ఆపరేటర్ పోస్టుకు రూ. 2 లక్షలు
ఆపరేటర్ పోస్టుకు రూ. 2 లక్షలు
Published Fri, Sep 23 2016 12:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
కాంట్రాక్టర్ల బేరసారాలు
జిల్లాలో 230 పోస్టుల భర్తీకి సన్నాహాలు
అధికారులపైనే నిరుద్యోగుల ఆశలు
విద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్ పోస్టుల నియామకంలో అక్రమాలు జరుగుతున్నాయి. ఆపరేటర్ పోస్టులు ఇప్పిస్తామంటూ సబ్‌స్టేషన్ కాంట్రాక్టర్లు నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌లోని వరంగల్, వరంగల్ రూరల్ పరిధిలో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల వసూళ్ల వ్యవహారంపై పలువురు నిరుద్యోగులు ఇప్పటికే ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది.
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలోని 33/11 కేవీ(కిలో వాట్) సబ్‌స్టేషన్ నిర్వహణ కోసం 230 మంది ఆపరేటర్ల నియామకానికి ఆగస్టు 26న నోటిఫికేషన్ జారీ అయ్యింది. డివిజన్ల వారీగా పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆపరేటర్లకు వేతనాలు విద్యుత్ సబ్‌స్టేషన్‌ల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్లు చెల్లిస్తారు. ఐటీఐ(ఎలక్ట్రికల్), ఇంటర్మీడియెట్ ఒకేషనల్(ఇడబ్లు్యఎన్‌ఈఈ) ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు అర్హులు. మన జిల్లాకు చెందినవారే దరఖాస్తు చేసుకోవాలని, ఐటీడీఏ పరిధిలోని ఉప కేంద్రాలకు ఆ ప్రాంతం వారే (ట్రైబల్ ఏజెన్సీ వాసులు) అర్హులు అని పేర్కొన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా సబ్ స్టేషన్ల కాంట్రాక్టర్లు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు సెప్టెంబరు 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకటి రెండు డివిజన్లలో ఒక్కో పోస్టుకు 50 మంది పోటీపడేలా దరఖాస్తుల సంఖ్య ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. ఇది పూర్తయితేగానీ కచ్చితమైన సంఖ్య తెలియదు. సబ్‌స్టేషన్ ఆపరేటర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రత్యేక కమిటీ చేపట్టనుంది. ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ కార్యాలయంలోని టెక్నికల్ డీఈ, ఆపరేషన్ డీఈ, ఎన్పీడీసీఎల్ కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక డీఈ, కాంట్రాక్టర్ల ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో ఉంటారు. ఐటీఐ, ఇంటర్మీడియేట్ ఒకేషన్‌లో మెరిట్, రిజర్వేషన్, కరెంటు స్తంభాలు ఎక్కే అర్హతల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నిబంధనలు ఇలా ఉంటే... కాంట్రాక్టర్లు మాత్రం అంతా తామే అన్నట్లుగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ‘మా పరిధిలో ఇన్ని సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఇన్ని ఆపరేటరు ఉద్యోగాలు ఇస్తాం. అంతా మేం చెప్పినట్లే ఉంటుంది. ముందుగా డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యత’ అని నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్పీడీసీఎల్ అధికారులు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు
డివిజన్ పేరు ఖాళీలు
వరంగల్ 20
వరంగల్ రూరల్ 25
ములుగు 34
మహబూబాబాద్ 46
నర్సంపేట 22
జనగామ 83
పారదర్శకంగా నియామకాలు : శివరాం, వరంగల్ ఎస్‌ఈ
సబ్‌స్టేషన్ ఆపరేటర్ల నియామకాలు పారదర్శకంగా జరుగాతాయి. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా... విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగే వారిని ఎంపిక చేస్తాం. ఎలాంటి పైరవీలకు, అక్రమాలకు తావు లేదు. బ్రోకర్లను నమొ్మద్దు. ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. డబ్బులు ఇచ్చి మోసపోవద్దు.
Advertisement