డక్కిలిలో నాసిరకంగా నిర్మించిన చెక్‌డ్యాం
వానొస్తే కొట్టుకుపోయే పనులు. కనిపించని చేసిన పనుల ఆనవాళ్లు. నాసిరకంగా చెక్‌డ్యాంలు. కాలువలు, చెరువుల్లో పూడిక తీత పనుల్లో అంతు లేని అవినీతి. గత ప్రభుత్వ పాలకుల అవినీతి దాహానికి రూ.కోట్లు కాలువల్లో కొట్టుకుపోయాయి. అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు నీరు–చెట్టు పనుల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి పనుల నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి.
సాక్షి, వెంకటగిరి: టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు–చెట్టు పనులు అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచాయి. నీరు–చెట్లు కింద కైవల్యా, గొడ్డెరు, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యాం పనులు ఇందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. టెండర్ల ద్వారా నిబంధనల మేరకు నిర్వహించాల్సిన పనులను విభజించి నామినేషన్ పద్ధతిలో కొన్ని, తనకు అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లకు టెండర్ల పేరుతో కట్టబెట్టారు. అయితే ఆయా పనుల్లో జరిగిన పనికంటే.. అవినీతే ఎక్కువనే ఆరోపణలు వెల్లువెత్తినా పర్యవేక్షణ చేపట్టాల్సిన సంబంధిత అధికారులూ పట్టించుకోలేదు. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారో.. అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడ్డారో తెలియదు కానీ ఆయా పనుల దారి దాపులకు కూడా వెళ్లిన పాపాన పోలేదు. ఆ నాటి పాలకులు చేసిన పనులకు ప్రస్తుతం ఆనవాళ్లు కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలోకి వచ్చిన రెండో ఏట నుంచి తెలుగు తమ్ముళ్లు దోపిడీకి తెరతీశారు.
రైతులకు ఉపయోగపడే జలవనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇరిగేషన్ శాఖ అధ్వర్యంలో సుమారు రూ.100 కోట్లతో నీరు– చెట్టు పథకం కింద వివిధ పనులు చేపట్టారు. ఆ నిధులతో నియోజకవర్గంలోని వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, కలువాయి, సైదాపుం మండలాల్లో చెక్‌డ్యాంల నిర్మాణం, తూములు నిర్మాణం, సప్లయీ చానల్స్ (వరవ కాలువలు) పూడిక తీత వంటి పనులు చేపట్టారు. అయితే ఆ పనులన్నీ నాసిరకంగా జరిగినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అవసరం లేని చోట కూడా చెక్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా భారీగా ప్రభుత్వ సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లినట్లు విమర్శలు వచ్చాయి. కొంత మంది కాంట్రాక్టర్లు వెలుగొండ కొండల నుంచి వచ్చే సప్లయి చానల్స్‌ను తూతూ మంత్రంగా పనులు చేసి అక్రమాలకు పాల్పడినటుŠల్ స్థానికులు ఆరోపించారు. డక్కిలి మండలంలో అయితే ఉపాధి హామీ పథకంలో చేసిన చెరువు పనులే చూపించి, ఆ పనులను నీరు– చెట్టు కింద చేసినట్లు చూపించి వచ్చిన నిధులు మెక్కేశారనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి.
నీరు–చెట్టు పథకం పనుల్లో ఎక్కువగా మాజీ ఎమ్మెల్యే సొంతూరు అయిన పాతనాలపాడు, మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం మాటుమడుగు, జెడ్పీటీసీ సభ్యుడు ఊరైన దేవునివెల్లంపల్లి, ఎమ్మెల్యేకు అనుచరులుగా ఉన్న డక్కిలి, దేవులపల్లిలో నిధులు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు ద్వారా తెలుస్తుంది. ఈ ఒక్కొక్క గ్రామంలో సుమారు రూ.కోటికి పైగా నీరు–చెట్టు నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. అవసరం లేకపోయినా నిధులను తమ జేబులోకి నింపుకునేందుకు అడ్డదారిలో అప్పట్లో టీడీపీ నేతలు పనులు చేసినట్లు విమర్శలు ఉన్నాయి.
కైవల్యా పనుల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు
కైవల్యా, గొడ్డేరు పూడికతీత పనులు రూ. లక్షల్లో పూర్తి చేయగలిగే పనులను రూ.కోట్లల్లో అంచనాలను సిద్ధం చేసి పనులు చేపట్టారు. నీరు– చెట్టు పనుల్లో ఎలా అడ్డంగా> దోచుకు తిన్నారో కైవల్యా పనులను పరిశీలిస్తే అర్థమవుతోంది. వానొస్తే కొట్టుకుపోయే పనులు ఎలా చేసినా ఏమీ కాదన్న ధీమాతో ప్రజాధనాన్ని అడ్డదారిలో లూటీ చేసేందుకు అప్పట్లో కైవల్యానది పూడికతీత పనులను ఎంపిక చేసుకున్నారు. నీరు–చెట్టు కింద 2017–18 సంవత్సరానికి వెంకటగిరి మండలంలోని పూలరంగడిపల్లి నుంచి బంగారుపేట వరకు కైవల్యానదిలో 4.7 కి.మీ. మేర పూడికతీత పనులకు అంచనాలు సిద్ధం చేశారు. మరో వైపు ఉన్న గొడ్డేరు వాగుకు సుమారు 2.4 కి.మీ.కు అంచనాలు రూపొందించారు. ఈ అంచనాల దశలోనే వెంకటగిరికి చెందిన టీడీపీ నేత జోక్యం చేసుకోవడంతో రూ.5.20 కోట్లతో పనులు సిద్ధం చేశారు.
ఎస్‌ఈ స్థాయిలో టెండర్లు జరిగేందుకు అవకాశం ఉన్న ఈ పనులను 12 ప్యాకేజీలుగా విభజించారు. రూ.50 లక్షల లోపు పనులను విభజించేలా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. టెండర్ల దశలోనే కాంట్రాక్టర్లు రింగ్‌గా మారి అన్నీ పనులను 9 శాతం లెస్‌తో ఐదు మంది కాంట్రాక్టర్లు చేజిక్కించుకున్నారు. రూ.కోట్ల రూపాయిల పనులను షార్ట్ టెండర్ల పేరుతో పిలవడం, హడావడిగా పనులు ఖరారు చేశారు. ఇరిగేషన్ శాఖలో గతంలో ఎప్పుడూ ఇలాంటి అక్రమాలు జరగలేదన్న వాదన వినిపించింది. గొడ్డేరు, కైవల్యానది నదుల్లో 7.2 కి.మీ. పూడికతీతను సుమారు రూ.4 లక్షల క్యూబిక్ మీటర్లు తరలించాలని అంచనాలు వేశారు. టీడీపీ నేత షాడో కాంట్రాక్టర్‌గా వ్యవహరించడంతో 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించాలని అంచనాల్లో ఉన్నా.. పని పూర్తయ్యేటప్పటికి 30 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల మేర పూడిక మట్టిని మాత్రమే తరలించారని విమర్శలు ఉన్నాయి.
అంచనాల్లో చూపిన విధంగా 4 లక్షల క్యూబిక్ మీటర్లు పూడిక మట్టి ఎక్కడా లేకపోవడం గమనార్హం. విచారణ జరిగితే పూడిక తీసిన మట్టి ఎక్కడ చూపుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. నదులకు ఇరువైపులా పూడికతీత మట్టిని కట్టలుగా పోయకూడదన్న నిబంధన ఉన్నా, కట్టలు వేసి అక్కడి నుంచి లోతు ఎక్కువగా పూడిక తీసినట్లు రికార్డుల్లో నమోదు చేయించి బిల్లులు పొందేందుకు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి ప్రకటనతో అక్రమార్కుల గుండెల్లో గుబులు
అవినీతి నిర్మూలనకు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా నీరు– చెట్టు పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను రంగంలోకి దింపింది. దీనికి కొనసాగింపుగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో నీరు– చెట్టు పనుల్లో అవినీతి అంశంపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్‌శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతలు మెక్కిన నిధులు కక్కిస్తామని చేసిన ప్రకటన అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో గుబులు మొదలైంది రెండు మూడు రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment