సాక్షి, అమరావతి: నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో గత టీడీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతిపై విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. నీరు– చెట్టు పేరుతో టీడీపీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ఒకే రకమైన పనులను మంజూరు చేసింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువులు, వాగుల్లో కూలీలతో చేపట్టిన పూడికతీత పనులను నీరు– చెట్టు కార్యక్రమాల్లో కూడా చేసినట్టు చూపి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఇటీవల శాసనసభ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు నీరు– చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణకు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో విజిలెన్స్ అధికారులు నీరు– చెట్టు కార్యక్రమంతో సంబంధం ఉండి వివిధ శాఖల ద్వారా చేపట్టిన పనుల వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నీరు – చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన అన్ని పనుల వివరాలు కావాలంటూ విజిలెన్స్ అధికారులు ఆయా జిల్లాల్లోని డ్వామా పీడీలకు లేఖలు రాశారు. కాగా, ఉపాధి హామీ పథకం నిర్వహణకు గత నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.19,816 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది.
క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్న అధికారులు
2015–19 మధ్య కాలంలో ఉపాధి హామీ పథకంలో 37.44 లక్షల పనులు పూర్తయినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. మరో 20 లక్షల వరకు పనులు పురోగతిలో ఉన్నాయని అంటున్నారు. వీటిలో 80 శాతం వరకు నీరు– చెట్టు కార్యక్రమానికి అనుబంధంగా చేపట్టిన పనులకే ఖర్చు చేసినట్టు టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. దీంతోపాటు జలవనరుల శాఖ, అటవీ శాఖల ద్వారా కూడా వేల కోట్ల రూపాయల విలువైన పనులు చేసినట్టు బిల్లులు పెట్టుకుని స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు మొదట అన్ని శాఖల్లో ‘నీరు–చెట్టు’లో భాగంగా మంజూరు చేసిన పనుల వివరాలను తెప్పిస్తారు. ఒకే పని రెండు, మూడు శాఖల ద్వారా మంజూరైందో, లేదో పోల్చి చూస్తారు. తర్వాత జరిగిన పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment