సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు తనిఖీకి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టును తనిఖీ చేసి నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలంటూ కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తనిఖీ చేసి, సమస్యలకు పరిష్కార మార్గాలు వెతకాలని కేంద్రం ఆదేశించింది.
మరోవైపు, వచ్చే వానాకాలంలో గోదావరికి వచ్చే వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత నష్టం వాటిల్లకుండా పరిరక్షించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ దృష్టిసారించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ చట్టం కింద ఏర్పాటైన ‘డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్’మంగళవారం రెండు బ్యారేజీలను సందర్శించింది.
నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(అడ్మిన్) అనిల్ కుమార్ నేతృత్వంలో డిజైన్ ఎక్స్‌పర్ట్ టి.రాజశేఖర్, సీఈ సీడీఓ, స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (ఎస్డీఎస్‌ఓ) ఇంజనీర్ల బృందం రెండు బ్యారేజీలను పరిశీలించిన అనంతరం సత్వరంగా తీసుకోవాల్సి న నష్టనివారణ చర్యలపై చర్చించింది. గోదావరిలో మళ్లీ 20 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తితే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందనే అనుమానాలు ఉండటంతో ఈ బృందం అక్కడ పర్యటించింది.
నష్టనివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవ కాశం ఉంది. అన్నారం బ్యారేజీకి శాశ్వత మరమ్మతులు నిర్వహించిన తర్వాతే నీళ్లు నింపాలని గతంలోనే ఎన్డీఎస్‌ఏ సూచించింది. మరమ్మతులు జరిగే వరకు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదు.
Comments
Please login to add a commentAdd a comment