాజరై వస్తున్న వెదిరె శ్రీరామ్
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు తెలిపిన కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ అనలేదు
ముంపు సమస్య మహారాష్ట్రతో సంప్రదింపుల ద్వారా పరిష్కారమయ్యేది
రాజకీయ, ఇతర కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మాణం
మేడిగడ్డ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు కూడా కుంగిపోవచ్చని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ బరాజ్ నిర్మించాలన్న ఆలోచన నాటి సీఎం కేసీఆర్‌దేనని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) లేఖ ఇవ్వడం, మహారాష్ట్రతో ముంపుపై వివా దం ఏర్పడడంతోనే మేడిగడ్డకు మార్చామని కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిలభ్యత ఉందని సీడబ్ల్యూసీ ఎన్నో లేఖలు రాసిందని, సంప్రదింపులతో మహారాష్ట్రతో ముంపు సమస్యను పరిష్కారానికి అవకాశం ఉండేదన్నారు. రాజకీయ, ‘ఇతర’కారణాలతోనే మేడిగడ్డ బరాజ్ నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ శుక్రవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌కు వెదిరె శ్రీరామ్ హాజరై సమాధానాలిచ్చారు.
వ్యక్తిగత హోదాలోనే సాక్ష్యం...
వ్యక్తిగత హోదాలోనే కమిషన్ ముందు సాక్షిగా హాజరైనట్టు వెదిరే శ్రీరామ్ స్పష్టత ఇచ్చారు. కాళేశ్వ రం ప్రాజెక్టుకు అనుమతుల కోరుతూ సీడబ్ల్యూసీకి నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్(సీడీఓ) సీఈ రాసిన లేఖను సాక్ష్యంగా ఆయన గతంలో కమిషన్‌కు సమరి్పంచగా, ఆ లేఖలో వ్యత్యాసాలున్నట్టు కమిషన్ ఎత్తిచూపింది. ఈ లేఖను తాను సీడబ్ల్యూసీ నుంచే స్వీకరించానని, సీడీఓ సీఈ లేఖను మార్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అధికారికంగా తీసుకోనందున వాటిని సాక్ష్యంగా పరిగణించబోమని కమిషన్ తేల్చి చెప్పింది.
అన్నారం, సుందిళ్ల కుంగిపోవచ్చు..
మేడిగడ్డ బరాజ్ తరహాలో అన్నారం, సుందిళ్ల బరాజ్‌లూ కుంగిపోవచ్చని వెదిరె శ్రీరామ్ అన్నారు. బరాజ్‌ల వైఫల్యానికి కారణాలేమిటని కమిషన్ ప్రశ్నించగా, సరైన ఇన్వెస్టిగేషన్లు జరపకుండానే డిజైన్ల రూపకల్పన, డిజైన్లు, మాడల్ స్టడీస్‌కు విరుద్ధంగా నిర్మాణం, నిర్వహణ జరగడమేనన్నారు. ప్లాన్ తయారీకి ముందే పనులు ప్రారంభించారా అని కమిషన్ అడగ్గా, అవునని బదులిచ్చారు. 2016 ఏప్రిల్/మేలో బరాజ్‌లు నిర్మించాలని నిర్ణయించి 2019లోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం అత్యాశే అన్నారు.
డీపీఆర్ తయారీకి ఏడాది అవసరం కాగా, 4 నెలల్లోనే పూర్తి చేయాలని వ్యాప్కోస్‌ను కోరారన్నారు. డీపీఆర్‌కు ఆమోదం లభించకముందే టెండర్లు పిలిచి పనులు అప్పగించారని, నాటికి ఇంకా డిజైన్లు సైతం సిద్ధం కాలేదన్నారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల స్థలాలను మార్చడంతో అప్పటికే నిర్వహించిన ఇన్వెస్టిగేషన్లు వృథా అయ్యాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఆమోదించిందా అని కమిషన్ అడగగా, లేదని బదులిచ్చారు. తొందరపాటుతో క్షేత్రస్థాయిలోని ఈఈ నుంచి ఈఎన్‌సీ వరకు అందరూ తప్పిదాలు చేశారన్నారు.
నిర్వహణ విభాగం ఈఎన్‌సీ జాప్యం చేశారు
బరాజ్‌లలో సీపేజీతో నీరు లీకైనప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్‌ఏ) సలహా కోరడంలో నిర్వహణ విభాగం ఈఎన్‌సీ(నాగేంద్రరావు) జాప్యం చేయడంతో నష్టం తీవ్రత పెరిగిందా అని కమిషన్ ప్రశ్నించగా, అవునని వెదిరె బదులిచ్చారు. బరాజ్ కుంగే వరకు ఎన్డీఎస్‌ఏకు సమాచారం లేదని, కుంగిన 5 రోజులకు ఎన్డీఎస్‌ఏ బృందం పరిశీలనకు వచ్చిందన్నారు. ఎన్డీఎస్‌ఏ 20 రకాల సమాచారం కోరితే సకాలంలో ఆ ఈఎన్‌సీ ఇవ్వలేదని, దీంతో బరాజ్‌ల వైఫల్యానికి కారణాలను గుర్తించడం ఎన్డీఎస్‌ఏకి క్లిష్టంగా మారిందన్నారు.
మళ్లీ గడువు పొడిగించలేం ..కోదండరామ్‌కు కమిషన్ స్పష్టీకరణ
మీరు సమరి్పంచిన పత్రాలకు ఆధారాలు ఏమిటని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరామ్‌ను కమిషన్ ప్రశ్నించగా, మరిన్ని ఆధారాలు సమర్పించేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించి మీకు అవకాశం ఇచ్చామని, మళ్లీ పొడిగించడం సాధ్యం కాదని కమిషన్ స్పష్టం చేసింది. అఫిడవిట్‌పై చేసిన సంతకం మీదేనా? అని కమిషన్ ప్రశ్నించగా, అవునని కోదండరామ్ ధ్రువీకరించారు. గతంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేసిన వికాస్‌రాజ్ కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిలేదని తెలపడంతో ఆయనకు కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment