తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మెడ్‌టెక్ జోన్‌లో రూ.20 కోట్ల వ్యయంతో పరిపాలనా భవనం నిర్మించారు. అది ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే లోపల ఫ్లోరింగ్ 3 అడుగుల మేర కుంగిపోయింది. దీంతో మొత్తం తవ్వేసి, మళ్లీ కాంక్రీట్‌తో ఫ్లోరింగ్ వేశారు.
(విశాఖ జిల్లా మెడ్‌టెక్ జోన్ నుంచి గుండం రామచంద్రారెడ్డి): విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. వైద్య ఉపకరణాల తయారీ కోసం ప్రారంభించిన ఈ జోన్‌లో రెండున్నరేళ్లుగా ఉత్పత్తులేవీ బయటకు రాలేదు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.450 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. భవనాలు సైతం నాసిరకంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెడ్‌టెక్ జోన్ ద్వారా రూ.5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని, 20,000 మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. రూ.వందల కోట్ల విలువైన 270 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించింది. నాలుగు భవనాలు నిర్మించి, అరచేతిలో స్వర్గం చూపింది. కానీ, ఇప్పటికీ పట్టుమని పది ఉద్యోగాలు కూడా రాలేదు.
ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకూ వచ్చింది కేవలం 10 కంపెనీలే. అవికూడా చిన్నచిన్న అంకుర సంస్థలే. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోయాయి. ఓక్సిల్ గ్రిడ్స్, ఎస్‌ఎస్ మేజర్, ఫీనిక్స్ వంటి కంపెనీలు ఒప్పందం చేసుకున్నా పనులు చేపట్టే పరిస్థితి లేక నిస్సహాయంగా మిగిలాయి. టీడీపీ సర్కారు హయాంలో ప్రారంభమైన మెడ్‌టెక్ జోన్ అనేది పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోన్ ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడ్‌టెక్ జోన్‌లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణకు అక్కడి ప్రతినిధులు తమకు సహకరించడం లేదని విజిలెన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తాము ఇక్కడ ఉండలేమని పెట్టుబడిదారులు తేల్చిచెబుతున్నారు.
తనను మెడ్‌టెక్ జోన్ సీఈవో మోసం చేశాడని తమిళనాడు పారిశ్రామిక వేత్త రాసిన లేఖలోని భాగం
విడి భాగాల తయారీ బోగస్
ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ యంత్రాల విడిభాగాలను ఇకపై మెడ్‌టెక్ జోన్‌లో తయారు చేస్తారని, ఫలితంగా వాటి ధర భారీగా తగ్గుతుందని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంతా బోగస్ అని తేటతెల్లమైంది. విడిభాగాల తయారీ కోసం రూ.10 కోట్ల వ్యయంతో నిరి్మంచిన భవనం ఖాళీగా ఉంది. ఇప్పటివరకూ ఎలాంటి ఉత్పత్తులూ లేవు. అప్పట్లో క్యూరా హెల్త్‌కేర్ అనే సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయింది. రూ.15 కోట్ల వరకూ వెచ్చించి మెడ్‌టెక్ జోన్‌లో ల్యాబొరేటరీ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించుకోవడానికి కంపెనీలు లేకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి.
పరిశ్రమల శాఖ ప్రమేయం లేకుండా...
రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖతో సంబంధం లేకుండా మెడ్‌టెక్ జోన్‌లో ఓ సమాంతర వ్యవస్థ రాజ్యమేలుతోంది. సాధారణంగా ప్రభుత్వం, పరిశ్రమల శాఖ అనుమతితోనే కొత్త పరిశ్రమలు వస్తుంటాయి. మెడ్‌టెక్ జోన్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రభుత్వానికి సమాచారమే ఉండడం లేదు. పరిశ్రమల శాఖ ఇచ్చే రాయితీలు తమకు అందడం లేదని మెడ్‌టెక్ జోన్‌లోని పెట్టుబడిదారులు వాపోతున్నారు.
ప్రోత్సాహమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా?
మెడ్‌టెక్ జోన్‌లో జరుగుతున్నది పరిశ్రమలకు ప్రోత్సాహమో, రియల్ ఎస్టేట్ వ్యాపారమో అర్థం కావడం లేదు. ఈ జోన్‌లో పరిశ్రమ స్థాపించడానికి ముందుకొచ్చా. రూ.11 లక్షలు చెల్లించి, నేను చేసుకున్న ఒప్పందాన్ని అర్ధంతరంగా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేశారు. నేను చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగినందుకు నాకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నా కంపెనీపై దు్రష్పచారం చేశారు. అందుకే రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా.
– గోపీనాథ్, డైరెక్టర్, ఆన్‌లైన్ సర్జికల్స్, చెన్నై
మెడ్‌టెక్ జోన్‌లోకి అనుమతించలేదు
మెడ్‌టెక్ జోన్ విషయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. నన్ను ప్రశ్నించే స్థాయి మీకు లేదని మెడ్‌టెక్ జోన్ సీఈవో అంటున్నారు. విచారణకు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. మాకేమీ తెలియదు అని వారు చెబుతున్నారు. విచారణ చేపట్టడానికి మెడ్‌టెక్ జోన్‌లోకి మమ్మల్ని అనుమతించలేదు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు.
– విజిలెన్స్ అధికారుల బృందం, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment