సిమెంట్ పూత కూడా పూర్తి కాకుండానే బిల్లులు చేసుకున్న చెక్‌డ్యామ్, పాత వాటికే రంగులు వేసి బిల్లులు మంజూరు చేసుకున్న చెక్‌డ్యామ్
నీరు–చెట్టు పేరుతో కనికట్టు చూపించే అక్రమార్కులకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ నీరు–చెట్టు పనులు నిలిపివేయాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. సర్కారు నిర్ణయంతో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పేరుతో రూ.కోట్లు
కొల్లగొట్టిన టీడీపీ నేతలు, వీరికి సహకరించిన కొందరు అధికారుల్లో గుబులు మొదలైంది.
సాక్షి, తిరుపతి/చిత్తూరు అగ్రికల్చర్: నీరు చెట్టు అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పనులు చెయ్యకున్నా... చేసినట్లు బిల్లులు చేసుకుని ప్రజాధనాన్ని దోపిడీ చేసే అవకాశం ఇక ఉండదు. అవసరం లేనిచోట తూతూ మంత్రంగా పనులు చేసి రూ.కోట్లు స్వాహా చేయడానికి వీలు కాదు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులే మళ్లీ చేసినట్లు చూపించి నిధులు కొల్లగొట్టాలని చూసే అక్రమార్కులకు రాష్ట్రప్రభుత్వం చెక్‌పెట్టింది. నీరు–చెట్టు పథకం కింద చేపట్టే పనులన్నింటినీ ఆపెయ్యమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అక్రమార్కులు షాక్‌కు గురయ్యారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది.
చెరువుల అభివృద్ధి పేరుతో టీడీపీ నాయకులు అందినకాడికి దోచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొందరు అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై సర్కారు నిధులు స్వాహా చేశారు. తాజా ప్రభుత్వ నిర్ణయంతో టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అడ్డుకట్టపడనుంది. రూ. కోట్ల ప్రజాధనం అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే అవకాశం దొరికిందని పలువురు సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు.
జిల్లాలో టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకం ద్వారా రూ. 748 కోట్ల అంచనాలతో 7,937 పనులు చేపట్టింది. అందులో 5,490 పనులు పూర్తిచేయగా, 2,447 పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి . చేపట్టిన పనుల్లో కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదు. ఈ పనుల్లో రూ. 10 లక్షలు దాటితే టెండర్ల ప్రక్రియలో పనులు చేపట్టాలి. రూ. 10 లక్షల కన్నా తక్కువగా ఉన్నా ఎలాంటి టెండరింగ్ లేకుండానే నామినేషన్ కింద పనులు చేసుకునే అవకాశం గత టీడీపీ ప్రభుత్వం కల్పించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న టీడీపీ నేతలు టెండర్లు పిలవాల్సిన ఉన్నా పిలిచే అవకాశాన్ని ఇవ్వలేదు. టెండర్లు పిలవాల్సిన ఒక్కో పనిని రెండు, మూడుగా విభజించి బినామీ పేర్లతో నామినేషన్ కింద పనులు దక్కించుకున్నారు.
పనులు దక్కించుకున్న అక్రమార్కులు పనులు చేపట్టకుండానే బిల్లులు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఉపా«ధి హామీ పథకం కింద గతంలో చేపట్టిన చెరువు పనులనే చూపెట్టి బిల్లులు చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. అవసరం లేని ప్రదేశాల్లో కూడా చెక్‌డ్యామ్‌లు, సఫ్లై ౖఛానల్స్ లాంటి పనులు నామమాత్రంగా చేపట్టి ప్రజాధనం లూటీచేశారు. మామూళ్లకు ఆశపడి కొందరు అధికారులు కూడా అక్రమార్కులకు అండగా నిలిచారు. దీంతో ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ నీరు–చెట్టు పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి.
చంద్రబాబు సొంత గ్రామ పరిధిలోనే...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగుర్రప్పగారిపల్లిలో నిర్మించిన చెక్‌డ్యామ్ నీరుచెట్లు అక్రమాలకు ప్రత్యక్ష నిదర్శనం .కనీసం సిమెంట్ పూత పని కూడా చేయకుండానే రూ.9 లక్షలు దండుకున్నారు. అదే ఊరికి సమీపంలోనే రూ.35 లక్షలతో నాలుగు చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. ఒక్కదానికి మాత్రమే నాణ్యతా పరీక్షలు జరిపి అదే సర్టిఫికెట్‌తో అన్నిటికీ బిల్లులు డ్రా చేసుకున్నారు. ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో బాయమ్మ చెరువు వంక, ఎద్దుల గుట్ట నుంచి బాయమ్మ చెరువుకు కలిసే వంకపై పక్కపక్కనే చెక్‌డ్యాంలు నిర్మిస్తున్నారు. నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణాలను స్థానికులు సైతం అడ్డుకున్నారు. ఒక్కొక్కటీ రూ.9.25 లక్షలతో చెక్‌డ్యామ్‌పై చెక్‌డ్యామ్ కట్టారు. ఇలా చంద్రగిరి నియోజక వర్గ పరిధిలో మూడేళ్లలో 808 పనులకు రూ.54.28 కోట్లను మంజూరు చేసుకున్నారు. వీటిలో ఎక్కువ భాగం పనులు చెయ్యకనే నిధులు డ్రా చేసుకుని జేబులు నింపుకున్నారు.
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో 2016 నుంచి రెండేళ్ల కాలంలో ఒక్కో చెరువును రెండు, మూడు పర్యాయాలు మరమ్మతులు చేసినట్లు బిల్లులు మంజూరుచేసుకున్నారు. పీలేరు పరిధిలో నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అనుచరులు చెరువు మరమ్మతులు, చెక్‌డ్యాంల పేరుతో రూ.13.5 కోట్లు స్వాహా చేశారు. ఎన్నికల ముందు జిల్లా స్థాయి అధికారి సహకారంతో టీడీపీ నేతలు ఒకే రోజు రూ.200 కోట్ల పనులకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. అయితే పనులేవీ చేపట్టకపోయినా... 25శాతం పనులు చేసినట్లు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో బిల్లులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
శ్రీరంగరాజపురం మండల పరిధిలో 312 పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. ఇలా జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు నీరు– చెట్టు పేరుతో రూ.కోట్లు స్వాహా చేశారు. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం అవినీతి లేని పాలన కోసం నడుం బిగించింది. నీరు–చెట్టు పనులను నిలిపివేయాలని గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెరువుల ఆయకట్టు కింద జరిగే పనుల్లో అవసరమైన చోట్ల పనులను మాత్రం చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు జలవనరులశాఖ అధికారులు ప్రస్తుతం జరుగుతున్న దాదాపు 2 వేల పనులను నిలుపుదల చేయనున్నట్లు సమచారం. నిలుపుదల చేస్తున్న పనుల జాబితాలను అధికారులు సేకరిస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు, టీడీపీ నేతల్లో గుబులు పుట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment