సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత అనుకూల ప్రదేశమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో ఆటోమోబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయని, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో నిలిచేందుకు మొబిలిటీ రీసెర్చ్ క్లస్టర్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఆటోమొబైల్ రంగంలో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో సియామ్, సమావేశంలో ఆటో కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (అక్మా) సంస్థలతో కలసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని కేటీఆర్ తెలిపారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో సాధించిన ప్రగతి, ఆకర్షించిన భారీ పెట్టుబడులు, తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి కేటీఆర్ సియామ్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ సరఫరాకు ఏ కొరత లేదని ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు సంపూర్ణ సహకారంతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వమే ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ ఖర్చుతో టాస్క్ ద్వారా శిక్షణ ఇచ్చి అవసరమైన మానవ వనరులను సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ పాలసీలు భేష్..సియామ్ ప్రతినిధులు
హైదరాబాద్‌లో బిర్యానీ బాగుందని, అంతకుమించి తెలంగాణ పాలసీలు మరింత బాగున్నాయని సియామ్ ప్రతినిధులు కితాబిచ్చారు. తెలంగాణను డైనమిక్ స్టేట్‌గా చూస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పాలసీలను తాము ఇప్పటికే గుర్తించామని, పెట్టుబడులకు ఊతమిస్తున్న తీరు, మద్దతుపై మంత్రికి అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి రేటును ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో మానవ వనరులు, ఇతర మౌలిక వసతులు ఆటోమొబైల్‌రంగ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ప్రభుత్వ ప్రయత్నాలు బాగున్నాయన్న ప్రతినిధులు... ఈ రంగంపై పాలసీల రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో కలసి పనిచేస్తామన్నారు. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అవకాశాలపై ఆశావహంగా ఉన్నామని, ఈ ప్రయత్నాలకు ప్రభుత్వ పాలసీ మద్దతు కోరుతున్నామని తెలిపారు. క్లీన్ టెక్నాలజీ ఆధారిత ఎలక్ట్రికల్, హైబ్రీడ్ వాహనాలదే భవిష్యత్తు అని మంత్రికి సియామ్ ప్రతినిధులు తెలిపారు. దేశంలో ఏటా 2.8 కోట్ల వాహనాలు తయారవుతున్నాయని, వాటిలో 25 లక్షల వాహనాలు దేశీయంగా అమ్ముడవుతున్నాయని తెలిపారు. ఈ రంగంలో మరింత పెరుగుదలకు అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment