ఉదయగిరి చెరువు పూడికతీత పనులు జరగకముందు చిత్రం
తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ‘నీరు–చెట్టు’అవినీతికి మారుపేరుగా నిలిచింది. ఈ పథకం కింద ఉదయగిరి చెరువు పూడికతీత పనుల పేరుతో రూ.లక్షలు మింగేశారు. అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలముందు అభివృద్ధి పేరుతో పట్టణ ముఖద్వారం వద్ద ఉన్న చెరువు పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారు.
సాక్షి, ఉదయగిరి: గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ రూపురేఖలే మార్చేస్తానని పలుమార్లు ఉదయగిరి పట్టణంలో జరిగిన సమావేశాల్లో గొప్పలు చెప్పారు. ఐదేళ్లపాటు చెరువు అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాల్లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో పట్టణానికి వచ్చిన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అభ్యర్థన మేరకు అధ్వానంగా ఉన్న ట్యాంక్‌బండ్ అభివృద్ధి కోసం నిధులు మంజూరుచేశారు. ఆ నిధులతో పనులు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి వైఎస్సార్‌సీపీలో కొనసాగటం, అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసే అవకాశం మేకపాటికి దక్కలేదు.
మళ్లీ వచ్చిన ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ట్యాంక్‌బండ్ అభివృద్ధిని ఉదయగిరి ముఖద్వారపు రూపురేఖలు మారుస్తానని చెప్పినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. కనీసం గతంలో ఆగిపోయిన ముఖద్వారం పనులు కూడా పూర్తిచేయలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణ ప్రజలను మభ్యపెట్టే నిమిత్తం, స్థానిక నేతలకు ఆదాయం సమకూర్చే నిమిత్తం ఉదయగిరి చెరువు పూడికతీత కోసమని రూ.34 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. తూతూమంత్రంగా పనులుచేసి అందులో రూ.18 లక్షలకు రికార్డు చేశారు. కేవలం రెండు మూడు లక్షలకంటే ఎక్కువ పనులు జరగలేదని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా అధికారులు లెక్కచేయకుండానే అధిక మొత్తంలో ఎంబుక్‌లు రికార్డు చేశారని ఆరోపణలున్నాయి. తదనంతరం ప్రభుత్వం మారటంతో మరింత నిధులు దోపిడీకి అడ్డుకట్ట పడింది. ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అవినీతిని వెలికితీస్తాం
ఉదయగిరి ఆనకట్ట పూడికతీత పనుల పేరుతో అవినీతి జరిగింది. తూతూమంత్రంగా పనులు చేసి రూ.లక్షలు దిగమింగారు. అందరి కళ్లెదుటే ఈ దోపిడీ జరిగింది. కొంతమంది స్థానిక నేతలు ప్రజాధనం దోచేశారు. ఈ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రతిపక్షంగా తాము అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఎమ్మెల్యేగా ఈ పనులపై పూర్తిస్థాయి విచారణ చేయించి అందులో భాగస్వామ్యం ఉన్న కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకుంటాం.
– మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి
Comments
Please login to add a commentAdd a comment