మేం మళ్లీ వస్తే.. మీ సంగతి చెప్తా! | The Irregularities Of TDP Leaders | Sakshi
Sakshi News home page

మేం మళ్లీ వస్తే.. మీ సంగతి చెప్తా!

Published Fri, Jul 26 2019 12:39 PM | Last Updated on Fri, Jul 26 2019 12:39 PM

The Irregularities Of TDP Leaders - Sakshi

సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్‌): ‘‘ఏయ్‌..సబ్‌ స్టేషన్‌ నిర్వహణ పనులు రద్దు చేయించారు.. దీనికి ప్రతి ఫలం అనుభవించేలా చేస్తా. మా పార్టీ మళ్లీ    అధికారంలోకి రాకపోదా.. అప్పుడు మీ సంగతి చెప్తా.. జిల్లాలో ఎలా పనిచేస్తారో చూస్తా.. ఇవేమీ సినిమా డైలాగ్‌లు కాదు.. విద్యుత్‌ అధికారులకు ఓ కాంట్రాక్టర్‌ బెదిరింపులు’’. 

అధికారులను శాసిస్తున్న టీడీపీ కాంట్రాక్టర్‌..     
గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్సీ అనుచరుడిగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఓ కాంట్రాక్టర్‌ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇంజినీర్లను శాసించే స్థాయికి ఎదిగాడు. అడ్డదారుల్లో సబ్‌ స్టేషన్లు పొందడం, నాసిరకం పనులు చేయడం, బిల్లులు చేయని ఇంజినీర్లను బెదిరించడం ఈయన దినచర్య. ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు ఎవరైనా ఈయన వ్యవహారశైలి ఇంతే. అలా అడ్డదారులు తొక్కి ఎన్నో అక్రమాలకు తెరలేపాడు. ఇతడి ఒత్తిళ్లు భరించలేక ఒక ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారంటే ఏస్థాయిలో బెదిరించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అధికారి సెలవులో వెళ్లడంపై ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఒత్తిళ్లతో కాంట్రాక్టులు..     
ఏపీ ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలోని కర్నూలు సర్కిల్‌లో ఓ కాంట్రాక్టర్‌ వ్యవహరిస్తున్న తీరుతో ఉద్యోగులతోపాటు అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని గతంలో పనిచేసిన ఎస్‌ఈని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. చెప్పిందే తడవుగా పనులు చేసే పెట్టే పరిస్థితి నెలకొనడంతో ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఏకంగా ఆ కాంట్రాక్టర్‌కు 19 సబ్‌స్టేషన్లు అప్పగించారు. దీనికి తోడు స్పాట్‌ బిల్లింగ్‌ వసూలు, బ్లాక్‌ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌ సబ్‌స్టేషన్లునూ దక్కించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక పత్తికొండ పరిధిలోని సబ్‌స్టేషన్లు పొందడం మరో ఎత్తు. 

విచారించి..కాంట్రాక్ట్‌ రద్దు 
కోడ్‌ అమల్లో ఉండగా సబ్‌స్టేషన్ల కేటాయింపులు జరిగాయని వచ్చిన ఫిర్యాదుపై గత జాయింట్‌ కలెక్టర్‌–2 మణిమాల, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ లలిత, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ (తిరుపతి) వెంకటరత్నం విచారణ చేశారు. అన్నీ ధ్రువీకరణ కావడంతో సబ్‌స్టేషన్ల కాంట్రాక్టును రద్దు చేశారు.
 
అధికారులకు బెదిరింపులు.. 
సబ్‌స్టేషన్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేయడంతో జీర్ణించుకోలేని సదరు కాంట్రాక్టర్‌ అధికారులపై కాలు దువ్వుతున్నాడు. ‘నాకు ఉప కేంద్రాలు రాకుండా చేశారు.. నాకూ సమయం వస్తుంది... అప్పుడు చూస్తా.. అంటూ బెదిరిస్తుండటంతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతున్నారు. 

లాంగ్‌ లీవ్‌లో ఈఈ.. 
ఓర్వకల్లు ఏఈతోపాటు ఏడీఈపై కాంట్రాక్టర్‌ బెదిరింపు చర్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం. చివరగా ఈయన బెదరింపు చర్యలు, ఒత్తిళ్ల కారణంగా ఆదోని ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీరు లాంగ్‌ లీవ్‌లో వెళ్లారు. వ్యక్తిగత పనుల పేరుతో సెలవులో వెళ్లినా.. ఇటీవల అసలు విషయం బయటకు రావడం చర్చాంశనీయమైంది. కాంట్రాక్టర్‌ ఆగడాలను అరికట్టాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement