Industry Department
-
ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోకి భారీ ప్రాజెక్టులను ఆకర్షించే విధంగా ఐటీ బ్రాండింగ్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ) విధానం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్‌పై మరింత ఫోకస్ చేయాలని సూచించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానం గురించి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వివరించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో పెద్దస్థాయి ఐటీ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత 29 చోట్ల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని డిసెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం విద్యుత్ కొరతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ కేంద్రాలకు కొరత లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేంద్రంలో పవర్ బ్యాకప్ కోసం యూపీఎస్, జనరేటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కంపెనీలను ఆకర్షించవచ్చన్నారు. ఈ 29 కేంద్రాలకు అవసరమైన బ్యాండ్‌విడ్త్ సదుపాయాన్ని సత్వరమే కల్పించాలని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డిని ఆయన ఆదేశించారు. ఈ సమీక్షలో ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ బంగార్రాజు, ఏపీఎన్ఆర్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు అతి తక్కువ సమయంలో చౌకగా సరుకు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం త్వరలోనే కొత్త లాజిస్టిక్ విధానం తీసుకొస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం గతి శక్తి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మేకపాటి అనంతరం రాష్ట్ర లాజిస్టిక్ పాలసీపై భాగస్వాములతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టుల నిర్మాణంతో పోర్టుల సామర్థ్యం అదనంగా 350 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పోర్టుల వద్ద రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. -
కొత్త ఐటీ కొలువులు.. 46,489
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 మహమ్మారి తీవ్రత నెలకొని ఉన్నా రాష్ట్ర ఐటీ రంగం 2020–21లో 46,489 కొత్త కొలువులను సృష్టించింది. దీంతో రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 6,28,615?కు పెరిగింది. 2019–20తో పోల్చితే 2020–21లో ఉద్యోగాల్లో 7.99% వృద్ధి నమోదైంది. మంత్రి కేటీఆర్ గురువారం ఇక్కడ విడుదల చేసిన రాష్ట్ర ఐటీ శాఖ వార్షిక నివేదిక 2020–21 ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. 12.98 శాతం వృద్ధితో రాష్ట్రం ఈ ఏడాది రూ.1,45,522 కోట్లు విలువ చేసే ఐటీ/ఐటీ రంగ సేవలను ఎగుమతి చేసింది. ►డేటా సెంటర్లకు హైదరాబాద్ నిలయంగా మారింది. రూ.20,761 కోట్ల పెట్టుబడులతో అమెజాన్ డేటా సర్వీసెస్ సంస్థ ఫ్యాబ్ సిటీ, ఫార్మాసిటీ, చందన్వెల్లిలో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ►రూ.500 కోట్లతో హైదరాబాద్‌లో స్మార్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషర్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ప్రకటించింది. ►హైదరాబాద్‌లో సేల్స్ ఫోర్స్ కంపెనీ తమ కార్యకలాపాలను ‘వీ–సెజ్’ద్వారా మూడు రేట్లు విస్తరింపజేయనుంది. రూ. 119 కోట్లతో 2,500 మందికి ఉద్యోగాలు అందించనుంది. ►భారత్‌లో గ్లోబల్ షేర్డ్ సరీ్వసెస్ నెలకొల్పడానికి గోల్డ్‌మ్యాన్ సాచ్స్ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. ►ఒప్పో హైదరాబాద్‌లోని తమ ఆర్అండ్డీ కేంద్రంలో తొలి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ►యూఎస్‌కు చెందిన బీఎఫ్ఎస్ఐ మేజర్ మాస్‌మ్యూచువల్ సంస్థ రూ.1,000 కోట్లతో హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపాసిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 300 మందికి ఉగ్యోగాలు లభిస్తాయి. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీ స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మంచి స్పందన లభించింది. వరంగల్‌లో 1,400 సీటింగ్ కెపాసిటీతో ఐటీ టవర్/ఇన్క్యూబేషన్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభించింది. ►కరీంనగర్లో 80 వేల చదరపు అడుగుల స్థలంతో ఐటీ టవర్‌ను ప్రారంభించారు. ఇది 18 కంపెనీలు, 556 సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ►ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభించగా, ఇక్కడ 19 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ►నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. నల్లగొండ, రామగుండం, వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం జరగనుంది. -
విదేశీ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అమెరికా, యూరప్, జపాన్, తైవాన్, వియత్నాం, కొరియా, మధ్య ఆసియా దేశాలకు చెందిన కంపెనీలను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధ్యక్షతన పరిశ్రమలు, ఆర్థిక, జలవనరులు, ఇంధన, ఐటీ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. విదేశీ ఇన్వెస్టర్లను గుర్తించి వారితో సంప్రదించే విషయంలో రాష్ట్ర ఎకనామిక్ డవలప్మెంట్ బోర్డు ఈ టాస్క్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించి బుధవారం పరిశ్రమలశాఖ మంత్రి చాంబర్లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కోవిడ్ నేర్పిన గుణపాఠంతో ప్రపంచవ్యాప్తంగా తయారీ కంపెనీలు చైనా వంటి ఒకే దేశంపై ఆధారపడకూడదని నిర్ణయించాయని, వీటికి భారతదేశం ఒక చక్కటి అవకాశంగా కనిపిస్తుండటంతో ఈ అవకాశాన్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించారు. సమావేశ అనంతరం మంత్రి మేకపాటి సాక్షితో మాట్లాడుతూ.. ► ఒక పక్క కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూనే లాక్డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ► ఎంఎస్ఎంఈలను ఆదుకుంటూ ఒక ప్రత్యేక పాలసీని ప్రకటించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులకు ఎక్కింది. పరిశ్రమల అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ నిబద్ధతకు ఇది నిదర్శనం. ► ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రకటన సందర్భంగా మాట్లాడిన మాటల్లో అధిక శాతం ముఖ్యమంత్రి సూచించిన అంశాలే ఉన్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు బకాయిపడిన రూ. 905 కోట్లు రెండు విడతలుగా ఇవ్వనున్నాం. తొలివిడతగా మే 22న రూ. 450 కోట్లు విడుదల చేస్తాం. దీనివల్ల సుమారు 11,300 ఎంఎస్ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ► లాక్డౌన్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమలు తిరిగి ప్రారంభించడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక ఉత్పత్తి క్రమేపీ పెరుగుతోంది. ► ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ► ఒక బహుళజాతి సంస్థపై విచారణలో అంతర్జాతీయ నిబంధనలు పాటించాలి. ఇది తెలిసి కూడా ప్రతిపక్షం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. ► ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ఉన్న ట్యాంకుల డిజైన్‌లో లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించాం. మూతపడిన చక్కెర మిల్లులు ప్రారంభిస్తాం రాష్ట్రంలో మొత్తం 10 సహకార చక్కెర కర్మాగారాలకు గాను 6 మూతపడ్డాయని, వీటిని తిరిగి ప్రారంభించేందుకు నివేదిక తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు మంత్రి మేకపాటి తెలిపారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల పరిస్థితిపై పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాల కొండయ్య, కమిషనర్ వెలమా రవిలతో మంత్రి సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరగే సమీక్ష సమయానికి పూర్తి నివేదికలు సిద్ధం చేసుకొని తీసుకురావాలని ఆదేశించారు. -
ప్రజాధనం వృథా కానివ్వను
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా.. ప్రజా సేవకుడిగా ప్రతి పైసా సద్వినియోగం అయ్యే విధంగా విధులు నిర్వహిస్తానని జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ బులుసు శివశంకరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పారదర్శకంగా, మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి ఏపీ మౌలిక సదుపాయాల (న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం దోహదం చేస్తుందన్నారు. శనివారం సచివాలయంలో జ్యుడీషియల్ ప్రివ్యూ జడ్జిగా జస్టిస్ శివశంకరరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు ఇటువంటి పారదర్శకమైన చట్టం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం, దానికి తనను తొలి జడ్జిగా నియమించి రాష్ట్రానికి సేవలందించే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పారదర్శకంగా మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళుతూ పర్యావరణాన్ని కాపాడుతూ సకాలంలో పూర్తయ్యేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరు రాజ్యాంగంలోని 51ఏ నిబంధన కల్పించిన హక్కులు గురించి మాట్లాడతారని, హక్కుల గురించి మాట్లాడే వారు వారి బాధ్యతల గురించి కూడా తెలుసుకుని వాటిని సక్రమంగా నెరవేర్చాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, న్యాయశాఖ కార్యదర్శి మనోహర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జస్టిస్ శివశంకరరావు తాడేపల్లి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. -
మెడ్‌టెక్ మాయ
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మెడ్‌టెక్ జోన్లో రూ.20 కోట్ల వ్యయంతో పరిపాలనా భవనం నిర్మించారు. అది ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే లోపల ఫ్లోరింగ్ 3 అడుగుల మేర కుంగిపోయింది. దీంతో మొత్తం తవ్వేసి, మళ్లీ కాంక్రీట్‌తో ఫ్లోరింగ్ వేశారు. (విశాఖ జిల్లా మెడ్‌టెక్ జోన్ నుంచి గుండం రామచంద్రారెడ్డి): విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. వైద్య ఉపకరణాల తయారీ కోసం ప్రారంభించిన ఈ జోన్లో రెండున్నరేళ్లుగా ఉత్పత్తులేవీ బయటకు రాలేదు. ఇప్పటిదాకా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రూ.450 కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయింది. భవనాలు సైతం నాసిరకంగా ఉండటంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మెడ్‌టెక్ జోన్ ద్వారా రూ.5,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని, 20,000 మందికి ఉద్యోగాలిస్తామని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. రూ.వందల కోట్ల విలువైన 270 ఎకరాల భూమిని ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీకి అప్పగించింది. నాలుగు భవనాలు నిర్మించి, అరచేతిలో స్వర్గం చూపింది. కానీ, ఇప్పటికీ పట్టుమని పది ఉద్యోగాలు కూడా రాలేదు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటివరకూ వచ్చింది కేవలం 10 కంపెనీలే. అవికూడా చిన్నచిన్న అంకుర సంస్థలే. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక కొన్ని కంపెనీలు ఒప్పందాలు రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోయాయి. ఓక్సిల్ గ్రిడ్స్, ఎస్ఎస్ మేజర్, ఫీనిక్స్ వంటి కంపెనీలు ఒప్పందం చేసుకున్నా పనులు చేపట్టే పరిస్థితి లేక నిస్సహాయంగా మిగిలాయి. టీడీపీ సర్కారు హయాంలో ప్రారంభమైన మెడ్‌టెక్ జోన్ అనేది పెద్ద కుంభకోణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోన్ ముసుగులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీగా నిధులు కొల్లగొట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెడ్‌టెక్ జోన్లో చోటుచేసుకున్న అవినీతిపై విచారణకు అక్కడి ప్రతినిధులు తమకు సహకరించడం లేదని విజిలెన్స్ విభాగం అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దితే తప్ప తాము ఇక్కడ ఉండలేమని పెట్టుబడిదారులు తేల్చిచెబుతున్నారు. తనను మెడ్‌టెక్ జోన్ సీఈవో మోసం చేశాడని తమిళనాడు పారిశ్రామిక వేత్త రాసిన లేఖలోని భాగం విడి భాగాల తయారీ బోగస్ ఎంఆర్ఐ, సీటీ స్కాన్ యంత్రాల విడిభాగాలను ఇకపై మెడ్‌టెక్ జోన్లో తయారు చేస్తారని, ఫలితంగా వాటి ధర భారీగా తగ్గుతుందని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంతా బోగస్ అని తేటతెల్లమైంది. విడిభాగాల తయారీ కోసం రూ.10 కోట్ల వ్యయంతో నిరి్మంచిన భవనం ఖాళీగా ఉంది. ఇప్పటివరకూ ఎలాంటి ఉత్పత్తులూ లేవు. అప్పట్లో క్యూరా హెల్త్‌కేర్ అనే సంస్థ టెండర్లు దక్కించుకుంది. ఇప్పుడు అడ్రస్ లేకుండాపోయింది. రూ.15 కోట్ల వరకూ వెచ్చించి మెడ్‌టెక్ జోన్లో ల్యాబొరేటరీ పరికరాలు ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించుకోవడానికి కంపెనీలు లేకపోవడంతో వృథాగా పడి ఉన్నాయి. పరిశ్రమల శాఖ ప్రమేయం లేకుండా... రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమల శాఖతో సంబంధం లేకుండా మెడ్‌టెక్ జోన్లో ఓ సమాంతర వ్యవస్థ రాజ్యమేలుతోంది. సాధారణంగా ప్రభుత్వం, పరిశ్రమల శాఖ అనుమతితోనే కొత్త పరిశ్రమలు వస్తుంటాయి. మెడ్‌టెక్ జోన్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోందో ప్రభుత్వానికి సమాచారమే ఉండడం లేదు. పరిశ్రమల శాఖ ఇచ్చే రాయితీలు తమకు అందడం లేదని మెడ్‌టెక్ జోన్‌లోని పెట్టుబడిదారులు వాపోతున్నారు. ప్రోత్సాహమా? రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మెడ్‌టెక్ జోన్లో జరుగుతున్నది పరిశ్రమలకు ప్రోత్సాహమో, రియల్ ఎస్టేట్ వ్యాపారమో అర్థం కావడం లేదు. ఈ జోన్లో పరిశ్రమ స్థాపించడానికి ముందుకొచ్చా. రూ.11 లక్షలు చెల్లించి, నేను చేసుకున్న ఒప్పందాన్ని అర్ధంతరంగా ఎలాంటి కారణం చూపకుండానే రద్దు చేశారు. నేను చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వాలని అడిగినందుకు నాకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న నా కంపెనీపై దు్రష్పచారం చేశారు. అందుకే రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేస్తా. – గోపీనాథ్, డైరెక్టర్, ఆన్లైన్ సర్జికల్స్, చెన్నై మెడ్‌టెక్ జోన్లోకి అనుమతించలేదు మెడ్‌టెక్ జోన్ విషయంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. నన్ను ప్రశ్నించే స్థాయి మీకు లేదని మెడ్‌టెక్ జోన్ సీఈవో అంటున్నారు. విచారణకు కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తున్నారు. మాకేమీ తెలియదు అని వారు చెబుతున్నారు. విచారణ చేపట్టడానికి మెడ్‌టెక్ జోన్లోకి మమ్మల్ని అనుమతించలేదు. కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. – విజిలెన్స్ అధికారుల బృందం, ఆంధ్రప్రదేశ్ -
ఫేమ్–2 పథకాన్ని నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచే దిశగా ఫేమ్–2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధరపై వినియోగదారులకు సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం కింద రూ.10,000 కోట్లను కేంద్రం కేటాయించింది. ‘‘దేశంలో ఎలక్ట్రిక్ రవాణాను వేగంగా అమల్లోకి తీసుకురావడంతోపాటు, తయారీ వ్యవస్థ అభివృద్ధి కోసం, 2019 ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ల కాలానికి ఈ పథకం అమలును ప్రతిపాదించడం జరిగింది’’అని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. ఈ పథకం రెండో దశ కింద 10 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గరిష్టంగా ఒక్కో వాహనానికి ఎక్స్ ఫ్యాక్టరీ ధరపై రూ.20,000 వరకు ప్రోత్సాహకం లభించనుంది. అలాగే, 5 లక్షల ఈ రిక్షాలకు ఎక్స్ ఫ్యాక్టరీ ధర రూ.5 లక్షలపై రూ.50,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇక 35,000 ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాలకు (ఎక్స్ ఫ్యాక్టరీ ధర రూ.15 లక్షల వరకు), ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.35,000 వరకు రాయితీ లభిస్తుంది. అలాగే, 7,090 ఈ బస్సులకు ఒక్కో దానికి రూ.50 లక్షల సబ్సిడీ లభించనుంది. 2019–20 సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020–21లో రూ.5,000 కోట్లు, 2021–22లో రూ.3,500 కోట్లను వాహన కొనుగోళ్ల రాయితీలకు కేటాయించారు. బస్సులకు వాటి ధరలో గరిష్టంగా 40 శాతం, ఇతర వాహనాలకు 20 శాతంగా ప్రోత్సాహకాన్ని పరిమితం చేశారు. ఈ ప్రోత్సాహకాలను వార్షికంగా లేదా ధరల మార్పులు, ఉపకరణాల మార్కెట్ ధరలకు అనుగుణంగా ముందే సవరించొచ్చని నోటిఫికేషన్ తెలిపింది. -
సిరిసిల్లలో అపెరల్ సూపర్ హబ్!
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల వస్త్ర పారిశ్రామికవాడలో ఆధునిక యంత్ర పరికరాలతో అపెరల్ సూపర్ హబ్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రముఖ వస్త్ర ఉత్పత్తి సంస్థ ‘కే వెంచర్స్’ఈ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖతో కే వెంచర్స్ సంస్థ మంగళవారం సచివాలయంలో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని 60 ఎకరాల్లో వస్త్ర పారిశ్రామికవాడను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండగా, అందులోని 20 ఎకరాల్లో 5,000 కుట్టు యంత్రాల యూనిట్లు సహా ఎంబ్రాయిడరీ, ప్రింటింగ్, వాషింగ్ తదితర యంత్ర పరికరాలతో హబ్ ఏర్పాటు కానుంది. 3 విడతలుగా మూడేళ్లలో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 15 వేల మంది, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి లభించనుందని.. అందులో 90% మహిళలే ఉంటారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ జనాభా 75 వేలని, ఈ పరిశ్రమ ద్వారా 30 వేల మందికి జీవనోపాధి లభిస్తుం దని చెప్పారు. హబ్ ఏర్పాటుకు కే వెంచర్స్ రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుందని, ప్రాజె క్టుకు మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అందించనుందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న చేనేత, పవర్‌లూం రంగ కుటీర పరిశ్రమలన్నింటినీ సమీకరించి వర్క్ ఆర్డర్లు ఇప్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు అపెరల్ సూపర్ హబ్ కృషి చేస్తుందన్నారు. ప్రాజెక్టులో భాగంగా వచ్చే నెలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తారని, మరో ఏడాదిలోపు తొలి దశ ప్రాజెక్టు కింద వస్త్ర ఉత్పత్తులు ప్రారంభమవుతాయని చెప్పారు. పరిశ్రమ ద్వారా ఏటా 25 లక్షల వస్త్రాలు ఉత్పత్తి అవుతాయన్నారు. సూపర్ హబ్ నుంచి అరవింద్, శ్యాం లాంటి ప్రముఖ బ్రాండ్ల వస్త్ర ఉత్పత్తులు జరిపేందుకు ఆయా కంపెనీలతో కే వెంచర్స్ చర్చలు జరుపుతోందని మంత్రి చెప్పారు. గుండ్ల పోచంపల్లిలో ఫ్యాషన్ సిటీ కాకతీయ టెక్స్టైల్స్ పార్కులో కొరియాకు చెందిన యాంగ్వాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుందని, దీని ద్వారా 8 వేల మందికి ఉపాధి లభించనుందని మంత్రి వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న గుండ్ల పోచంపల్లి వస్త్ర పారిశ్రామికవాడను ఉపయోగంలోకి తీసుకొస్తామని, దీని ద్వారా 25 వేల మంది చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. నిఫ్ట్ డైరెక్టర్‌గా పని చేసిన డాక్టర్ రాజారాంను ఈ పారిశ్రామికవాడకు సీఈఓగా నియమించామన్నారు. మార్కెట్లోకి వస్తున్న ఫ్యాషన్ కొత్త పోకడలను అనుసరిస్తేనే వస్త్ర వ్యాపారం వృద్ధి చెందుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గుండ్ల పోచంపల్లిలో 10 ఎకరాల్లో ఫ్యాషన్ సిటీ ఏర్పాటు చేసేందుకు యాంగ్వాన్ కంపెనీ ముందుకు వచ్చిందని తెలిపారు. వస్త్ర పరిశ్రమ రంగంలో కోయంబత్తూరు, కరూరు, తిరుచూరులతో తెలంగాణ పోటీపడాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, కే వెంచర్స్ సీఈఓ ఎస్.సుసింద్రన్, సిరిసిల్ల మునిసిపల్ చైర్మన్ పావని తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
-
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం
సాక్షి, హైదరాబాద్: ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూల ప్రదేశమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఆటోమోబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయని, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో నిలిచేందుకు మొబిలిటీ రీసెర్చ్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో సియామ్, సమావేశంలో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (అక్మా) సంస్థలతో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిన ప్రగతి, ఆకర్షించిన భారీ పెట్టుబడులు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి కేటీఆర్ సియామ్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ సరఫరాకు ఏ కొరత లేదని ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు సంపూర్ణ సహకారంతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వమే ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో టాస్క్ ద్వారా శిక్షణ ఇచ్చి అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ పాలసీలు భేష్..సియామ్ ప్రతినిధులు హైదరాబాద్‌లో బిర్యానీ బాగుందని, అంతకుమించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని సియామ్ ప్రతినిధులు కితాబిచ్చారు. తెలంగాణను డైనమిక్ స్టేట్‌గా చూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పాలసీలను తాము ఇప్పటికే గుర్తించామని, పెట్టుబడులకు ఊతమిస్తున్న తీరు, మద్దతుపై మంత్రికి అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి రేటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో మానవ వనరులు, ఇతర మౌలిక వసతులు ఆటోమొబైల్‌రంగ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలు బాగున్నాయన్న ప్రతినిధులు... ఈ రంగంపై పాలసీల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అవకాశాలపై ఆశావహంగా ఉన్నామని, ఈ ప్రయత్నాలకు ప్రభుత్వ పాలసీ మద్దతు కోరుతున్నామని తెలిపారు. క్లీన్ టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రికల్, హైబ్రీడ్ వాహనాలదే భవిష్యత్తు అని మంత్రికి సియామ్ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఏటా 2.8 కోట్ల వాహనాలు తయారవుతున్నాయని, వాటిలో 25 లక్షల వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఈ రంగంలో మరింత పెరుగుదలకు అవకాశం ఉందన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు కొనసాగింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు మరో ఆరు నెలల పాటు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఫేమ్ ఇండియా పథకం వచ్చే ఏడాది మార్చి 31 వరకు లేదా నీతి ఆయోగ్ ఈ పథకం రెండో దశను ప్రారంభించే వరకు అమల్లో ఉంటుందని భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్లో తెలిపింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బైక్ అయితే రూ.29,000 వరకు, కారు అయితే రూ.1.38 లక్షల వరకు కొనుగోలు దారులకు రాయితీ లభిస్తుంది. 2030 నాటికి నూరుశాతం ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన దేశంగా అవతరించాలనే లక్ష్యాన్ని కేంద్రం విధించుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫేమ్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో రెండేళ్ల కాలానికి, వచ్చే ఏడాది మార్చి వరకు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది మార్చితో గడువు తీరిపోగా, తర్వాత దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించారు. తాజాగా మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
నగరం నుంచి 1,160 పరిశ్రమల తరలింపు
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం నుంచి కాలు ష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డుకు అవతలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. నగరం లో 1,545 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పీసీబీ గుర్తించిందని, అందులో 385 పరిశ్రమలు ఇప్పటికే ఓఆర్ఆర్ బయట ప్రాంతం లో ఉన్నాయన్నారు. మిగిలిన 1,160 పరిశ్రమలను హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాంతానికి తరలించాలనే ప్రతి పాదన ఉందని పేర్కొన్నారు. కాలుష్య కారక పరిశ్రమల తరలింపుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి పరిశ్రమల తరలింపు కోసం ఓఆర్ఆర్కు 100 కి.మీ.ల పరిధిలో పలుచోట్ల స్థలాలను టీఎస్ఐఐసీ గుర్తించిందని వెల్లడించారు. తర లింపు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. -
ఢిల్లీకి ర్యాంకింగ్ పంచాయితీ
డిప్‌కు ఆధారాలు సమర్పించిన పరిశ్రమల కమిషనర్ సాక్షి, హైదరాబాద్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) ర్యాంకుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందంటూ ఆరోపించిన తెలంగాణ.. ఈ అంశాన్ని మరింత బలంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయింది. ‘ఏపీ.. కాపీ’ వ్యవహారంపై ఇప్పటికే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు.. అందుకు సంబంధించిన ఆధారాలను కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి (డిప్) సమర్పించింది. తాజాగా కాపీ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సమర్పించడంతో పాటు.. ర్యాంకింగ్‌లో పూర్తి పారదర్శకతను పాటించాలని కోరేందుకు పరిశ్రమల శాఖ కమిషనర్ మానిక్‌రాజ్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మరోవైపు తమ న్యాయ శాఖకు చెందిన ‘కమర్షియల్ కోర్ట్ ఫీ అండ్ ప్రాసెస్ ఫీ ఆన్లైన్ పేమెంట్’ అప్లికేషన్‌ను ఏపీ అధికారులు మక్కికి మక్కి కాపీ కొట్టి అప్లోడ్ చేశారని పరిశ్రమల శాఖ అధికారులు ఈ నెల ఐదో తేదీన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కాపీరైట్ యాక్టు సెక్షన్ 63 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తెలంగాణ పరిశ్రమల శాఖ అధికారులు, సమాచారాన్ని అప్లోడ్ చేసిన కన్సల్టెన్సీ ప్రతినిధుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పక్షాన ఈవోడీబీ నివేదికలు రూపొందించిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్ ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. సర్వీస్ కన్సల్టెన్సీ కేపీఎంజీ ప్రతినిధులు కూడా సోమవారం సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరై నివేదికలు రూపొందించిన తీరును వివరించినట్లు తెలిసింది. రెండో ర్యాంకుకు ఏపీ... అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంకు.. రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోంది. కాపీ వ్యవహారంపై ఫిర్యాదు నమోదయ్యే నాటికి 51.93 శాతం స్కోర్‌తో తెలంగాణ రెండో స్థానంలో.. 51.76 శాతం స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్ ప్రకారం డిప్ డ్యాష్ బోర్డులో 52.94 శాతం స్కోర్‌తో ఏపీ రెండో స్థానంలోనూ.. 52.52 శాతం స్కోర్‌తో తెలంగాణ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. నెలాఖరులోగా ప్రపంచ బ్యాంకు ఈవోడీబీ తుది ర్యాంకులను ప్రకటిస్తుంది.